రాష్ట్రంలో గాడిద గుడ్డు పాలన : కిషన్ రెడ్డి

రాష్ట్రంలో గాడిద గుడ్డు పాలన : కిషన్ రెడ్డి
  • ఐదు గ్యారంటీలు కలలో అమలు చేసినట్టున్నరు: కిషన్ రెడ్డి 
  • కాంగ్రెస్ గాడిదగుడ్డు గుర్తు పెట్టుకున్నదని విమర్శ

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలో ప్రస్తుతం అమలు అవుతున్నవన్నీ పాత స్కీంలేనని.. గాడిద గుడ్డు తప్ప కొత్తగా ఇచ్చిందేమీ లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో గాడిద గుడ్డు పాలన కొనసాగుతోందని ఆయన ఫైర్ అయ్యారు. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ చెయ్యి గుర్తును మార్చుకొని గాడిద గుడ్డు గుర్తును పెట్టుకున్నట్టు ఉందని ఎద్దేవా చేశారు. ప్రగతి భవన్ కంచెలు కూల్చారు తప్ప, అక్కడ వచ్చిన దరఖాస్తుల్లో ఎన్ని పరిష్కరించారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత సీఎం కేసీఆర్ మసిపూసి మారేడు కాయ చేస్తే..

ప్రస్తుత సీఎం రేవంత్ ప్రజలకు గాడిద గుడ్డు ఇస్తున్నారని విమర్శించారు. శుక్రవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ నేతలు కృష్ణయాదవ్, కాసం వెంకటేశ్వర్లు, ఎన్వీ సుభాష్, బంగారు శృతి, రాణి రుద్రమ తదితరులతో కలిసి మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. రాష్ట్ర నిధులతోనే  బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ నిర్మిస్తామని 2018లో కేసీఆర్ హామీ ఇచ్చారని, కానీ ఆ ఫ్యాక్టరీ కట్టలేదన్నారు. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెట్టిండని విమర్శించారు. రాష్ట్రాన్ని విభజించి, ఐదు గ్రామాలను ఏపీలో కలిపింది ఎవరు? అని ప్రశ్నించారు.

గత ప్రభుత్వ హయాంలో కొలిక్కివచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలను ఇచ్చి రేవంత్ రెడ్డి వాటిని తన ఖాతాలో వేసుకున్నారని ఎద్దేవా చేశారు. ఒక్క తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదన్నారు. ఎలివేటర్ కారిడార్, రీజినల్ రింగ్ రోడ్డు బీజేపీ ఘనత అని.. కానీ వాటిని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుందన్నారు. ఆగస్టు 15లోపు రుణమాఫీ అంటూ కాకమ్మ కథలు చెప్తున్నారని విమర్శించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి సమక్షంలో ఐటీ కంపెనీ యజమాని వెంకటేశ్ యాదవ్ ఆధ్వర్యంలో పలువురు ఐటీ కంపెనీల మేనేజ్మెంట్ ప్రతినిధులు, ఉద్యోగులు, వరంగల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరారు.