కేంద్రమంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా.!

కేంద్రమంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా.!

ఢిల్లీలో జరిగిన  కేంద్ర కేబినెట్ మీటింగ్ కు కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు. ఢిల్లీలోని తన నివాసంలోనే ఉన్న కిషన్ రెడ్డి కేబినెట్ మీటింగ్ కు హాజరుకాకపోవడంపై సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. జూలై 4న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని  నియమించింది బీజేపీ హైకమాండ్. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి కిషన్ రెడ్డి ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. మీడియా ప్రశ్నించినా అధ్యక్ష పదవిపై నోరు మెదపకుండా సైలెంట్ గా వెళ్లిపోయారు. రాష్ట్ర అధ్యక్ష పదవిపై కిషన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయన రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది.  అయితే అనారోగ్య కారణంగానే కేబినెట్ మీటింగ్ కు హాజరుకాలేకపోతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని కిషన్ రెడ్డి ఇంటి దగ్గర కూడా మీడియా ప్రతినిదులను కానీ  ఎవర్నీ  అనుమతించట్లేదు.

బీజేపీ హైకమాండ్ తనను  కేంద్రమంత్రిగా, అటు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగిస్తారని  కిషన్ రెడ్డి భావించినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీలో ఒకరికి  ఒకే పదవి అనే సంప్రదాయంతో కిషన్ రెడ్డి తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. గతంలో కేంద్ర హోంశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అమిత్ షా కూడా పార్టీ జాతీయ అధ్యక్షపదవికి రాజీనామా చేసి కేంద్ర కేబినెట్ లోకి వెళ్లారు.  ఈ క్రమంలోనే కిషన్ రెడ్డి కూడా  కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జరుగుతోంది.  కిషన్ రెడ్డి కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేస్తారా.? లేదా   మరి కొన్ని రోజులు కొనసాగుతారా అన్నది చూడాలి.