ముస్లింలకు 10% రిజర్వేషన్లు తీసేస్తే.. బీసీల బాధ్యత నాది : కిషన్ రెడ్డి

ముస్లింలకు 10% రిజర్వేషన్లు తీసేస్తే.. బీసీల బాధ్యత నాది : కిషన్ రెడ్డి
  • 42% రిజర్వేషన్లపై రాష్ట్రపతి, మోదీని కలుస్త: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: ముస్లింలకు 10 శాతం రిజర్వేషన్లు తీసేస్తే.. 42% బీసీ రిజర్వేషన్ల బాధ్యత తాను తీసుకుంటానని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. స్వయంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీతో కలిసి మాట్లాడుతానని తెలిపారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో గురువారం మీడియాతో మాట్లాడారు. ‘‘ముస్లింలకు బీసీ రిజర్వేషన్లతో ముడిపెట్టొద్దు. అసదుద్దీన్, అజారుద్దీన్, షబ్బీర్ అలీ బీసీలు ఎలా అవుతారు? కాంగ్రెస్ ఇచ్చిన హామీలకు రేవంత్ కాదు.. రాహుల్, సోనియా బాధ్యత వహించాలి. 

బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్​ను గవర్నర్ ఆమోదిస్తే.. మళ్లీ రాష్ట్రపతికి పంపాల్సిన అవసరం ఉండదు. చట్టపరమైన, న్యాయపరమైన అనుమానాలు ఉంటేనే రాష్ట్రపతి సూచన కోసం పంపిస్తారు. తెల్వకపోతే గవర్నర్​ను అడిగి తెలుసుకోండి. మోదీని గద్దె దించుతా అని.. రాహుల్​ను ప్రధానిని చేస్తానని రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నడు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్నాటక, హిమాచల్​లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఆ పార్టీ ఘోరంగా ఓడిపోతది. ఏ ఒక్క రాష్ట్రంలో గెలిచినా.. రాహుల్ ఏం చెప్పినా అది చేసేందుకు నేను సిద్ధం. 

మళ్లీ కాంగ్రెస్​ను గెలిపించుకునే సత్తా రాహుల్​కు లేదు. వరుసగా 3 సార్లు ఓడిపోయిన మీరు.. మోదీకే సవాల్ విసురుతారా? తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉన్నది. గతంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లనే హైకోర్టు కొట్టేసింది. మళ్లీ 10 శాతం రిజర్వేషన్లు ఎట్లిస్తరు?’’అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. 

అమలు చేయలేని హామీలిచ్చి అధికారంలోకి..

తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ అమలు చేయలేని హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘‘420 గ్యారంటీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేస్తూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తున్నరు. అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై విమర్శలు చేస్తున్నారు. మైనార్టీ, యూత్, బీసీ డిక్లరేషన్ హామీలు ఏమైనయ్? బీసీల కోసం లక్ష కోట్లు ఇస్తామన్నరు. ఈ రెండేండ్లలో రూ.40వేల కోట్లు ఖర్చు పెట్టాలి కదా. 

ఎందుకు చేయలేదు? 18 నెలలుగా ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు. కాంగ్రెస్​కు ఓటేసి ఎందుకు గెలిపించామా అని రాష్ట్ర ప్రజలు పశ్చాత్తాపడ్తున్నరు. జంతర్ మంతర్ సభ.. సోనియా ఫ్యామిలీని పొగిడేందుకు.. మోదీని తిట్టేందుకు పెట్టుకున్నరా? ఢిల్లీలో ఉన్న ఆ పార్టీ అగ్ర నేతలెవరూ సభకు రాలేదు. కేసీఆర్ హోల్​సేల్ అవినీతికి పాల్పడితే.. కాంగ్రెస్ రిటైల్​గా అవినీతి చేస్తున్నది’’అని కిషన్ రెడ్డి ఆరోపించారు. 

అవినీతి, అప్పుల్లో తెలంగాణ టాప్

అవినీతిలో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పోటీపడ్తున్నదని కిషన్ రెడ్డి అన్నారు. ‘అవినీతి, అప్పుల్లో రాష్ట్రం టాప్​లో ఉంది. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్లు బీసీలకు అమలైతే.. దాన్ని కేసీఆర్ 27 శాతానికి తగ్గించిండు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ఎన్నో కుట్రలు చేసిండు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీసీలను మోసం చేస్తున్నది. సర్వేలో ఎన్నో తప్పులు ఉన్నయ్. మతపరమైన రిజర్వేషన్లు పెట్టి.. దేశంలో అశాంతి సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నది. రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ రాష్ట్ర మహిళా మంత్రి చేసిన కామెంట్లను ఖండిస్తున్నాం. మంత్రి కామెంట్లపై సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలి’’అని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.