కేంద్రమంత్రి గడ్కరీకి మరోసారి బెదిరింపు ఫోన్‌ కాల్‌

కేంద్రమంత్రి గడ్కరీకి మరోసారి బెదిరింపు ఫోన్‌ కాల్‌

ఢిల్లీ : కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత నితిన్‌ గడ్కరీకి మరోసారి బెదిరింపు ఫోన్‌కాల్‌ వచ్చింది. ఢిల్లీలోని మోతీలాల్‌ నెహ్రూ రోడ్‌లో ఉన్న ఆయన అధికారిక నివాసానికి సోమవారం (మే 15న) అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కేంద్రమంత్రి కార్యాలయానికి వచ్చిన బెదిరింపు ఫోన్‌ కాల్‌ వివరాలనుసేకరిస్తున్నామని, త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు. నిందితుడు ల్యాండ్‌లైన్‌ నంబర్‌ నుంచి ఫోన్ చేసినట్లు గుర్తించామన్నారు.

గతంలో కూడా నాగ్‌పూర్‌లోని నితిన్ గడ్కరీ కార్యాలయానికి రెండుసార్లు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. రూ.10 కోట్లు ఇవ్వకపోతే ఆయన ప్రాణాలకు హాని కలిగిస్తామంటూ జయేశ్‌ పుజారీ అనే వ్యక్తి ఫోన్‌ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీనిపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణ జరిపి నిందితుడిపై ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది.