రాష్ట్రంలో రజాకారుల రాజ్యం నడుస్తున్నది

రాష్ట్రంలో రజాకారుల రాజ్యం నడుస్తున్నది
  • ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల నిధులు దారిమళ్లిస్తున్నరు
  • బీఆర్ఎస్ పాలనపై కేంద్రమంత్రి భగవంత్ ఖుబా ఫైర్​

మహబూబ్ నగర్ అర్బన్ జడ్చర్ల టౌన్, వెలుగు: తెలంగాణలో రాజాకార్ల రాజ్యం నడుస్తున్నదని కేంద్ర సహాయ మంత్రి భగవంత్ ఖుబా అన్నారు. గురువారం మహబూబ్​నగర్​ జిల్లా పార్టీ ఆఫీసుతోపాటు జడ్చర్లలో ఓ ఫంక్షన్ హాల్​లో జరిగిన సమావేశాల్లో ఆయన బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్ రెడ్డి, పార్టీ రాష్ట్ర ట్రెజరర్​శాంతికుమార్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. 

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ రాజనీతి ఒకటేనని, కుటుంబ అభివృద్ధి వాటి లక్ష్యమన్నారు. పదేండ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. దీంతో మరోసారి ఉచితాల పేరుతో ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నం చేస్తున్నదన్నారు. బంగారు తెలంగాణ కాలేదు కానీ సీఎం కేసీఆర్ కుటుంబం మాత్రం బంగారు కుటుంబమైందన్నారు. 

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి.. దళితబంధు పేరు చెప్పి అర్హులైన దళితులకు ఇవ్వడం లేదన్నారు. అధికారమే లక్ష్యంగా ఐదు గ్యారంటీల పేరు చెప్పుకొని కాంగ్రెస్ కర్నాటకలో అధికారంలోకి వచ్చిందన్నారు. ఐదు నెలలైనా వారు ఇచ్చిన ఐదు గ్యారంటీలను అమలు చేయడం లేదన్నారు అదే ఫార్ములాను తెలంగాణలో అమలు చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తున్నదన్నారు. 

ALSO READ: పశ్చిమ కాంగ్రెస్‍లో.. టిక్కెట్‌‌ కొట్లాట

తెలంగాణలోని మంత్రుల్లో అత్యంత అవినీతి మంత్రి ఎవరైనా ఉన్నారు అంటే పాలమూరు మంత్రి పేరు వస్తుందన్నారు. సమావేశంలో జి.పద్మజా రెడ్డి, ఎగ్గని నర్సింలు, డోకూరు పవన్ కుమార్ రెడ్డి, వీర బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు.