
కరీంనగర్, వెలుగు : హిందూ సంఘటిత శక్తిని చాటేలా ఈ నెల 22న హిందూ ఏక్తా యాత్ర నిర్వహించబోతున్నామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ వెల్లడించారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ మండలాల అధ్యక్షులు, ఇన్‌చార్జులు, ముఖ్య నాయకులు, మహిళా మోర్చా నాయకులతో శుక్రవారం కరీంనగర్‌లో నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని, ఇప్పుడు మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌తో రాజకీయాలు నడువవన్నారు. పహెల్గాం ఘటనను చూసి ప్రతి హిందువు రగిలిపోయారని, ఇప్పుడు హిందువులంతా ఏకం కావాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లాలని, హిందూ ఏక్తాయాత్రకు ఆహ్వానించాలని పిలుపునిచ్చారు. లక్ష మందికి తగ్గకుండా ర్యాలీలో పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, రెడ్డబోయిన గోపి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, మాజీ మేయర్ సునీల్‌రావు, చెన్నమనేని వికాస్‌రావు, గుగ్గిళ్ల రమేశ్, ఓదేలు, వాసాల రమేశ్ పాల్గొన్నారు.