టీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం పోయింది

టీఆర్ఎస్ పై ప్రజలకు నమ్మకం పోయింది

రంగారెడ్డి జిల్లా: టీఆర్ఎస్ సర్కారుపై ప్రజలకు నమ్మకం పోయిందని కేంద్ర టెలికాం శాఖ సహాయ మంత్రి దేవుసింగ్ చౌహాన్ ఆరోపించారు. జిల్లాలోని తుర్కయంజాల్ మున్సిపాలిటీలో మంగళవారం ఆయన పర్యటించారు. అనంతరం ఇంజాపూర్ లో  ఏర్పాటు చేసిన కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... పేదల సంక్షేమం కోసం మోడీ నేతృత్వంలోని కేంద్ర సర్కార్ అనేక పథకాలు అమలు చేస్తోందన్నారు. భారత్ లో తయారుచేసిన కోవిడ్ వ్యాక్సిన్ ను ప్రపంచ దేశాలు వినియోగిస్తుండటం గర్వకారణమని తెలిపారు. సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలు చేయడంలేదని మండిపడ్డారు.

పీఎం మోడీని చూస్తే కేసీఆర్ కు భయం పుడుతోందన్న ఆయన... అందుకే మోడీ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడల్లా కేసీఆర్ పక్క రాష్ట్రాలకు పారిపోతున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో పీకల్లోతు వ్యతిరేకత ఉందని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నరసింహారెడ్డి, కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యుడు బోసుపల్లి ప్రతాప్, బీజేపీ సీనియర్ నాయకులు నోముల దయానంద్ గౌడ్, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బచ్చిగళ్ల రమేష్, కొండ్రు పురుషోత్తం, నోముల కార్తిక్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.