సమానత్వం దిశగా మహిళలు

సమానత్వం దిశగా మహిళలు

సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర అపారమైనది.  ప్రపంచవ్యాప్తంగా మహిళా హక్కుల కోసం అనేక పోరాటాలు  ఉద్యమాలు జరిగాయి. పర్యవసానంగా  నేడు విద్య, వైద్య, రాజకీయ, శాస్త్ర- సాంకేతిక, రక్షణ, వ్యాపారం వంటి అనేక రంగాల్లో  మహిళలు ముందంజలో ఉన్నారు. 

మహిళలు అనునిత్యం అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నా  నేడు పురుషులతో సమానస్థాయిలో తమ ప్రతిభను కనబరుస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని మహిళలు దేశ అధ్యక్షులుగా,  ప్రధానులుగా, సైనిక అధిపతులుగా ఉన్నత ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు, బాధ్యతలు నిర్వహిస్తున్నారు.   అగ్రరాజ్యంగా పేరొందిన అమెరికాలో సైతం ఓటు హక్కు కోసం మహిళలు పెద్ద ఉద్యమాన్ని నడిపారు. ఆ ఉద్యమానికి గుర్తుగానే ఆగస్టు 26 నాడు ఐక్యరాజ్యసమితి మహిళా సమానత్వ దినోత్సవాన్ని జరుపుతోంది. 

ఐక్యరాజ్యసమితి  చట్టాలు 

1948 నాటి విశ్వవ్యాప్త మానవ హక్కుల ప్రకటన ప్రకారం ప్రతి మనిషికి,  స్త్రీలు, పురుషులకీ సమాన హక్కులు ఉన్నాయని  స్పష్టమైంది.  మహిళలపై అన్ని రకాల వివక్షతల నిర్మూలనపై సమావేశం 1979లో జరిగింది.    ఈ సమావేశంలో మహిళల కోసం ప్రత్యేకంగా  అంతర్జాతీయ చట్టాన్ని రూపొందించారు.  దీనిని  ‘మహిళల హక్కుల అంతర్జాతీయ బిల్లు’ అని కూడా అంటారు. 1995లో బీజింగ్​లో జరిగిన మహిళల సదస్సులో 12 కీలక రంగాలలో  మహిళల సాధికారత కోసం కార్యాచరణ  ప్రణాళిక రూపొందించారు. 

స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలైన (- 2015–-2030) 17 లక్ష్యాలలో  లక్ష్యం 5- లింగ సమానత్వం (జండర్​ ఈక్వాలిటీ) ప్రత్యేకంగా మహిళా సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఇందులో బాల్యవివాహం నిర్మూలన,  మహిళలపై  హింస నివారణ, నిర్ణయాధికారంలో భాగస్వామ్యం వంటి అంశాలు ఉన్నాయి. అంతర్జాతీయ కార్మిక సంస్థ సమావేశాల్లో ఉద్యోగాలలో సమాన వేతనం( 1951)తో పాటు వివక్షకు వ్యతిరేకంగా (1958) చట్టాలు రూపొందించడం జరిగింది. 

మొత్తంగా, ఐక్యరాజ్యసమితి మహిళలపై వివక్షను తొలగించడం, సమాన హక్కులు కల్పించడం, సాధికారతను పెంపొందించడం లక్ష్యంగా అనేక చట్టాలు, ఒప్పందాలను రూపొందించి  దేశాలకు అమలు చేయమని సూచించింది.

సఫ్రజిస్ట్ ఉద్యమం.. సమానత్వం కోసం నాంది 

పాశ్చాత్య దేశాల్లో స్త్రీలకు ఓటుహక్కు కోసం జరిగిన సఫ్రజిస్ట్ ఉద్యమం నుంచి ఆసియా, ఆఫ్రికా దేశాల్లో స్వాతంత్ర్య పోరాటాల్లో మహిళల భాగస్వామ్యం వరకు.. ప్రతిచోటా మహిళల ధైర్యసాహసాలు చరిత్రలో నిలిచాయి. అనేక రంగాల్లో  ఈ మహిళా ఉద్యమాలు గణనీయమైన మార్పులు తీసుకువచ్చాయి. ఈ ఉద్యమాలు  సమాజం మొత్తం పురోగతి, న్యాయం, సమానత్వం సాధించడంలో ప్రధాన శక్తిగా నిలిచాయి.  అమెరికాలో 19వ శతాబ్దంలోనే ‘సఫ్రేజ్ ఉద్యమం’ ప్రారంభమైంది. 

ఈ ఉద్యమానికి ఎమెలిన్ పాంక్‌హస్ట్  నాయకత్వం వహించారు.  ఉద్యమ ఫలితంగా 1920లో మహిళలకు ఓటు హక్కు లభించింది. ఫ్రాన్స్, 
జర్మనీ, కెనడా వంటి దేశాల్లోనూ మహిళలు సమాన వేతనం, విద్యావకాశాలు, ఉద్యోగాలలో సమాన హక్కుల కోసం పోరాటాలు చేశారు.  ఈ ఉద్యమాల వలన మహిళలకు విద్య, రాజకీయాలు, ఉపాధి, ఆర్థికరంగం, సామాజిక గౌరవంతో ప్రపంచవ్యాప్తంగా మహిళల సాధికారతకు మార్గదర్శకంగా నిలిచాయి.

మహిళా చట్టాలు

సరోజినీనాయుడు,  అనిబిసెంట్,  కస్తూర్బా గాంధీ, అరుణా ఆసఫ్అలి వంటి మహనీయులు మహిళల హక్కుల కోసం,  సమానత్వం కోసం కృషి చేశారు.  భారతదేశంలో మహిళల సమానత్వం కోసం అనేక చట్టాలు రూపొందాయి. అవి: సమాన వేతన చట్టం (1976),   1961లో వరకట్న  నిషేధ చట్టం,   గృహ హింస నిరోధక చట్టం (2005),  మాతృత్వ లాభాల చట్టం (1961) మహిళలపై  జరుగుతున్నదాడులు, అత్యాచారాలు మూలంగా లైంగిక వేధింపుల నిరోధక చట్టం (2013)ను  రూపొందించారు.  

హిందూ వారసత్వ సవరణ చట్టం (2005) ద్వారా హిందూ మహిళలకు కూడా పురుషులతో  సమానంగా ఆస్తి హక్కులు కల్పిస్తుంది. ప్రీ-కన్సెప్షన్ & ప్రీ-నాటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ చట్టం( 1994) గర్భంలో బిడ్డ లింగ నిర్ధారణ చేయడం, ఆ ఆధారంగా గర్భస్రావం చేయించడం నిషేధంతో పాటు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14  సమానత్వ హక్కు, ఆర్టికల్ 15  లింగం ఆధారంగా వివక్ష నిషేధం, ఆర్టికల్ 16  ఉపాధి అవకాశాలలో సమాన హక్కులు వంటివి మహిళల రక్షణ, సాధికారత,  సమానత్వం కోసం ముఖ్యమైన పునాదిగా నిలిచాయి.

మహిళా సాధికారతకు మార్గం 

1920వ సంవత్సరంలో అమెరికాలో 19వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు ఓటుహక్కు కల్పించారు.   మనదేశంలో స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మహిళలకు ఓటుహక్కును కల్పించారు. మన దేశంలో  మహిళలు కేవలం ఓటువేసేవారిగానే కాకుండా  పార్లమెంటులో,  రాష్ట్రాల శాసనసభల్లో,  స్థానిక సంస్థల్లో నాయకురాలిగా ఎదిగేందుకు అవకాశాలు కూడా  వచ్చాయి. రాజ్యాంగం 1992 నాటి  పంచాయతీరాజ్ చట్టం ద్వారా కల్పించింది.  కానీ,  అది చట్టంగానే మిగిలిపోతోంది. 

ప్రస్తుతం భారత పార్లమెంటులో మహిళా ప్రాతినిధ్యం కేవలం 74,  అనగా 13.6 %  మాత్రమే ఉంది. మహిళలకు అన్ని పార్టీలు ఎక్కువ స్థానాలు కల్పిస్తే  రాజకీయంగా మహిళల ప్రాతినిధ్యం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే, సమాన హక్కులు, గౌరవం, నాణ్యమైన జీవితం సాధించేవరకు దేశంలో మహిళా ఉద్యమాలు  కొనసాగాల్సిన అవసరం మాత్రం ఉంది.

 నేడు అంతర్జాతీయ మహిళా సమానత్వ దినోత్సవం

సమకాలీన  మహిళా ఉద్యమాలు 
దేశ స్వాతంత్ర్యం తర్వాత సమానవేతనం,  ఆస్తి హక్కులు, గృహహింస వ్యతిరేక చట్టాలు కోసం మహిళా సంఘాలు కృషి చేశాయి. సమకాలీన అంతర్జాతీయ మహిళా ఉద్యమాలు జరిగాయి. ‘మీటూ’ ఉద్యమం (2017) లైంగిక వేధింపులు, లింగ అసమానత్వంపై  ప్రపంచవ్యాప్తంగా గొప్ప చైతన్యం కలిగించింది.  హీ ఫర్​ షీ ఉద్యమం (యూఎన్​ ప్రారంభించినది). ఇది పురుషులు, మహిళలు కలిసి సమానత్వం కోసం పోరాడే వేదిక.  చట్టసభల్లో  మహిళలకు రిజర్వేషన్ల బిల్లును మన పార్లమెంటు ఆమోదించడం ఆహ్వానించదగ్గ పరిణామం. బహుశా 2029 నుంచి మన పార్లమెంటు, అసెంబ్లీలలో  మహిళల సంఖ్య పెరగవచ్చు.

- డా. హరిత సూరప్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫ్యాకల్టీ, నిజాం కాలేజ్, హైదరాబాద్