ఈ ఏడాది 5.8 %, వచ్చే ఏడాది 6.7 % వృద్ధి సాధ్యం
గ్లోబల్ ఎకానమీ గ్రోత్ అంచనాలు 1.9 శాతానికి తగ్గించిన యూఎన్
న్యూఢిల్లీ : ఇండియా ఎకానమీ స్ట్రాంగ్‌గా ఉందని, వచ్చే ఏడాది 6.7 శాతం వృద్ధి సాధిస్తుందని యునైటెడ్ నేషన్స్ పేర్కొంది. ఇతర జీ20 దేశాలతో పోలిస్తే ఇండియా వృద్ధి ఎక్కువగా ఉంటుందని అంచనావేసింది. లోకల్‌గా డిమాండ్ బాగుండడంతో ఇండియా ఎకానమీ సమీప కాలంలో స్ట్రాంగ్‌గా ఉంటుందని యూఎన్ గ్లోబల్ ఎకనామిక్ మానిటరింగ్ బ్రాంచ్ చీఫ్ హమిద్ రషిద్ పేర్కొన్నారు. వరల్డ్ ఎకానమీ పరిస్థితులపై ఒక రిపోర్ట్‌ను ఆయన తాజాగా విడుదల చేశారు. ఈ ఏడాది దేశ ఎకానమీ గ్రోత్ 5.8 శాతంగా ఉంటుందని ఈ రిపోర్ట్ అంచనావేసింది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండడం, గ్లోబల్ ఎకానమీ స్లోడౌన్‌లో ఉండడంతో ఇండియా వృద్ధిపై కొంత ప్రభావం పడుతుందని తెలిపింది. ఇతర సౌత్ ఏషియన్ దేశాలతో పోలిస్తే ఇండియా ఎకానమీ స్ట్రాంగ్‌గా ఉంటుందని, 2024 లో 6.7 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనావేసింది. ఇండియాలో పేదరికంలో ఉన్నవారు ఎక్కువగానే ఉన్నారని హమిద్ పేర్కొన్నారు. సస్టయినబుల్ గ్రోత్ సాధిస్తే పేదరికం తగ్గే అవకాశం ఉంటుందని అన్నారు. దేశ ఎకానమీ ఎందుకు స్ట్రాంగ్‌గా ఉంటుందో హమిద్ వెల్లడించారు. గత నాలుగేళ్లలో అన్ఎంప్లాయ్మెంట్ 6.4 శాతానికి తగ్గిందని, 2017 తర్వాత ఇదే అత్యంత తక్కువ లెవెల్ అని పేర్కొన్నారు. డొమెస్టిక్ డిమాండ్ బలంగా ఉందని దీని బట్టి తెలుస్తోందన్నారు. ‘ఇండియాలో ఇన్ఫ్లేషన్ బాగా తగ్గి 5.5 శాతానికి దిగొచ్చింది. వచ్చే ఏడాది ఇది 5 శాతానికి తగ్గొచ్చు. దీంతో ఆర్బీఐ మానిటరీ పాలసీని కఠినం చేయాలని చూడడం లేదు’ అని హమిద్ పేర్కొన్నారు. ఇండియా దిగుమతులు తగ్గాయని ఆయన వెల్లడించారు. ముఖ్యంగా క్రూడాయిల్ దిగుమతులు తగ్గుముఖం పడుతున్నాయని అన్నారు. ఈ ఏడాది, వచ్చే ఏడాది దేశ ఎకానమీ మరింత వృద్ధి చెందడానికి ఇది సాయపడుతుందని వివరించారు. గ్లోబల్‌గా వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిల్లో ఉండడంతో దేశ ఎకానమీపై నెగెటివ్ ప్రభావం ఉండొచ్చని అన్నారు. యూరప్, యూఎస్ ఎకానమీలు స్లోడౌన్లోకి జారుకుంటే ఇండియా ఎగుమతులపై ప్రభావం పడుతుందని వివరించారు.
తగ్గిన గ్లోబల్ ఎకానమీ గ్రోత్ అంచనాలు ..
గ్లోబల్ ఎకానమీ గ్రోత్ ఈ ఏడాది 1.9 శాతంగా నమోదవుతుందని యుఎన్ రిపోర్ట్ అంచనావేసింది. కిందటేడాది ప్రారంభంలో ఇది 3 శాతంగా ఉంటుందని అంచనావేశారు. ఫుడ్, ఎనర్జీ సంక్షోభం, కోవిడ్ ప్రభావం, హై ఇన్ఫ్లేషన్, వాతావరణ మార్పుల వలన గ్లోబల్ ఎకానమీపై తీవ్ర ప్రభావం పడిందని యూఎన్ తెలిపింది. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల వృద్ధి అంచనాలను ఈ సంస్థ తగ్గించింది. వచ్చే ఏడాది గ్లోబల్ ఎకానమీ పుంజుకుంటుందని, 2.7 శాతం వృద్ధి సాధిస్తుందని అంచనావేసింది. తాజాగా వరల్డ్ బ్యాంక్ కూడా గ్లోబల్ ఎకానమీ వృద్ధి అంచనాలను 2023 కి గాను 3 శాతం నుంచి 1.7 శాతానికి తగ్గించింది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా ఈ ఏడాది గ్లోబల్ ఎకానమీ గ్రోత్ రేటు 2.7 శాతం దగ్గర ఉంటుందని లెక్కించింది. 2021 లో 6 శాతం, 2022 లో 3.2 శాతం గ్రోత్‌ను గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ నమోదు చేసింది.