
తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ఏర్పడిన నిర్మల్ ఆదిమ వంశీయ, సాంస్కృతికంగా ప్రాచీనమైన ప్రాంతం. అడవులు, కళలు, హస్తకళలతో ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఈ ప్రాంతం ఇప్పటికీ ఒక్క యూనివర్సిటీకి నోచుకోలేదు. ఆధునిక తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లాలు విద్యా అభివృద్ధిలో ముందుకు సాగుతున్న తరుణంలో నిర్మల్లో యూనివర్సిటీ స్థాపనపై ప్రజల డిమాండు రోజురోజుకూ ఉధృతమవుతోంది. వాస్తవానికి తెలంగాణ ప్రాంతంలో నిధులు, ఉపాధ్యాయులు కొరతతో ఉన్నత విద్య నష్టపోయిందని భావించి, కొత్త విశ్వవిద్యాలయాల స్థాపనకు ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలో చారిత్రక ప్రాధాన్యం ఉన్న నిర్మల్ లో విశ్వవిద్యాలయ స్థాపనకు జిల్లావ్యాప్తంగా విద్యార్థులు, మేధావులు, స్థానిక ప్రజలు కదం తొక్కుతున్నారు. ప్రస్తుతం విద్యార్థులు డిగ్రీ, పీజీ లేదా ఉన్నత చదువులు చదవాలంటే నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ లేదా హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితి.
విద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు, సామాజిక సంస్థలు కలిసి ‘నిర్మల్‌కు యూనివర్సిటీ కావాలి’ అనే నినాదంతో నిరంతర ర్యాలీలు, సంతకాల సేకరణలు, మీడియా ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఉద్యోగాలు పెరగడం, పరిశోధన కేంద్రాలు ఏర్పడే అవకాశం, గ్రామీణ యువతకు సులభ విద్యా ప్రాప్తి అనే ఈ మూడు లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని యూనివర్సిటీ కోసం జరుగుతున్న పోరాటం సమాజంలో చైతన్యానికి సంకేతంగా మారుతోంది. ఉన్నత విద్య అవకాశాలను సమానంగా అందుబాటులో ఉంచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం రాజ్యాంగబద్ధ బాధ్యత మాత్రమే కాదు, ప్రజాస్వామిక నైతికతకు కూడా సూచిక.
విద్యకోసం ఉద్యమాలు
విశ్వవిద్యాలయాల ఏర్పాటు కోసం ప్రపంచవ్యాప్తంగా అనేక ఉద్యమాలు, నిరసనలు జరిగాయి. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం స్థాపించడానికి విద్యార్థులు విద్యా స్వాతంత్య్రం కోసం పోరాడారు. ఫ్రెంచ్ విప్లవం సమయంలో స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే నినాదంతో ప్రజలు విద్యను రాజకీయం నుంచి విముక్తం చేయాలనే లక్ష్యంతో పోరాడారు. ఫలితంగా విద్యా వ్యవస్థ సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది. యువత ఆధునిక విద్య అవసరాలను డిమాండ్ చేస్తూ చైనాలో విద్యా పునరుద్ధరణ కోసం ఉద్యమించారు. ఇది చైనా విశ్వవిద్యాలయ వ్యవస్థపై ప్రభావం చూపింది. వియత్నాం యుద్ధానికి వ్యతిరేకంగా, నల్లజాతీయుల హక్కుల కోసం విద్యార్థులు ఉద్యమించగా దీని ప్రభావంతో విద్యాసంస్థలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా యూనివర్సిటీల్లో ‘ఎథ్నిక్ స్టడీస్’, ‘జెండర్ స్టడీస్’, వంటి కోర్సుల ఆరంభమై విద్య పరిధి మరింతగా విస్తృతమైంది. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో ఆధునిక విశ్వవిద్యాలయాల ఏర్పాటు కోసం ఉద్యమాలు జరిగాయి. లార్డ్ మెకాలే సూచించిన విద్యావిధానం, దాంతోపాటు వుడ్స్ నివేదిక భారతదేశంలో ఆధునిక విద్యకు పునాది వేశాయి. భారతదేశంలో 1857లో కలకత్తా, మద్రాస్, బొంబాయిలలో ఆధునిక విశ్వవిద్యాలయాల స్థాపన కోసం ఉద్యమాలు జరిగాయి.
2009లోనే పూర్వ ఆదిలాబాద్ జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం మంజూరైంది. అది కూడా ఆదిలాబాద్ లోనే అత్యంత ప్రాధాన్యత గల నిర్మల్‌లోనే ఏర్పాటు చేయాలనే వాదనలు జరిగాయి. నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఈ విషయంలో సానుకూలంగా స్పందించాడు. తదనంతర తెలంగాణ రాష్ట్ర అవతరణ, రాజకీయ పరిస్థితులలో వచ్చిన మార్పుల నేపథ్యంలో నిర్మల్ లో విశ్వవిద్యాలయ ఏర్పాటు అంశం అటకెక్కింది.
చారిత్రక ఆవశ్యకత
ఉన్నత విద్యలో, పరిశోధనను బోధన నుంచి వేరు చేశారు. ఇటీవలి పరిణామాల గురించి విద్యార్థులు మరింత తెలుసుకోవడానికి పరిశోధకులు మరింతగా బోధించాలి. దీనికి పరిష్కారం ఉన్నత విద్యలో మార్పులు తెస్తూ విశ్వవిద్యాలయాలను స్థాపించడమే. హార్వర్డ్, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్ వంటి అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన సంస్థలు ఇక్కడ తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపుతున్నాయి. పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం కోసం చాలా కాలంగా డిమాండ్ ఉంది. ఉట్నూరులోని ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, విశ్వవిద్యాలయం కోసం భూమిని కూడా గుర్తించింది. ప్రారంభ ప్రతిపాదన ఉట్నూర్ కోసం అయితే, విశ్వవిద్యాలయం తరువాత ములుగుకు మారింది. ఈ సందర్భంలో నిర్మల్లో విశ్వవిద్యాలయ స్థాపన ఒక చారిత్రక ఆవశ్యకతను సంతరించుకుంది. విశ్వవిద్యాలయాల స్థాపన వెనుక ఉన్న ఉద్యమాలు కేవలం విద్యాబోధనే కాదు అవి సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రం, ప్రాంతీయ గౌరవం వంటి విలువల సమాహారం. కొత్త విశ్వవిద్యాలయాల స్థాపనకూ ఇదే స్పూర్తి ప్రేరణగా నిలుస్తోంది.
శాంపిట్రోడా సూచనలు
భారతదేశంలో పెద్ద మొత్తంలో విశ్వవిద్యాలయాలను స్థాపించాలని శాం పిట్రోడా సూచించాడు. ప్రస్తుత విద్యావసరాల దృష్ట్యా దేశవ్యాప్తంగా 1500 కొత్త విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశాడు. ఉన్నత విద్యలో ఉన్న శూన్యతను పూరించడానికి విశ్వవిద్యాలయాల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కీలకమని పిట్రోడా విశ్వసించాడు. అదేవిధంగా ఈ సంస్థలు పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలపై దృష్టి పెట్టవలసిన అవసరముందని, దాంతోపాటుగానే ఉద్యోగాల సృష్టి, సంపదను సృష్టించడానికి పరిశ్రమలతో ఏకీకృతం కావాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.
ప్రతి జిల్లాకు కనీసం ఒక విశ్వవిద్యాలయం ఉండాలి. స్థానికంగా ఉపాధ్యాయ శిక్షణా కేంద్రాలు, స్కిల్స్ యూనివర్సిటీలు పెంచాలి. ఈ ప్రక్రియలో నిర్మల్ వంటి జిల్లాలు ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పిట్రోడా సూచనల ప్రకారం నూతన విశ్వవిద్యాలయాల ఏర్పాటుతోపాటు, నిర్మల్ జిల్లాలో విశ్వవిద్యాలయ స్థాపన అనేది సమకాలీన విద్య అవసరాలకు తగిన మార్గదర్శకం.
- జయప్రకాశ్ అంకం,
అసిస్టెంట్ ప్రొఫెసర్,
గవర్నమెంట్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ,
కామారెడ్డి