
న్యూఢిల్లీ: ఇండియాలో పొలం పనులు చేసే మహిళల ఇళ్లలోని పిల్లలకు పోషకాహార లోపం ఎక్కువుంటుందని వెల్లడైంది. అగ్రికల్చరల్ పనులు చేసే ఆడవారు ఇంటి పనులు, పిల్లల ఆలనాపాలనపై ఎక్కువగా దృష్టి పెట్టలేరని, దీంతో ఆ ఇళ్లల్లోని చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతుంటారని తెలిసింది. బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఎంగ్లియా రీసర్చర్ల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. పరిశోధన కోసం 2014-16 మధ్య మహారాష్ట్రలోని వార్దా, ఒడిశాలోని కోరాపూట్ జిల్లాల్లో 12 ఊళ్లలో ప్రాథమిక డేటాను రీసర్చర్లు సేకరించారు. రెండు జిల్లాల్లోనూ 50 శాతం మంది పిల్లలు తక్కువ బరువున్నట్టు గుర్తించారు. వార్దాలో మహిళలు పత్తి చేలలో ఎక్కువగా పని చేస్తుంటారని.. ఈ పత్తి నుంచి దుమ్ము, వాసనతో తలనొప్పి వచ్చి తినాలని, వండాలని అనిపించదని పరిశోధకులు చెప్పారు. ఇది పిల్లలపై ప్రభావం చూపుతుందన్నారు. కోరాపూట్‌లో హ్యూమన్ డెవలప్‌మెంట్ స్థాయి తక్కువని, ఇక్కడ ప్రజలు 13 గంటలకన్నా ఎక్కువ సేపు పని చేస్తుంటారని, పంట కోతకొచ్చే టైంలోనైతే మరీ ఎక్కువ పని ఉంటుందని రీసర్చర్లు చెప్పారు. దీంతో సరిగా నిద్ర ఉండదని, దీని ప్రభావమూ ఇంటిల్లిపాదిపై ఉంటుందని తెలిపారు. ఇలా ఎక్కువ సేపు పని చేయడం వల్ల చిన్నారులను మహిళలు సరిగా చూసుకోలేరని, పాలివ్వడం, భోజనం తినిపించడం తగ్గుతుందని వివరించారు.