
బర్రెలక్కకు 5,754 ఓట్లు
నిరుద్యోగుల ప్రతినిధిగా కొల్లాపూర్ బరిలో నిలిచిన బర్రెలక్క అలియాస్ శిరీష ఓటమి పాలయినప్పటికీ నైతికంగా గెలిచింది. 5,754 ఓట్లు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. తనదైన శైలిలో ప్రచారం చేస్తూ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులను శిరీష టెన్షన్ పెట్టింది. రాజకీయ వారసత్వం, ధనబలం లేకపోయినా ఆమె పోరాడి అందరినీ ఆకట్టుకున్నది. స్థానిక సమస్యలు, నిరుద్యోగంపై తన వాయిస్ వినిపించింది.
పోచారం నయా రికార్డు
రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్‌గా ఉండి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన నాయకుడిగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి చరిత్రలో నిలిచారు. 2014లో స్పీకర్‌గా పని చేసిన మధుసూదనాచారి 2018 ఎన్నికల్లో భూపాలపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఏపీ స్పీకర్‌గా పని చేసిన కోడెల శివ ప్రసాద్‌రావు 2019 ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2019 నుంచి స్పీకర్ గా పని చేస్తున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు.
ఓయూ ఉద్యమకారుల్లో ఒక్కరే విన్
ఓయూ ఉద్యమకారుల నుంచి ఈసారి చొప్పదండి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన మేడిపల్లి సత్యం మాత్రమే అసెంబ్లీకి వెళ్లనున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే గాదరి కిషోర్, చెన్నూర్ నుంచి బాల్కసుమన్ ఓటమి పాలయ్యారు. పలువురు ఓయూ ఉద్యమకారులు కాంగ్రెస్, బీఆర్ఎస్ నుంచి టికెట్లు ఆశించినప్పటికి వారికి దక్కలేదు. జనగామ టికెట్ ఇవ్వాలని బాలలక్ష్మి, సత్తుపల్లి టికెట్ ఆశించిన కోటూరి మానవతా రాయ్, మానకొండూరు నుంచి బీజేపీ టికెట్ ఆశించిన దరువు ఎల్లన్నకు టికెట్ రాలేదు.
కుత్బుల్లాపూర్‌లో అత్యధికం, చేవేళ్లలో అత్యల్ప మెజార్టీ
కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి కేపీ.వివేకానంద్ అధిక మెజారిటీతో గెలుపొందిన వ్యక్తిగా నిలిచారు. ఆయనకు 85,576 మెజారిటీవచ్చింది. తర్వాత.. ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ 81,660 మెజారిటీ వచ్చింది. అలాగే, చేవేళ్ల నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య అత్యల్పంగా 268 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. యాకుత్‌పురాలో ఎంఐఎం అభ్యర్థి జాఫర్ హుస్సేన్ 878 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ఉమ్మడి వరంగల్‌లో నోటాకు 21 వేల ఓట్లు
హనుమకొండ, వెలుగు: ఉమ్మడి వరంగల్ జిల్లాలో 21,174 మంది నోటాకు ఓటేశారు. వర్ధన్నపేటలో 3,612 , పాలకుర్తిలో 2,743, వరంగల్ వెస్ట్ లో 2,426 ఓట్లు నోటాకు పడ్డాయి. నర్సంపేట నియోజకవర్గంలో 738 ఓట్లు , భూపాలపల్లిలో 830, పరకాలలో 966, స్టేషన్ ఘన్ పూర్ లో 1,153, డోర్నకల్ లో 1,392, జనగామలో 1,467 ఓట్లు నోటాకు పోలయ్యాయి. వీటితో పాటు మహబూబాబాద్ లో 1,932, ములుగులో 1,937, వరంగల్ ఈస్ట్ లో 1,978 నోటాకు వేయడం విశేషం.
ఒకే గ్రామం.. ఒకే పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు!
దమ్మపేట, వెలుగు : ఒకే గ్రామం.. ఒకే పార్టీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామానికి చెందిన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు, అదే గ్రామానికి చెందిన జారే ఆదినారాయణ కాంగ్రెస్ నుంచి టికెట్ దక్కించుకున్నారు. ఒకరు ఖమ్మం, మరొకరు అశ్వారావుపేట స్థానాల నుంచి పోటీ చేశారు. ఇద్దరూ అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో ఆ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ట్రాన్స్‌జెండర్ పుష్పిత లయకు 970 ఓట్లు
వరంగల్ తూర్పు సీటులో బీఎస్పీ నుంచి పోటీ చేసిన ట్రాన్స్‌జెండర్ చిత్రపు పుష్పిత లయ ఐదో స్థానంలో నిలిచారు. 17 రౌండ్లలో కలిపి ఆమెకు 966 ఓట్లు వచ్చాయి. మరో 4 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలిపి మొత్తంగా పుష్పితకు 970 ఓట్లు పోలయ్యాయి. మొదటి నాలుగు స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, అలయెన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫామ్స్ పార్టీ అభ్యర్థులు కొండా సురేఖ, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, నన్నపనేని నరేందర్, కౌటం రవీందర్ నిలిచారు. రాష్ట్రంలో పోటీచేసిన ఏకైక ట్రాన్స్ జెండర్ గా పుష్పిత లయ రికార్టు సృష్టించారు.
నలుగురు ఎమ్మెల్సీల గెలుపు
అసెంబ్లీ ఎన్నికల్లో నలుగురు ఎమ్మెల్సీలు విన్ అయ్యారు. మహబూబ్ నగర్ లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి స్టేషన్ ఘన్ పూర్, హుజూరాబాద్ నుంచి గెలుపొందారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో కౌన్సిల్ లో 4 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవనున్నాయి.