
రోడ్డు ప్రమాదానికి గురైన ఉన్నావ్ రేప్ బాధితురాలి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమెకు వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నామని ఎయిమ్స్ డాక్టర్లు తెలిపారు. వారం రోజుల క్రితం బంధువులతో కలసి రాయబరేలి వెళుతున్న ఆమె కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె బంధువులిద్దరు చనిపోయారు. ఆమెకు తీవ్రగాయాలవడంతో యూపీలోని లక్నో ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. అయితే మెరుగైన వైద్యం కోసం ఆమెను సోమవారం లక్నో నుంచి ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ట్రామా సెంటర్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఎయిమ్స్ ట్రామా సెంటర్ చీఫ్ డాక్టర్ రాజేశ్ మల్హోత్రా తెలిపారు.