పేకాట అడ్డాలుగా ఫామ్ హౌజ్​లు!

పేకాట అడ్డాలుగా ఫామ్ హౌజ్​లు!
  • రెగ్యులర్​గా వీకెండ్​ పార్టీలు
  • చూసిచూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు

మెదక్, శివ్వంపేట, వెలుగు: ఫామ్​హౌజ్​ల ముసుగులో అసాంఘీక కార్యకలాపాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో, ఫారెస్ట్​ ఏరియాల్లో అగ్రికల్చర్​ భూములు కొనుగోలు చేసి ఫామ్​హౌజ్​లు ఏర్పాటు చేసి వీకెండ్​ పార్టీలు నిర్వహిస్తున్నారు. మరికొన్ని ఫామ్​హౌజ్ లను పేకాటకు అడ్డాలుగా మార్చారు. హైదరాబాద్ నుంచి ఇక్కడకు రావడానికి కన్వినెంట్​గా ఉండడంతో పొలిటికల్​లీడర్లు, ప్రజాప్రతినిధులు, బిజినెస్​మెన్​, ఉన్నతాధికారులు శివ్వంపేట మండలంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారు. 

మెయిన్​రోడ్డుకు దూరంగా, ఫారెస్ట్ ఏరియాకు దగ్గరగా ఫామ్ హౌజ్​లు నిర్మించారు. మండలంలో కొంతన్ పల్లి, సీతారాం తండా, పోతుల గూడ, సికింద్లాపూర్, బిజిలీపూర్, కొత్తపేట్ గ్రామాల పరిధిలో 70కి పైగా ఫామ్ హౌజ్​ లు ఉన్నాయి. ఎకరాల కొద్దీ భూములు కొనుగోలు చేసి వాటి చుట్టూ ప్రహారీ నిర్మించి, ఫెన్సింగ్​ ఏర్పాటు చేసి పర్మనెంట్​ బిల్డింగ్​లు నిర్మించగా, మరికొందరు రెడీమెడ్​ కంటైనర్​ హౌజ్​లు ఏర్పాటు చేశారు. అక్కడ రాత్రిళ్లు బస చేసేందుకు వీలుగా అవసరమైన సౌకర్యాలు సమకూర్చారు. కొందరు మాత్రమే ఫామ్​హౌజ్​లను కుటుంబ అవసరాలకు, ఏదైనా ఫంక్షన్​లకు, ఇతర అకేషన్​లకు వినియోగిస్తుండగా చాలా ఫామ్​హౌజ్​లు పార్టీలకు, పేకాటకు అడ్డాలుగా మారాయి. 

కొన్ని ఫామ్​హౌజ్ లలో రెగ్యులర్​గా వీకెండ్ పార్టీలు జరుగుతుండగా, కొన్ని పేకాటకు అడ్డాలుగా మారాయి. ఆదివారం, ఇతర సెలవు రోజుల్లో హైదరాబాద్ నుంచి లీడర్లు, బిజినెస్​మెన్​లు, రియల్టర్లు ఇక్కడకు వచ్చి పేకాట ఆడుతున్నారు. బయట మెయిన్​ గేటు మూసేస్తే లోపల ఏం జరుగుతుందనేది ఎవరికి తెలియదు. దీంతో మందు బాబులు, పేకాట రాయుళ్లది ఆడింది ఆట పాడింది పాట అన్నట్టుగా సాగుతోంది. పార్టీలు చేసుకునేవారు, పేకాట ఆడేవారు పరపతి ఉన్నవారు కావడంతో పోలీసులు చూసిచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.  

13 మంది అరెస్ట్.. రూ.2.10 లక్షలు స్వాధీనం

ఇటీవల ఉసిరిక పల్లి జీపీ పరిధిలోని కొట్టాల గ్రామ శివారులో ఉన్న ఒక ఫామ్ హౌజ్​​లో పేకాట ఆడుతున్నట్లు  పోలీసులకు సమాచారం అందింది. ఫామ్​హౌజ్​పై  రైడ్​ చేసి పేకాట ఆడుతున్న 13 మందిని అరెస్ట్​ చేశారు. వారి వద్ద నుంచి రూ.2.10 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.  కొన్నేళ్ల కిందట బిజిలిపూర్ శివారులో డీజే పెట్టి హైదరాబాద్​ నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి డ్యాన్సులు చేయిస్తుండగా పోలీసులు దాడి చేసి కేసు నమోదు  చేశారు.

నిఘా ఏర్పాటు చేస్తాం

 ఫామ్​హౌజ్ లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం. అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా చూస్తాం. పేకాట ఆడుతూ పట్టుబడితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.  
మహిపాల్​రెడ్డి, శివ్వంపేట ఎస్ఐ