కిచెన్లో ఉంది సొల్యూషన్!

కిచెన్లో ఉంది సొల్యూషన్!

మహిళల్లో కూడా పురుష హార్మోన్లు ఉంటాయి. కాకపోతే, అవి చాలా తక్కువగా ఉంటాయి.  ఒకవేళ ఆ హార్మోన్ల లెవల్​ పెరిగిందంటే, ఆడవాళ్ల ముఖంపై వెంట్రుకలు వస్తాయి.  దీనివల్లే కాకుండా కొన్ని జన్యుపరమైన కారణాలు వల్ల కూడా ఇలా జరుగుతుంది. ముఖంపై చాలా ఎక్కువగా వెంట్రుకలు ఉండే స్థితిని ‘హైపర్​ ట్రైకోసిన్​’ అంటారు. జన్యుపరమైన కారణాలతో ముఖంపై వెంట్రుకలు వస్తే దానిని ‘జెనెటిక్ హైపర్​ ట్రైకోసిన్’ అంటారు. ఈ సమస్య హార్మోన్ల  సమతుల్యత లోపించడం వల్ల వస్తే దానిని ‘హర్​న్యూటిజం’ అంటారు. ప్రస్తుతం ఈ సమస్యను చాలా మంది  అమ్మాయిలు ఎదుర్కొంటున్నారు. పరిష్కారం కోసం బ్యూటీపార్లర్​లు, హాస్పిటల్స్​ చుట్టూ తిరుగుతున్నారు. కానీ  ఈ సమస్యకు  పరిష్కారం వంటింట్లో కూడా ఉందంటున్నారు నిపుణులు.  ఇంట్లో సహజసిద్ధంగా తయారు చేసిన కొన్ని ప్యాక్స్​తో ఈ సమస్యకు చెక్​ పెట్టొచ్చు ఇలా…..

పసుపుతో

కావాల్సినవి

పసుపు– 2 టేబుల్​ స్పూన్లు
శెనగపిండి– 2 టేబుల్​ స్పూన్లు
ఓట్స్‌ (దంచి)– 1 టేబుల్​ స్పూన్​
బియ్యప్పిండి–  1 టేబుల్ స్పూన్​
నీళ్లు– తగినన్ని

తయారీ

ఒక గిన్నెలో పసుపు శెనగపిండి, బియ్యప్పిండి,  ఓట్స్‌ వేయాలి.  కొంచెం నీళ్లు కలిపి పేస్ట్​లా కలిపి ముఖానికి రాసుకోవాలి.  20 నిమిషాలు లేదా పూర్తిగా ఆరే వరకు ఉంచి,  ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికి ఒక సారి చేస్తే  ముఖంపై ఉన్న వెంట్రుకల సమస్య తగ్గుతుంది.

పెసలు, రోజ్ వాటర్

కావాల్సినవి

పెసర పిండి– 2 టేబుల్​ స్పూన్లు
రోజ్​ వాటర్​– 1 టేబుల్​ స్పూన్​
నిమ్మరసం– 1 టేబుల్​ స్పూన్​

 

తయారీ…
ఒక గిన్నెలో పెసర పిండి, రోజ్​ వాటర్​, నిమ్మరసం వేసి పేస్ట్​లా కలపాలి. ఈ మిశ్రమాన్ని  ముఖానికి రాసుకోవాలి. 20–25 నిమిషాల తర్వాత గోరు వెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.   కేవలం వెంట్రుకలు ఉన్న చోటే  ఈ పేస్ట్​ రాసుకోవాలి.  వారానికి మూడు, నాలుగు సార్లు ఇలా చేస్తే​  మంచి ఫలితం ఉంటుంది.

ఉల్లిపాయ, తులసి

కావాల్సినవి

ఉల్లిపాయలు– రెండు
తులసి ఆకులు– 10–12

 

తయారీ

ఉల్లిపాయ పొరలను, తులసి ఆకులు కలిపి పేస్ట్​లా చేసుకుని  వెంట్రుకలున్న చోట రాయాలి.  ముఖం పూర్తిగా ఆరిన తర్వాత  వేడి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.  ఇలా వారానికి 3,4 సార్లు రెండు నెలల పాటు చేస్తే ఫలితం ఉంటుంది.

తేనె, పంచదార

కావాల్సినవి

తేనె– ఒక టేబుల్​ స్పూన్​

పంచదార– ఒక టేబుల్​ స్పూన్​

నీళ్లు– ఒక టేబుల్ స్పూన్​

 

తయారీ

గిన్నెలో పంచదార, తేనె, నీళ్లు వేసి కలపాలి.  ఆ మిశ్రమాన్ని 30  సెకన్ల పాటు  మైక్రోవేవ్​లో పెట్టాలి. ఆ తర్వాత అందులో పంచదార కరిగించాలి.  ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. తర్వాత మెత్తటి బట్టను తీసుకుని  ముఖంపై  కొన్ని సెకన్లు ఉంచి  లాగాలి.

అటుకులు, అరటిపండు

కావాల్సినవి

అటుకుల పిండి– 2 టేబుల్​ స్పూన్లు

అరటి పండు–  1

 

తయారీ

అరటిపండు గుజ్జులా చేసి అందులో  అటుకుల పిండి వేసి పేస్ట్​లా చేయాలి.  ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి వేళ్లతో మసాజ్​లా చేసుకోవాలి. పావుగంట తర్వాత  చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయాలి.

లావెండర్ ఆయిల్

కావాల్సినవి

లావెండర్​ ఆయిల్​– 1 టీ స్పూన్​

టీ ట్రీ ఆయిల్​– 4–6 చుక్కలు,  దూది– కొద్దిగా

 

తయారీ

ఒక గిన్నెలో లావెండర్​ ఆయిల్​, టీ ట్రీ ఆయిల్​ వేసి కలిపి ఆ మిశ్రమంలో  దూది ముంచి వెంట్రుకలు ఉన్న చోట రాయాలి. ఇలా రోజుకి
2, 3 సార్లు మూడు నెలల పాటు చేయాలి.

త్రెడింగ్​ కోసమే ఎక్కువగా వస్తుంటారు. ఐబ్రో, అప్పర్​ లిప్స్​ కాకుండా కొంతమంది అమ్మాయిలు ముఖం అంతా త్రెడింగ్​ చేయించుకుంటారు. కొంతమంది వ్యాక్స్​ కూడా చేయించుకుంటారు.  ముఖంపై  వెంట్రుకలు పెద్దగా ఉండటం వల్ల  వాళ్లకి బ్లీచ్​ ఆప్షన్​ ఉండదు.  15 రోజులకొకసారి త్రెడ్డింగ్​ చేయించుకోవాల్సిందే. దీనివల్ల తాత్కాలికంగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు కానీ పర్మినెంట్​గా పరిష్కారమవదు.  అందుకే మా దగ్గరికి వచ్చే కస్టమర్లకు  సహజంగా ఇంట్లో చేసుకునే ట్రీట్​మెంట్స్​ గురించి   చెప్తుంటాం.
– బ్యూటీషియన్ పద్మ.