యోగిని చూసి నేర్చుకో..సీఎంపై విమర్శలు

యోగిని చూసి నేర్చుకో..సీఎంపై విమర్శలు

పాట్నా:మెదడువాపును అదుపు చేయడంలో బీహార్ లోని నితీశ్ కుమార్ సర్కార్ వైఫల్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ లో ఇంతకు ముందు ఈ వ్యాధి వచ్చినప్పుడు ఆ రాష్ట్ర  సీఎం యోగి ఆదిత్యనాథ్ చేపట్టిన చర్యలతో మంచి ఫలితాలు వచ్చాయి. ఈ విషయంలో యూపీ సీఎంను నితీశ్ అనుసరించాలని వైద్య రంగ నిపుణులు సూచిస్తున్నారు. పొరుగున్న ఉన్న  ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మెదడువాపు వ్యాధుల కేసులను నియంత్రించడంలో సక్సెస్ అయ్యింది. కొన్ని దశాబ్దాలుగా యూపీలోని గోరఖ్ పూర్ లో ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉండేది. 40 ఏళ్లలో వేలాది మంది చిన్నారులు చనిపోయారు. 2017 ఆగస్టులో గోరఖ్ పూర్ , పరిసర ప్రాంతాల్లో మెదడువాపు వ్యాధితో 500 మందికిపైగా పిల్లలు చనిపోయారు. యూపీలోని 14 జిల్లాల్లో వ్యాధి ప్రభావం ఉండేది.  యోగి ఆదిత్యనాథ్ సర్కారు దీన్ని చాలెంజ్ గా తీసుకుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్ తో కలిసి యూపీ సర్కారు యాక్షన్ ప్లాన్ అమలు చేసింది. పిల్లలకు పెద్ద ఎత్తున టీకాలు వేయించింది. పరిశుభ్రతపై అవగాహన కల్పించింది. పందులను ఇళ్లకు దూరంగా ఉంచింది.

ఫాగింగ్ చేపట్టింది. నేలపై చిన్నారులను పడుకోబెట్టకుండా పేరెంట్స్ కు అవగాహన కల్పించింది. దీంతో మెదడువాపు కేసులు తగ్గాయి. 2017లో 557 మంది చనిపోగా 2018లో 187 మంది చనిపోయినట్లు ఈ ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీలో యూపీ ఆరోగ్య మంత్రి సిద్ధార్థ్ నాథ్ సింగ్ ప్రకటించారు. ఫిబ్రవరి నాటికి 35 కేసులు నమోదైనా ఎవరూ చనిపోలేదన్నారు. బీహార్ లోని ముజఫర్ పూర్ లో జపనీస్ ఎన్సెఫలిటిస్ (మెదడువాపు) వ్యాధితో వంద మందికిపైగా చిన్నారులు చనిపోయారు. ఇవి అధికారిక లెక్కలు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ముజఫర్ పూర్ లోనే  ఈ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉంది. తూర్పు యూపీ, ఉత్తర బీహార్ లో ఒకేరకమైన వాతావరణం ఉంటుంది. యూపీ తరహాలో బీహార్ లో మెదడువాపు వ్యాధిని కంట్రోల్ చేయలేకపోయారు. 2012లో బీహార్ లో మెదడువాపుతో 120 మంది, 2014లో 90 మంది చనిపోవడంతో  ఈ వ్యాధిని నియంత్రించేందుకు 2015లో బీహార్ సర్కారు స్టాండర్ట్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ని అమలు చేసింది. యునిసెఫ్  సాయంతో ఏఎన్ఎంలు, ఆశా, అంగన్ వాడీ వర్కర్లతో ఇంటింటి సర్వే చేయించింది. మెదడువాపు లక్షణాలు ఉన్న చిన్నారులను గుర్తించి చికిత్స అందించింది. దీంతో మెదడువాపు మరణాల సంఖ్య 2016లో నాలుగుకు, 2017లో 11కు తగ్గింది. ఈ ఏడాది స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను అమలు చేయకపోవడంతో వ్యాధి ప్రబలినట్లు సమాచారం.

హక్కుల కమిషన్‌‌  నోటీసులు

ముజఫర్‌‌పూర్‌‌ మెదడువాపు మృతులపై నేషనల్‌‌ హ్యూమన్‌‌ రైట్స్‌‌ కమిషన్‌‌ ( NHRC) స్పందించింది. నేషనల్‌‌ హెల్త్‌‌ మినిస్ట్రీ, బీహార్‌‌ సర్కార్‌‌కు దీనిపై నోటీసులు జారీచేసింది. ఈ ఘటనపై పూర్తిస్థాయి రిపోర్ట్‌‌ను ఇవ్వాలని ఆదేశించింది.