
ఎటువంటి ఆదాయ వనరులు లేని భర్తకు.. పెన్షన్ పొందుతున్న భార్య భరణం చెల్లించాలంటూ యూపీ కోర్టు తీర్పునిచ్చింది. ముజఫర్ నగర్‌లోని ఖతౌలి పట్టణానికి చెందిన 62 ఏళ్ల కిషోరి లాల్ సోహంకర్ టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఆయన తన భార్య మున్నీదేవితో గతంలోనే విడిపోయాడు. మున్నీదేవి ఆర్మీలో పనిచేసేది. తాజాగా ఆమె ఆర్మీ నుంచి పదవీ విరమణ పొందింది. దాంతో ఆమె నెలకు రూ. 12 వేల పెన్షన్ పొందుతుంది. అయితే ఒంటరివాడైన సోహంకర్.. తన భార్యను ఇంటికి వచ్చేలా చూడాలని కోరుతూ ఫ్యామిలీ కోర్టులో కేసు పెట్టాడు. అయితే మున్నీదేవి మాత్రం సోహంకర్‌తో ఉండటానికి ఇష్టపడలేదు. దాంతో సోహంకర్ తన భార్య నుంచి భరణం ఇప్పించాలని మరోసారి కోర్టును ఆశ్రయించాడు. వాదోపవాదనలు విన్న కోర్టు.. సోహంకర్‌కు ప్రతి నెలా రూ. 2వేలు భరణం చెల్లించాలని మున్నీదేవిని ఆదేశించింది.
మహిళలు తమ భర్తలకు భరణం చెల్లించే కేసులు దేశంలో చాలా అరుదుగా ఉన్నాయి. సోహంకర్‌కు నెలవారీ భరణం చెల్లించాలని మున్నీదేవిని ఆదేశించాలని కోర్టును ఒప్పించటానికి కొంత సమయం పట్టిందని సోహంకర్ తరపు న్యాయవాది బి.కె.తాల్ తెలిపారు.
For More News..