
లక్నో: ఉత్తరప్రదేశ్ మత్స్యకార మంత్రి సంజయ్ నిషాద్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వరదలు గంగమ్మ తల్లి ఆశీస్సులని.. అవి మిమ్మల్ని స్వర్గానికి తీసుకెళ్తాయని వరద బాధితులను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. మంత్రి నిషాద్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతుండగా.. ప్రతిపక్షాలు సదరు అమాత్యుడి కామెంట్స్‌పై భగ్గుమంటున్నాయి. బుధవారం (ఆగస్ట్ 6) కాన్పూర్ జిల్లా దేహత్‌లోని వరద బాధిత గ్రామాన్ని అధికారులతో కలిసి మంత్రి నిషాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఓ వరద బాధితుడు మంత్రితో తన గోడు వెళ్లబోసుకున్నాడు. నా ఛాతీ మునిగే లోతు వరకు వరద నీరు ఇంట్లోకి వచ్చిందని.. వరద వల్ల సర్వం కోల్పోయామని బాధ వెళ్లబుచ్చుకున్నాడు బాధితుడు.
దీనిపై మంత్రి నిషాద్ మాట్లాడుతూ.. ‘‘మీరు గంగ పిల్లలు.. తన పిల్లల పాదాలను శుభ్రం చేయడానికి తల్లి గంగానే స్వయంగా మీ ఇంటి గుమ్మం వద్దకు వచ్చింది. ఇది మిమ్మల్ని నేరుగా స్వర్గానికి తీసుకెళుతుంది. కొన్నిసార్లు ఆహ్వానించకుండానే గంగమ్మ తల్లి రావడం అదృష్టం. వరదలు గంగమ్మ తల్లి పవిత్ర ఆశీర్వాదాలు’’ అని బాధితుడికి బదులిచ్చాడు. మంత్రి వ్యాఖ్యలతో చిర్రెత్తిపోయిన అక్కడే ఉన్న ఓ వృద్ధురాలు.. మంత్రికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. వరదలు గంగమ్మ తల్లి ఆశీస్సులు అయితే.. మీరు కూడా ఇక్కడే ఉండి మాతో పాటు గంగమ్మ తల్లి ఆశీస్సులు తీసుకోవాలని సదరు మంత్రి మైండ్ బ్లాంక్ అయ్యే ఆన్సర్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వరదల్లో సర్వం కోల్పోయి బాధలో ఉన్న బాధితులు తమ గోడు వెళ్లబోసుకుంటే వాళ్లకు ధైర్యం చెప్పాల్సింది పోయి.. వరదలు గంగమ్మ తల్లి ఆశీస్సులు.. అవి మిమ్మల్ని స్వర్గానికి తీసుకుపోతాయని మంత్రి మతిలేని మాటలు మాట్లాడటంపై ప్రతిపక్షాలు, నెటిజన్లు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్ష సమాజ్ వాదీ, కాంగ్రెస్ పార్టీలు మంత్రి నిషాద్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యాయి. వరద బాధితుల పట్ల మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించాయి. వరద బాధిత ప్రజలకు సహాయం అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మంత్రి వ్యాఖ్యలు ప్రజల మతపరమైన భావాలను తీవ్రంగా కించపరిచాయని విమర్శించారు.