ఎంత ఆస్తి గొడవలు అయితే మాత్రం.. ఇలా రోడ్లపై కొట్టుకుంటారా..!

ఎంత ఆస్తి గొడవలు అయితే మాత్రం.. ఇలా రోడ్లపై కొట్టుకుంటారా..!

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు రోడ్డుపై దారుణంగా కొట్టారు. ఈ ఘటనకు సంబంధించిన ఓ వీడియో సైతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కొంతమంది పురుషులు మార్గమధ్యంలో ఇద్దరు మహిళలను నిర్దాక్షిణ్యంగా కొట్టడం ఈ వీడియోలో చూడవచ్చు. ఈ ఇద్దరు బాధితుల్లో ఓ వృద్ధురాలు కూడా ఉండడం అందర్నీ తీవ్రంగా కలచివేస్తోంది.

ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని బిల్సి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహలోలి గ్రామంలో చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలో ఆస్తి తగాదాల కారణంగా ఒకే కుటుంబానికి చెందిన వారి మధ్య గొడవ జరిగింది. కొంతమంది పురుషులు ఇద్దరు మహిళలను రోడ్డుపైకి లాగడం, రద్దీగా ఉన్న రహదారి మధ్యలో వారిని కొట్టారు. ఈ వ్యవహారాన్ని అక్కడి జనం అంతా ఓ వింత చూసినట్టు చూశారు. కనీసం ఎవరూ ఆపడానికి కూడా ముందుకు రాలేదు. మహిళలపై ఆ పురుషులు క్రూరత్వంగా ప్రవర్తిస్తున్నా ఎవరూ అడ్డుకునేందుకు సాహసించలేదు.

ALSO READ: కానిస్టేబుల్​ చెంప చెళ్లుమనిపించిండు

పురుషులు అలా దారుణంగా కొట్టడంతో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ వీడియోలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్లు కూడా తమ చేతిలోని ఇటుకలతో మహిళలపై దాడి చేస్తున్నారు. సగం నగ్నంగా ఉన్న వ్యక్తి ఒక మహిళను తన్నుతుండగా, మరొక వ్యక్తి ఆమె జుట్టును లాగడం, ఆమెను దారుణంగా కొట్టడం ఈ వీడియోలో కనిపిస్తోంది. వృద్ధురాలిని కూడా వాళ్లు కొట్టి నేలపైకి నెట్టేశారు.

ఈ దాడి తర్వాత తీవ్రంగా గాయపడిన ఆ మహిళలు సమీపంలోని ఆసుపత్రిలో చేరారు. అనంతరం ఈ సంఘటనకు సంబంధించి అధికారులు కేసు నమోదు చేశారు. నిందితులపై పోలీసులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఒకరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మహిళలపై ఇలాంటి నేరాలను అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఇలాంటి నేరాలకు పాల్పడే నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా పలువురు డిమాండ్ చేస్తున్నారు.