‘ఉపాధి’ నిధులు పెరిగితేనే.. ఎకానమీకి జోష్

‘ఉపాధి’ నిధులు పెరిగితేనే.. ఎకానమీకి జోష్

2008 ఆర్థిక సంక్షోభం, కరోనా విపత్కర పరిస్థితుల్లో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచింది ఉపాధి హామీ పథకమే. దీని వల్ల ప్రజల చేతికి పైసలు వచ్చి.. వారి కొనుగోలు శక్తి నిలబడింది. అలాగే కూలీల దినసరి రేట్లు కూడా పెరిగాయి. అయితే కరోనా వల్ల పట్టణాల నుంచి గ్రామాలకు వలసలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో అందరికీ ఉపాధి కల్పించాలంటే అదనపు నిధుల అవసరం ఉంది. అందుకు తగ్గట్టుగా కేంద్రం ఉపాధి హామీకి నిధులను పెంచాలి. అలాగే పట్టణ ప్రాంతాల్లోనూ ఉపాధి హామీని ప్రవేశపెట్టడం ద్వారా పేదలకు చేతి నిండా పని కల్పించవచ్చు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

పెట్టుబడిదారి ఆర్థిక విధానంలో సహజంగా సంభవించే ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే గుర్తించి రూపొందించినదే ‘ఉపాధి హామీ పథకం’ చట్టం. ప్రజల్లోకి డబ్బును పంపిణీ చేసి గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తిని పెంచడానికి, తద్వారా పారిశ్రామిక ఉత్పత్తులు పెరగడానికి దోహదం చేసే అత్యంత కీలకమైన పథకం ఇది. దేశంలో ఉపాధి హామీ చట్ట రూపం దాల్చిన తర్వాత గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెరగడమే కాకుండా కూలీ రేట్లు పెరిగాయి. దీని ప్రభావంతో పట్టణాల్లోని భవన నిర్మాణ కార్మికులు, వ్యవసాయేతర కూలీల రేట్లు కూడా పెరిగాయి. ప్రజల్లోకి డబ్బు రావడంతో కొంత ఆర్థిక వేసులుబాటు కలిగింది. ఈ చట్టం వల్ల 2008 ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోగలిగాం.
 

ఉపాధి హామీని పట్టణాలకు విస్తరించాలి
ఇండియా-–చైనా ప్రజల్లోకి డబ్బు పంపిణీ చేసే పథకాలను అమలు చేయగా, అమెరికా, జర్మనీ, జపాన్ లాంటి దేశాలు బ్యాంకులకు ‘బెయిల్ అవుట్’ పేరుతో వేల కోట్లను బడ్జెట్ నుంచి ఇచ్చాయి. అయినా ఆయా దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించి ప్రజల కొనుగోలు శక్తిని పెంచలేకపోయాయి. ఆర్థిక సంక్షోభాన్ని కొంత మేరకైనా నిలువరించి ప్రజలను ఆకలి చావులకు గురికాకుండా ఉపాధి హామీ కాపాడిందనడంలో సందేహం లేదు. చట్టం వచ్చినప్పటి నుంచి 2022 జనవరి 25 నాటి వరకు 3,749.15 కోట్ల పని దినాలను కల్పించి రూ.7,85,439.54 కోట్లను ఖర్చు చేశారు. 2022 జనవరి 25న వర్క్ సైడ్ పై 12,04,857 మంది పనిలో ఉన్నారు. ఈ పథకాన్ని పట్టణాలకు కూడా వర్తింపచేయాలన్న డిమాండ్​ ఇటీవల మొదలైంది. ఉపాధి హామీ చట్టంలో నిరుద్యోగ భృతి ఇవ్వడాన్ని పొందుపరిచారు. ఒక ఆర్థిక సంవత్సరంలో మొదటి 30 రోజుల కూలీ రేట్లలో 25 శాతం, మిగిలిన రోజులకు 50 శాతానికి నిరుద్యోగ భృతి తగ్గకూడదు. పనికి హాజరుకాకపోయినా లేదా ప్రభుత్వం పిలిచినప్పుడు 15 రోజులు పని జరగకపోయినా నిరుద్యోగ భృతి చెల్లించరు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని సరిగా అమలు చేయకపోవడంతో నిధుల ఖర్చు జరగక, గ్రామీణ ప్రజల్లోకి నిధులు వెళ్లక కొనుగోలు శక్తి తగ్గిపోతున్నది. 
 

కరోనాతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై భారం
ప్రస్తుతం గ్రామీణ నిరుద్యోగం 29 శాతంగా ఉంది. పట్టణాలకు వెళ్లిన 20 కోట్ల మంది కూలీలు కరోనా వల్ల తిరిగి గ్రామాలకు చేరుకోవడంతో గ్రామీణ ఆర్థిక జీవనంపై భారం పడింది. ఇలాంటి పరిస్థితిలో ఉపాధి హామీ అమలు కీలకమవుతుంది. మొదట పథకం ప్రారంభించినప్పుడు ఏటా రూ.40 వేల కోట్లు కేటాయించగా, 2020-–21లో రూ.1,18,919 కోట్లు కేటాయించారు. కరోనా వల్ల ఈ నిధులు కూడా తగినంత కేటాయింపు జరగలేదు. ఈ నిధుల్లో యంత్రాల వినియోగానికి 29.57 శాతం కేటాయిస్తున్నారు. నిర్వహణకు 2.54 శాతం ఖర్చు చేస్తున్నారు. ఇలా 32 శాతం నిధులు కూలీలకు కాక యంత్రాలకు ఖర్చు అవుతున్నాయి. దానికి తోడు రూపాయి విలువ తగ్గడం, నిత్యావసరాల ధరలు పెరగడంతో ప్రస్తుత కూలీ రేటు సరిపోవడం లేదు. ప్రస్తుతం రోజు కూలీ రూ.287.56 ఇస్తున్నట్లు నివేదికలో చూపారు. వాస్తవానికి చేసిన పనికి, కొలతలు వేసి నిర్ణయించిన దానికి తక్కువ వేతనాలే ఇస్తున్నారు. కూలీ నిధులను వెంటవెంటనే చెల్లించాలని నిబంధనలు ఉన్నప్పటికీ నెలల తరబడి జాప్యం చేస్తున్నరు.
 

ఆహారభద్రత కల్పించాలి
కరోనా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేకుండా దెబ్బ తీసింది. పట్టణాల్లో ఉద్యోగాలు కోల్పోయిన వారు గ్రామాలవైపు వస్తున్నారు. వారందరికి ఉపాధి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. మన దేశంలో దారిద్ర్యరేఖకు దిగువన 30 కోట్ల మంది ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అందువల్ల ఈ పథకానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. ఒక వైపు కేంద్రం దగ్గర ఆహార ధాన్యాల నిల్వలు పెరిగిపోతుండగా, మరోవైపు 3 కోట్ల మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఆహార భద్రత చట్టానికి ప్రాధాన్యత పెరిగింది. గర్భస్త శిశువు నుంచి 14 ఏండ్లు వచ్చే వరకు పౌష్టికాహారం సరఫరా చేయాలని ఈ చట్టం చెబుతోంది. అయినా కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని అమలు చేయడం లేదు. ఆహార భద్రత చట్టం వల్ల దేశంలో 5 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు పంపిణీ చేయాల్సి ఉంటుందని నాడు అంచనా వేశారు. దేశ జనాభా ఏటా 1.9 శాతం పెరుగుతోంది. దీంతో దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. అందువల్ల నిపుణుల సూచనల ప్రకారం ఏటా కనీసం రూ.2.5 లక్షల కోట్లను ఉపాధి హమీ పథకానికి కేటాయించాల్సిన ఆవశ్యకత ఉంది. అదనపు నిధుల కేటాయింపు వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని కోట్లాది మందికి ఉపాధి హామీ కింద పనులు కల్పించవచ్చు.

జాబ్​కార్డులు అందరికీ లేవు
దేశంలోని 716 జిల్లాల్లో 2,69,412 గ్రామ పంచాయతీల్లో 15.73 కోట్ల జాబ్ కార్డులు ఉన్నాయి. కానీ పనిచేసే వారు 30.01 కోట్ల మంది ఉన్నారు. ఇందులో దళిత పనివారు, గిరిజనులు కోట్లలో ఉన్నప్పటికి వీరికి జాబ్ కార్డులు లేవు. ఎప్పటికప్పుడు వేరే వారి జాబ్ కార్డుపై పనులకు వెళ్లాల్సి వస్తోంది. జాబ్ కార్డు ఉన్న వారి నుంచి కూలీ రాబట్టుకోవాలి. తెలంగాణలో 97,63,000 జాబ్​కార్డులు ఉంటే 195,44,000 మంది పని వారు ఉన్నారు. ఇప్పటికి 2008 నాటి ఆర్థిక సంక్షోభం పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో 7 కోట్ల కుటుంబాలు ఉపాధి హామీ వల్ల లబ్ధి పొందుతున్నాయి. వీరికి తోడుగా మరో 8 కోట్ల కుటుంబాలు తోడవుతున్నాయి. వీరందరికి ఈ పథకం ద్వారానే పనులు కల్పించాలి. 

                                                                                                                                                                                                           - సారంపల్లి మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు, ఆలిండియా కిసాన్‌ సభ