
- రిటైల్ రంగంలో రికార్డు స్థాయి లావాదేవీలు
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఆఫ్ ఇండియా (యూపీఐ) వాడకం రాబోయే రోజుల్లో గణనీయంగా పెరుగుతుందని ఎక్స్పర్టులు చెబుతున్నారు. 2026–-27 నాటికి యూపీఐ లావాదేవీలు రోజుకు వందకోట్లకు చేరుకునే అవకాశం ఉందని, దేశంలోని రిటైల్ డిజిటల్ చెల్లింపుల్లో 90 శాతం వాటా వీటికే ఉంటుందని పీడబ్ల్యూసీ ఇండియా రిపోర్ట్ తెలిపింది. 2022–-23లో రిటైల్ విభాగంలో మొత్తం లావాదేవీల పరిమాణంలో యూపీఐకి 75 శాతం వాటా ఉందని "ది ఇండియన్ పేమెంట్స్ హ్యాండ్ బుక్ - 2022–-27" పేరుతో విడుదల చేసిన రిపోర్ట్‌లో పీడబ్ల్యూసీ పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో రిటైల్ డిజిటల్ చెల్లింపు యూపీఐకి 90 శాతం వాటా ఉంటుంది. భారతీయ డిజిటల్ చెల్లింపుల మార్కెట్ ఏటా 50 శాతం (వాల్యూమ్ వారీగా) స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. 2022–-23 ఆర్థిక సంవత్సరంలో లావాదేవీల సంఖ్య 103 బిలియన్లు కాగా, 2026–-27 ఆర్థిక సంవత్సరం నాటికి వీటి సంఖ్య 411 బిలియన్లను చేరుకునే అవకాశం ఉంది.
పెరగనున్న క్రెడిట్ కార్డుల వాడకం..
యూపీఐ తర్వాత రిటైల్ డిజిటల్ చెల్లింపుల కోసం ఎక్కువగా ఉపయోగించే వాటిలో కార్డ్ (డెబిట్, క్రెడిట్ రెండూ) ఒకటి. క్రెడిట్ కార్డ్ సెగ్మెంట్ ఆరోగ్యకరమైన రేటుతో వృద్ధి చెందుతూనే ఉంటుంది. 2024–2025 ఆర్థిక సంవత్సరం నాటికి క్రెడిట్ కార్డ్‌లలోని లావాదేవీల పరిమాణం డెబిట్ కార్డ్‌లను అధిగమించే అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఐదేళ్లలో క్రెడిట్ కార్డుల సంఖ్య ఏటా 21 శాతం పెరుగుతుందని అంచనా. డెబిట్ కార్డ్ జారీ 3 శాతం పెరగవచ్చు. యూపీఐ వాడకం ఎక్కువ కావడం వల్ల డెబిట్‌కార్డుల వాడకం తగ్గిపోతున్నదని పీడబ్ల్యుసీ ఇండియా పార్టనర్ పేమెంట్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ లీడర్ మిహిర్ గాంధీ అన్నారు. 2022–2023లో మొత్తం కార్డ్‌ల ఆదాయంలో క్రెడిట్ కార్డ్ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయం దాదాపు 76 శాతంగా ఉంది. ఇది బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు ఫిన్‌టెక్‌లకు లాభదాయకమైన వ్యాపార విభాగంగా మారిందని పీడబ్ల్యూసీ రిపోర్ట్ పేర్కొంది. 2021–2022తో పోలిస్తే 2022–2023లో క్రెడిట్ కార్డ్ జారీకి సంబంధించిన ఆదాయం 42 శాతం పెరిగింది