నాగర్ కర్నూలు ఉప్పల వెంకటేష్ చేరికలో మర్మమేంటీ.. లాబీయింగ్ చేసింది ఎవరు..?

నాగర్ కర్నూలు ఉప్పల వెంకటేష్ చేరికలో మర్మమేంటీ.. లాబీయింగ్ చేసింది ఎవరు..?

నాగర్​ కర్నూల్,​ వెలుగు : బీఆర్ఎస్​ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్​ను ఈ నెల 21న సీఎం కేసీఆర్​ ప్రకటిస్తారన్న ప్రచారం నేపథ్యంలో కల్వకుర్తి టికెట్​ నిలబెట్టుకోవడానికి సిట్టింగ్​ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్,​ఈ సారైనా టికెట్​ దక్కించుకోవాలని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో తలకొండపల్లి మండల జడ్పీటీసీ, ఉప్పల చారిటబుల్​ ట్రస్ట్​ ఫౌండర్​ ఉప్పల వెంకటేశ్​ శనివారం మంత్రి కేటీఆర్​ సమక్షంలో​బీఆర్ఎస్​లో చేరారు. ఎమ్మెల్యేను వ్యతిరేకించే ఉప్పల వెంకటేశ్​​ఇండిపెండెంట్​గా పోటీ చేసి జడ్పీటీసీగా గెలిచారు.

ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి మనిషిగా ముద్రపడిన ఆయన​జైపాల్​ యాదవ్​ ఓటమే లక్ష్యంగా పని చేస్తానని గతంలో, ఇటీవల ప్రకటించారు. ఎమ్మెల్సీకి టికెట్​ ఇస్తే గెలిపించుకుంటామని, లేనిపక్షంలో జైపాల్​యాదవ్​ను ఓడిస్తామని, ఇండిపెండెంట్​గా బరిలో ఉంటామని స్టేట్​మెంట్లు ఇచ్చారు. ఈ నేపథ్యంలో వెంకటేశ్​ను పార్టీలోకి తీసుకొచ్చే బాధ్యతను ఎమ్మెల్యే​జైపాల్​యాదవ్​కు మంత్రి కేటీఆర్​ అప్పగించారు. ఎమ్మెల్యే పిలిస్తే స్పందిస్తారా? అనే సందేహాలను పక్కకు పెట్టి పిలిచిందే ఆలస్యమన్నట్టుగా తన వర్గానికి చెందిన వారితో కలిసి శనివారం పార్టీలో చేరిపోయారు.

సోమవారం ప్రకటించే లిస్ట్​లో ఎమ్మెల్యే టికెట్​ ఎవరికి ప్రకటిస్తారనే ఉత్కంఠ నేపథ్యంలో ఉప్పల చేరిక విషయం నియోజకవర్గంతో పాటు జిల్లాలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

అభ్యర్థిత్వం మార్చాలని అల్టిమేటం.. 

కడ్తాల్, కందుకూరులో ఇటీవల ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, జడ్పీ వైస్​చైర్మన్​ బాలాజీ సింగ్, మాజీ మంత్రి చిత్తరంజన్​దాస్, జడ్పీటీసీ ఉప్పల వెంకటేశ్, బృంగి ఆనంద్ కుమార్, పసుల సుదర్శన్ రెడ్డి తదితరులు ఎమ్మెల్యే జైపాల్​యాదవ్​ను మార్చాలని హైకమాండ్​కు అల్టిమేటం ఇచ్చారు. మెజార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాన్ని కాదని టికెట్​ ఇస్తే ఓడిస్తామని ప్రకటించారు. పార్టీ, ఇంటలిజెన్స్​ సర్వే రిపోర్టులతో అభ్యర్థి ఎంపికపై పునరాలోచనలో పడిన హైకమాండ్​ క్యాండిడేట్​ మార్పు ఉంటుందంటూ లీకులు ఇచ్చిందనే వార్తలు వచ్చాయి.

రంగారెడ్డి జిల్లా పరిధిలోకి వచ్చే ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల్లో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్గాలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలను ఎవరికి వారే నిర్వహించుకున్నారు. అఫీషియల్​ ప్రోగ్రామ్స్​లో తనకు సమాచారం ఇవ్వడం లేదని కసిరెడ్డి పలుమార్లు ఫైర్​ అయ్యారు. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థిత్వాన్ని పక్కన పెట్టి నియోజకవర్గంలో ప్రభావం చూపే ఉప్పల వెంకటేశ్, గోలి శ్రీనివాస్​రెడ్డి, బాలాజీ సింగ్, ఆనంద్​కుమార్, పసుల సుదర్శన్​రెడ్డిలను ఒకే లైన్​లోకి తేవాలనే లక్ష్యంతో హైకమాండ్​ పావులు కదుపుతోంది. గోలి శ్రీనివాస్​రెడ్డి, ఉప్పల వెంకటేశ్​ను బుజ్జగించగా, జడ్పీ వైస్​చైర్మన్​ బాలాజీ సింగ్​కు భవిష్యత్​ ఉంటుందని చెబుతూ దగ్గర చేసుకుంటున్నారు. 

ఉప్పల చేరికకు పక్కా ప్లాన్..

తలకొండపల్లి మండలంలో ప్రభావం చూపించే ఉప్పల వెంకటేశ్​ను పార్టీలోకి చేర్చుకునే విషయంపై ఎమ్మెల్సీ కసిరెడ్డి ఇటీవల కేటీఆర్​తో చర్చించినట్లు సమాచారం. ఉప్పల చేరికకు కేటీఆర్​ గ్రీన్​సిగ్నల్​ ఇవ్వడంతో పాటు ఆ బాధ్యతను ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్​చార్జి జైపాల్​యాదవ్​కు అప్పగించారు. ఎమ్మెల్యే చొరవతో ఉప్పల కేటీఆర్​ సమక్షంలో పార్టీలో చేరిపోయారు. కల్వకుర్తి నుంచి టికెట్​ ఆశిస్తున్న నాయకులు ఎక్కువగా ఉన్నారని కామెంట్​ చేసిన కేటీఆర్,​  ఎవరికి టికెట్​ ఇచ్చినా అందరు కలిసి గెలిపించుకోవాలని కోరారు.