- సీసీటీవీ కెమెరాలతో సెంటర్లో పర్యవేక్షణ
- బయోమెట్రిక్‌తో అభ్యర్థుల ఎంట్రీ
- ఏర్పాట్లు చేసేందుకు టెండర్లు పిలిచిన యూపీఎస్సీ
న్యూఢిల్లీ: నీట్, నెట్ పరీక్షల్లో అవకతవకలు, పేపర్ల లీక్‌ల నేపథ్యంలో యూపీఎస్సీ అలర్ట్ అయింది. ఇకపై యూపీఎస్సీ నిర్వహించే వివిధ పరీక్షల్లో ఇలాంటి లీక్‌లను నిరోధించేందుకు ఫేషియల్ రికగ్నైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన సీసీటీవీ కెమెరాల నిఘా వ్యవస్థను ఉపయోగించాలని నిర్ణయించింది. దీని కోసం ఇప్పటికే టెండర్లు పిలిచింది. జులై 7వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు బిడ్‌లు దాఖలు చేసుకునేందుకు యూపీఎస్సీ చాన్స్ ఇచ్చింది. అదేరోజు మధ్యాహ్నం 1.30 గంటలకు బిడ్లను తెరవనుంది.
ఆధార్ ఆధారిత ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ (డిజిటల్ ఫింగర్ ప్రింట్ క్యాప్చరింగ్), అభ్యర్థుల ఫేషియల్ రికగ్నైజేషన్, ఈ– అడ్మిట్ కార్డుల్లో క్యూఆర్ కోడ్ స్కానింగ్‌ను ఉపయోగించనుంది. పరీక్ష స్టార్ట్ అయినప్పటి నుంచి ఎగ్జామ్ పేపర్లు నీట్‌గా ప్యాక్ చేసే వరకు ప్రతి మూమెంట్‌ను కెమెరాల్లో బంధించాలని డిసైడ్ చేసింది. ఎగ్జామ్ టైమ్‌లో ప్రతి 24 మంది అభ్యర్థులకు ఒక సీసీటీవీ కెమెరా, ఎంట్రీ/ఎగ్జిట్ గేట్, కంట్రోల్ రూమ్‌లో సీసీటీవీ కలర్ కెమెరాలను ఇన్‌స్టాల్ చేయాలని నిర్ణయించింది. ఎగ్జామ్ జరిగేటప్పుడు ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద అనుమానాస్పద కదలికలు, ఒకవేళ ఎగ్జామ్ రూమ్‌లో ఫర్నిచర్ సరిగ్గా అరెంజ్ చేయకపోయినా, కెమెరాలు ఆఫ్‌లైన్‌లో ఉన్నా.. మాస్కింగ్ లేదా, బ్లాక్ స్క్రీన్ చూపించినా, క్లాస్ రూమ్‌లో ఇన్విజిలేటర్ కదలకపోయినా.. ఏఐ కెమెరాలు సిగ్నల్ ఇచ్చేలా విధంగా సిస్టమ్ ఉండే విధంగా చూసుకుంటుంది.
4 దశల్లో నీట్ విచారణ: సీబీఐ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) దర్యాఫ్తు చేపట్టింది. పేపర్ లీక్ అంశాన్ని అన్నికోణాల నుంచి విచారించి, లీక్ ఎలా జరిగింది, పేపర్ ఎక్కడ ఎలా ప్రింట్ చేశారు? దానిని దేశవ్యాప్తంగా ఉన్న అభ్యర్థులకు ఎలా పంపించారనేది తేల్చనుంది. ఇందుకోసం సీబీఐ నాలుగు దశల్లో విచారణ జరపనుందని, దాదాపు వెయ్యికి పైగా ఉన్న ఫోన్ నెంబర్ల నుంచి సమాచారం రాబట్టనుందని సమాచారం. నీట్ పేపర్ రూపకల్పన, ప్రింటింగ్, రవాణా, స్టోరేజ్ తదితర ప్రాసెస్ లతో సంబంధం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను విచారించనుందని తెలిపాయి. గతంలో పేపర్ లీక్ కేసుల విచారణ సందర్భంగా గుర్తించిన వెయ్యికి పైగా ఫోన్ నెంబర్లను పరిశీలించి, అందులో నీట్ పేపర్ లీక్ బాధ్యులను గుర్తించేందుకు ప్రయత్నిస్తామని చెప్పాయి.
