
వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో అన్నదాతలు సంతోషపడుతున్న వేళ రాష్ట్రంలో యూరియా కొరత వారి ఆశలను ఆవిరి చేస్తోంది. వానలొస్తున్నా యూరియా రావట్లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు వరినాట్లు, మరోవైపు ఇతర పంటల సాగుతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి.
గతంతో పోలిస్తే తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో ప్రతి ఏటా వ్యవసాయానికి ప్రాధాన్యత పెరుగుతోంది. వ్యవసాయంలో ప్రధానమైన యూరియా సరఫరా సాగుకు తగ్గట్టు ఉండాల్సిన పరిస్థితుల్లో కొరత రావడంతో రైతులు ఆందోళ చెందుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకుంటే రైతులు ఆనందోత్సవాలతో వ్యవసాయాన్ని పండుగగా చేసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరికి బోనస్ వంటి ప్రోత్సాహకాలు అందించడంతోపాటు నీటి ప్రాజెక్టులకు కూడా ప్రాఈధాన్యతిస్తుండడంతో తెలంగాణలో వ్యవసాయం భారీగా పుంజుకుంది.
2024-–25 ఆర్థిక సంవత్సరం గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 28 శాఖల్లో, 260 సంక్షేమ పథకాలు అమలవుతుండగా, వాటిలో అత్యధిక పథకాలతో వ్యవసాయశాఖ ప్రథమ స్థానంలో ఉందంటేనే తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు ఇస్తున్న ప్రాధాన్యత తెలుస్తోంది.
67.5 లక్షల ఎకరాలలో వరిసాగు
ప్రస్తుత సీజన్లో వరిసాగు రికార్డు స్థాయిలో 67.5 లక్షల ఎకరాలకు చేరింది. గతేడాది ఖరీఫ్, రబీ సీజన్లను కలిపి మొత్తం 183 లక్షల టన్నుల బియ్యాన్ని ఉత్పత్తి చేసి దేశంలోనే అత్యధికంగా బియ్యం పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. వరి ప్రాధాన్యతతో రాష్ట్రంలో యూరియా అవసరం కూడా భారీగా పెరిగింది. డిమాండ్‌కు తగ్గట్టు యూరియా సరఫరా లేకపోవడంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతుల ఆందోళనలు, నిరసనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వీటి వెనుక పలు రాజకీయాలు, విమర్శలున్నా అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారనేది వాస్తవం.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ తర్వాత 45 కిలోల యూరియా బస్తా రూ.242 కాగా, 50 కిలోల బస్తా రూ.268. ప్రభుత లెక్కల ప్రకారం దిగుమతి చేసుకున్న యూరియాపై ఒక్కో బ్యాగుకు దాదాపు రూ.2183 సబ్సిడీ లభిస్తుంది. 2022–-23 నుంచి 2024-–25 వరకు మూడు సంవత్సరాలపాటు యూరియా సబ్సిడీ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.3,68,676.7 కోట్లు కేటాయించింది. కేంద్రం సబ్సిడీతో అందజేస్తున్న యూరియా సరఫరాలో తెలంగాణ రాష్ట్రానికి కోతలు విధిస్తుండడంతో వర్షాలు పడుతున్నవేళ సమయానికి యూరియా చేతికందదేమో అనే ఆందోళనతో రైతులు నిరసనలు చేపడుతున్నారు.
యూరియా సరఫరాలో కేంద్రం కోతలు
వరినాట్లు వేసిన 10-–15 రోజులకు రైతులు ప్రతి ఎకరాకు ఒక బస్తా నుంచి రెండు బస్తాల యూరియా ఉపయోగిస్తారు. నెలన్నర తర్వాత మరోసారి యూరియా వాడతారు. వరితోపాటు పత్తి, మొక్కజొన్న పంటలకు కూడా యూరియా అవసరం భారీగానే ఉంటుంది. డిమాండ్ ఎక్కువ సరఫరా తక్కువ నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయశాఖ తెలంగాణవాప్తంగా రేషనింగ్ విధానంలో రైతులకు టోకెన్లు ఇచ్చి యూరియా అందజేస్తోంది. యూరియా సరఫరాపై తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగానే అంచనాలు రూపొందించినా కేంద్రం సమతుల్యం పాటించలేదు.
వర్షాకాలంలో మొత్తం పంటల విస్తీర్ణం 1.32 కోట్ల ఎకరాలుగా అంచనా వేసిన రాష్ట్ర వ్యవసాయశాఖ ఈ సీజన్లో 10.48 లక్షల టన్నుల యూరియా కేటాయించాలని కోరితే.. కేంద్రం 9.80 లక్షల టన్నులే కేటాయిస్తూ 0.68 లక్షల టన్నులు తగ్గించింది. గత సీజన్లో 1.92 లక్షల టన్నుల యూరియా రాష్ట్రం వద్ద మిగిలిపోవడంతో దాన్ని ప్రస్తుత సీజన్లో వినియోగించుకోవాలని కేంద్రం రాష్ట్రానికి సూచించింది. మరోవైపు కేంద్రం అధికారికంగా రాష్ట్రానికి కేటాయించిన 9.80 లక్షల టన్నుల యూరియా సరఫరాలో కూడా కోతలే విధిస్తోంది. సీజన్ మొదటి నెల ఏప్రిల్‌లో 49 వేల టన్నుల కోత తర్వాత సర్దుబాటు జరుగుతుందని ఆశించినా మే, జూన్, జులై నెలల్లోనూ కోతలే పెట్టారు. ఆగస్టు నాటికి ఐదు నెలలకు రాష్ట్రానికి రావాల్సిన మొత్తం 8.30 లక్షల టన్నులకుగాను 5.32 లక్షల టన్నులే సరఫరా కావడంతో 2.98 లక్షల టన్నుల (35.9శాతం)లోటుతో యూరియా దొరకక అన్నదాతలు సతమతమవుతున్నారు.
అన్నదాతల్లో ఆందోళన
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల మధ్య వివక్ష చూపిస్తోందనే ఆరోపణలతో అన్నదాతల్లో ఆందోళన మరింత పెరుగుతోంది. తెలంగాణ కోరిన యూరియాను తగ్గించి కేటాయించిన కేంద్రం... మహారాష్ట్ర, బిహార్, మధ్యప్రదేశ్, కర్నాటక, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తమిళనాడు వంటి రాష్ట్రాలకు సరఫరాలో తెలంగాణతో పోలిస్తే ఈ రాష్ట్రలకు కోతలు తక్కువగానే ఉన్నాయి. యూరియా కోటా పెంచాలని, సరఫరా పెంచాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని పదేపదే కోరుతున్న దశలో పీఎం -ప్రణామ్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్రానికి కేంద్రం సూచిస్తోంది.
ఈ పథకం ప్రధాన ఉద్దేశం రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి, ప్రత్యామ్నాయంగా సేంద్రీయ, సహజ వ్యవసాయ ఎరువులను వినియోగించుకోవడం. యూరియాకు అలవాటుపడిన రైతులను ఈ దిశగా మార్చేందుకు సమయం పడుతోంది. అంతలోగా ప్రస్తుత సమస్యలను తీర్చడానికి కేంద్రం సరిపడా ఎరువులను ముందుగా సరఫరా చేయాల్సిన అవసరం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంట్లో ఎంపీలు తీవ్ర ఒత్తిడి తేవడంతో కర్నాటక నుంచి 50 వేల యూరియా తెలంగాణకు సరఫరా చేసేందుకు కేంద్రం అంగీకరించింది.
పెరిగిన యూరియా వాడకం
రాష్ట్రంలో వ్యవసాయం పుంజుకోవడంతో యూరియా కేటాయింపులు పెంచాలని తెలంగాణ మొదటి నుంచి కోరుతోంది. పంట తక్కువ కాలంలోనే ఏపుగా ఎదగడం కోసం యూరియాను విరివిగా వాడుతున్నారు. మరోవైపు కేంద్రం భారీ సబ్సిడీతో అందిస్తున్న యూరియూ దారిమళ్లుతూ కొన్నిచోట్ల వ్యవసాయేతర వాటికి ఉపయోగిస్తున్నారు.
రైతన్నలను ఆదుకోవాలి
దాదాపు 25శాతం యూరియా వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగిస్తున్నారని కేంద్ర మంత్రి నడ్డా సీఎం రేవంత్ రెడ్డి వద్ద ప్రస్తావించడం గమనార్హం. రంగులు, వార్నిష్, ప్లైవుడ్, యాడ్ బ్లూ వంటి పరిశ్రమలు యూరియాను బ్లాక్‌లో కొని దుర్వినియోగపరుస్తున్నాయి. వానల వేళ.. యూరియా గోల లేకుండా చూడాలి. ఇకముందు ప్రత్యామ్నాయాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను జాగృతం చేస్తే
భవిష్యత్‌లో ఇబ్బందులు రావు.
- ఐ.వి.మురళీకృష్ణ
శర్మ