
9/11.. 9:11.. 9.11.. ఏంది ఈ అంకెల గోల! ఒక్కసారి చెప్తే సరిపోదా? మూడుసార్లు చెప్పాలా? అని గుస్సా కావొద్దు. మూడూ అంకెలే.. కానీ, వాటిని ఒకే ఒక్క గుర్తు వేరు చేస్తోంది గమనించారా! మొదటిది డేటు.. రెండోది టైము.. మూడోది బరువు! అవును, ఈ అంకెల వెనక అర్థమదే. ఆ అంకెల కథ.. ఈ చిన్నారి చుట్టూ తిరుగుతుంది. ఆ అమ్మాయి గురించి చెప్పుకునే ముందు 9/11 డేట్ వెనక ఓ కథ ఉంది. అది గుర్తుండే ఉంటుంది కదా. అదే న్యూయార్క్ సిటీపై 2001 సెప్టెంబర్ 11న టెర్రరిస్టులు దాడి చేసిన రోజు. ఇప్పుడు ఈ చిన్నారి ఆ 9/11 డేట్లోనే పుట్టింది. 9:11 గంటలకు భూమిపైకి వచ్చింది. 9.11 పౌండ్ల (దాదాపు 4.4 కిలోలు) బరువుతో బాహుబలిలా పుట్టింది. అమెరికా టెన్నెసీలో ఉన్న జర్మన్టౌన్లోని మెథడిస్ట్ లిబోన్హర్ హాస్పిటల్లో పుట్టింది. బరువు ఎక్కువగా ఉండడంతో డాక్టర్లు సీ సెక్షన్ చేశారు. నిజంగా ఇలాంటి అరుదైన తేదీ, అంకెలతో తమ కూతురు పుట్టడం చాలా ఆశ్చర్యంగానూ, సంతోషంగానూ ఉందని ఆ పాప తల్లి కేమెట్రియోన్ మూరె బ్రౌన్, తండ్రి జస్టిన్ బ్రౌన్ చెప్పారు. ఇంతకీ అంత స్పెషల్ అంకెలతో పుట్టిన ఆ పాప పేరు చెప్పలేదు కదూ.. క్రిస్టినా బ్రౌన్!!