ఇండియాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అమెరికా

ఇండియాకు అతిపెద్ద  వాణిజ్య భాగస్వామి అమెరికా
  • సెప్టెంబరు క్వార్టర్లో 59.67 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం
  • రెండవ స్థానంలో చైనా..

న్యూఢిల్లీ:  ప్రపంచ మార్కెట్లో ఆర్థిక అనిశ్చితులు ఉన్నప్పటికీ, ఎగుమతులు,  దిగుమతులు తగ్గుతున్నప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో అమెరికా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా అవతరించింది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ  తాత్కాలిక డేటా ప్రకారం, భారతదేశం–  యుఎస్ మధ్య  వాణిజ్యం 2023 ఏప్రిల్-–సెప్టెంబర్ మధ్యకాలంలో 59.67 బిలియన్ డాలర్లకు చేరుకుంది. దీని విలువ గత ఏడాది ఇదే కాలంలో  నమోదైన 67.28 బిలియన్ డాలర్లతో పోలిస్తే 11 శాతం తక్కువ. 2023 ఏప్రిల్–-సెప్టెంబర్ మధ్య కాలంలో యూఎస్​కు ఎగుమతులు  41.49 బిలియన్ డాలర్ల నుంచి 38.28 బిలియన్ డాలర్లకు తగ్గాయి. దిగుమతులు కూడా గత ఏడాది ఇదే కాలంలో  25.79 బిలియన్ డాలర్లతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో  21.39 బిలియన్ డాలర్లకు తగ్గాయి. భారతదేశం– చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం కూడా 3.56 శాతం తగ్గి 58.11 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆర్నెళ్లలో చైనాకు ఎగుమతులు  7.84 బిలియన్ డాలర్ల నుంచి స్వల్పంగా తగ్గి 7.74 బిలియన్ డాలర్లకు పడ్డాయి. దిగుమతులు ఏడాది క్రితం  52.42 బిలియన్ డాలర్ల నుంచి 50.47 బిలియన్ డాలర్లకు తగ్గాయి. గ్లోబల్ డిమాండ్ మందగమనం కారణంగా భారతదేశం  అమెరికా మధ్య ఎగుమతులు,  దిగుమతులు క్షీణిస్తున్నప్పటికీ, వృద్ధి రేటు త్వరలో సానుకూలంగా మారుతుందని  వాణిజ్య నిపుణులు భావిస్తున్నారు.  రెండు దేశాలూ ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో నిమగ్నమై ఉన్నందున రాబోయే సంవత్సరాల్లో అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్యం పెరగవచ్చని అంటున్నారు. భారత ఎగుమతిదారులకు అమెరికా జీఎస్పీ ప్రయోజనాల పునరుద్ధరణ కల్పిస్తే ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పెరుగుతుందని సీఐఐ జాతీయ కమిటీ అధ్యక్షుడు సంజయ్ అన్నారు.

వాణిజ్యం మరింత పెరిగే చాన్స్​

ముంబైకి  చెందిన ఎగుమతిదారు ఖలీద్ ఖాన్ మాట్లాడుతూ, ప్రపంచ మార్కెట్లలో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, అమెరికా ఇక నుంచి కూడా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతుందని అన్నారు. రానున్న సంవత్సరాల్లో న్యూఢిల్లీ , వాషింగ్టన్ మధ్య వాణిజ్యం  వృద్ధి చెందుతుందని లూథియానాకు చెందిన ఎగుమతిదారు ఎస్‌‌‌‌‌‌‌‌సి రాల్హాన్ అన్నారు. జీఎస్పీ ప్రయోజనాలను పునరుద్ధరించడాన్ని యూఎస్​ సీరియస్​గా తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. భారత్‌‌‌‌‌‌‌‌తో వాణిజ్య మిగులు ఉన్న కొన్ని దేశాలలో అమెరికా ఒకటి. 2022–-23లో అమెరికా భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2021–-22లో  119.5 బిలియన్ డాలర్ల నుంచి 2022–-23లో భారతదేశం,  యూఎస్​ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 7.65 శాతం పెరిగి 128.55 బిలియన్​ డాలర్లకు చేరుకుంది. 2020–-21లో ఇది 80.51 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతకుముందు, 2013-–14 నుంచి 2017–-18 వరకు  2020–-21లో కూడా చైనా భారతదేశపు అగ్ర వాణిజ్య భాగస్వామిగా ఉంది. చైనా కంటే ముందు, యూఏఈ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. 2022–-23లో,  76.16 బిలియన్ డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యంతో యూఏఈ భారతదేశం  మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. సౌదీ అరేబియా ( 52.72 బిలియన్ డాలర్లు)  సింగపూర్ ( 35.55 బిలియన్ డాలర్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది ఏప్రిల్–-సెప్టెంబర్​లో భారతదేశం,  యూఏఈ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం  36.16 బిలియన్ డాలర్లుగా ఉంది.