టార్గెట్ చైనా..కరోనా విషయంలో దుమ్మెత్తిపోస్తున్న దేశాలు

టార్గెట్ చైనా..కరోనా విషయంలో దుమ్మెత్తిపోస్తున్న దేశాలు

కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్న ప్రపంచ దేశా లు చైనాపై దుమ్మెత్తి పోస్తున్నాయి. డ్రాగన్‌‌ కంట్రీ పేరెత్తితేనే పండ్లు పటపట కొరుకుతున్నాయి. ప్రపంచానికి వైరస్‌‌ అంటించినందుకు మూల్యం చెల్లించాల్సిందేనంటున్నాయి. అమెరికానైతే మొదట్నుంచీ చైనాపై కన్నెర్ర చేస్తూనే ఉంది. కావాలనే వైరస్‌‌ అంటించినట్టు తెలిస్తే ఊహకందని పరిణామాలుంటాయంది. జర్మనీ రూ.12 లక్షల కోట్లు పరిహారం కట్టాలని చైనాకు ఇన్‌‌వాయిస్‌‌ పంపింది. డ్రాగన్‌‌ దేశంతో ఇంతకుముందులా వ్యాపారం జరగబోదని బ్రిటన్‌‌ తేల్చి చెప్పేసింది. ఫ్రాన్స్‌‌, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌‌ కూడా చైనాపై కారాలు మిరియాలు నూరుతూనే ఉన్నాయి.

ఊహించని పరిణామాలుంటయ్‌‌: ట్రంప్‌‌

డ్రాగన్‌‌ దేశమంటేనే ట్రంప్‌‌ పండ్లు కొరుతున్నారు. ఆ మధ్య ‘చైనీస్‌‌ వైరస్‌‌’ అని మాట్లాడారు. వైరస్‌‌ గురించి అప్రమత్తం చేయడంలో కుట్రపూరితంగా వ్యవహరించారని మండిపడ్డారు. డబ్ల్యూహెచ్‌‌ వో కూడా చైనాకు మద్దతు పలుకుతోందంటూ నిధులు ఆపేశారు. కరోనాను కావాలనే బయటకు వదిలినట్టు తేలితే చైనా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని గట్టిగా హెచ్చరించారు.  అమెరికాలోని లాయర్లు కూడా చైనాపై కేసేయడానికి సిద్ధమయ్యారు.

నష్టపరిహారం చైనానే కట్టాలి: జర్మనీ

వైరస్‌‌ వల్ల తమకు జరిగిన నష్టాన్ని కరోనాకు పుట్టినిల్లయిన చైనానే పూడ్చాలని జర్మనీ డిమాండ్‌‌ చేసింది. రూ. 12 లక్షల కోట్లు కట్టాల్సిందేనని ఇన్‌‌వాయిస్‌‌ కూడా పంపింది.  జర్మనీ వార్తా పత్రిక బిల్డ్‌‌ ఈ మేరకు వార్త రాసుకొచ్చింది.  దీనిపై స్పందించిన చైనా.. ఇది జాతీయవాదం,  విదేశాలపై వ్యతిరేకతను రెచ్చగొట్టడమేనని మండిపడింది. కరోనాకు విషయాలపై పారదర్శకత పాటించాల్సిందేనని జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ తాజాగా చైనాకు తేల్చి చెప్పారు.

అక్కడ పరిస్థితేందో ఎవరికి తెల్సు: ఫ్రాన్స్‌‌

చైనాలో కరోనాను ఎలా కట్టడి చేస్తున్నారో ఎవరికీ తెలియదని ఫ్రాన్స్‌‌ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్‌‌ మాక్రాన్‌‌ అన్నారు. అసలక్కడ ఏం జరుగుతోందో, పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియదని వ్యాఖ్యానించారు. కరోనా కట్టడి చేయడంలో చైనా విజయవంతమైందని అమాయకంగా అంగీకరించొద్దన్నారు.  ఫ్రాన్స్‌‌ మినిస్టర్‌‌ ఎమెలీ డీ మోంట్చాలిన్‌‌ కూడా చైనా, రష్యాలపై విమర్శలు చేశారు. యూరప్‌‌ దేశాలకు కిట్లు, మాస్కులు పంపడం ఓ ప్రచారమని దుయ్యబట్టారు. ఫ్రాన్స్ వైరాలజిస్ట్, మెడిసిన్‌‌లో నోబెల్ బహుమతి పొందిన ల్యుక్ మొంటాగ్నియర్ కూడా కరోనా మానవ సృష్టేనని అన్నారు. వుహాన్‌‌లోని నేషనల్ బయోసేఫ్టీ ల్యాబ్‌‌లో ఎయిడ్స్ వైరస్‌‌కు వ్యాక్సిన్ తయారుచేస్తున్నప్పుడు జరిగిన ప్రమాదంలో ఈ కొత్త వైరస్ పుట్టిందన్నారు. కరోనాలో హెచ్‌‌ఐవీ, మలేరియా దాఖలాలున్నాయని చెప్పారు. 2000 సంవత్సరం నుంచి ఈ ల్యాబ్‌‌లో పరిశోధనలు చేస్తున్నారన్నారు.

ఎట్ల కట్టడి చేశారో చెప్పాల్సిందే: బ్రిటన్‌‌

బ్రిటన్‌‌ కూడా చైనాపై నిప్పులు చెరుగుతోంది. డ్రాగన్‌‌ దేశం వైరస్‌‌ను ఎట్ల కట్టడి చేసిందో ప్రపంచ దేశాలు సమాధానం కోరుతున్నాయంది. కరోనా క్రిసిస్‌‌ తర్వాత చైనాతో బిజినెస్‌‌ ముందున్నట్లయితే జరగదని బ్రిటన్‌‌ ఫారిన్‌‌ సెక్రటరీ అన్నారు. ఆస్ట్రేలియా కూడా వైరస్​ పుట్టుకపై దర్యాప్తుకు చైనా సహకరించాలంది. వైరస్​ను ఎలా కట్టడి చేశారో చెప్పాలంది. కరోనా నష్టాలకు చైనాదే బాధ్యతని ఇజ్రాయెల్​కు చెందిన ఓ అటార్నీ అన్నారు.

చైనాలో కరోనా గురించి మాట్లాడితే అంతే

చైనాలో కరోనా గురించి మాట్లాడే వాళ్ల నోర్లు మూయిస్తోంది జీ జిన్‌‌పింగ్‌‌ సర్కారు. కరోనాపై నోరెత్తే లాయర్లను, యాక్టివిస్టులను ఇబ్బందికి గురి చేస్తోంది. దేశ ద్రోహులుగా, పాజిటివ్ కేసులుగా ముద్ర వేస్తోంది. ఎక్కడున్నా వెంటాడి పట్టుకొని రహస్య ప్రాంతాలకు, క్వారంటైన్​ ప్రాంతాలకు తరలిస్తోంది. వాళ్ల ఆచూకీ కూడా చెప్పకుండా జాగ్రత్త
పడుతోంది. పైకేమో అలాంటిదేం లేదంటోంది.