
US China Trade War: సుదీర్ఘ చర్చల తర్వాత అమెరికా చైనాలు వాణిజ్య ఒప్పందం విషయంలో చివరి అంకాన్ని చేరుకున్నాయి. స్విడ్జర్లాండ్ వేదికగా జరుగుతున్న చర్చలపై ట్రంప్ కూడా సంతోషం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
మే 12, 2025న చైనా అమెరికాలు గతంలో ఒకరిపై మరొకరు ప్రకటించిన సుంకాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించాయి. దీంతో తాజాగా 90 రోజుల పాటు అమలులో ఉండే కొత్త సుంకాలను ఇరు దేశాలు అంగీకరించాయి. దీంతో చైనాపై గతంలో విధించిన 145 శాతం సుంకాన్ని ప్రస్తుతం 30 శాతానికి తగ్గిస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఇదే క్రమంలో అమెరికా నుంచి దిగుమతి చేసుకున్న వస్తువులపై 125 శాతం సుంకాలను ప్రస్తుతం 10 శాతానికి తగ్గిస్తున్నట్లు చైనా ప్రకటించింది. ప్రస్తుతం ఇరు దేశాలు అంగీకరించిన కొత్త సుంకాలు మే 14 నుంచి అమలులోకి రాబోతున్నాయి.
జెనీవాలో జరిగిన ఒప్పందంపై అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బిస్సెంట్ మాట్లాడుతూ తాత్కాలికంగా 90 రోజుల పాటు పాత సుంకాలను హోల్డ్ చేస్తున్నట్లు వెల్లడించారు. రానున్న కాలంలో టారిఫ్ లను మరింతగా తగ్గించే దిశగా కొనసాగుతామని ఆయన అన్నారు. ప్రస్తుతం డీల్ కారణంగా సుంకాలు గతంలో కంటే 115 శాతం తగ్గుదలను చూశాయి. రానున్న రోజుల్లో వ్యాపారం, ఎకానమీకి సంబంధించి సంబంధాలను కొనసాగించేందుకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసేందుకు వారు అంగీకరించారు.
చైనా-అమెరికాల మధ్య విజయవంతంగా జరిగిన ట్రేడ్ డీల్ చైనాతో పాటు అమెరికా స్టాక్ మార్కెట్లను సానుకూలంగా ప్రభావితం చేయనుంది. అయితే ఇప్పటికే ఈ ప్రభావం ఇండియాతో పాటు గ్లోబల్ మార్కెట్లలో బుల్ ర్యాలీ రూపంలో కనిపిస్తోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.