అమెరికాపై చైనా నిఘా.. క్యూబాలో గూఢచారులు

అమెరికాపై చైనా నిఘా..  క్యూబాలో గూఢచారులు

వాషింగ్టన్: అమెరికాపై చైనా నిఘా పెట్టింది. 2019 నుంచి సీక్రెట్​గా ఆ దేశ కార్యకలాపాల సమాచారం సేకరిస్తోంది. ఇదంతా క్యూబా వేదికగా చేస్తోంది. ఇందుకోసం అక్కడ తమ గూఢచారులను నియమించింది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన అధికారి ఒకరు వెల్లడించారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా నిఘా పెట్టేందుకు చైనా ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా 2019లో క్యూబాలో ఇంటెలిజెన్స్ వ్యవస్థను అప్ గ్రేడ్ చేసింది. అది ఇప్పటికీ కొనసాగుతోంది” అని ఆయన తెలిపారు. చైనా గూఢచర్యం నిజమేనని వాల్ స్ట్రీట్ జర్నల్ కూడా పేర్కొంది. ‘‘చైనా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏర్పాటుకు క్యూబా కూడా అంగీకరించింది. ఇందుకుగాను బిలియన్ డాలర్లను క్యూబాకు చైనా చెల్లించేలా ఒప్పందం జరిగింది’’ అని తెలిపింది. 


 వైట్ హౌస్ స్పందన భిన్నం.. 

వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టు పూర్తి కచ్చితమైనది కాదని వైట్ హౌస్ పేర్కొంది. ‘‘మేం ప్రపంచవ్యాప్తంగా చైనా కదలికలను గమనిస్తున్నాం. ముఖ్యంగా ఈ రీజియన్​లో ప్రత్యేక దృష్టి పెట్టాం. ఇదేం కొత్త విషయం కాదు. రిపోర్టులో పేర్కొన్న అంశాలకు మా దగ్గరున్న సమాచారానికి తేడా ఉంది” అని వైట్ హౌస్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ అధికార ప్రతినిధి జాన్ కిర్బీ తెలిపారు. మరోవైపు, వాల్ స్ట్రీట్ రిపోర్టును  క్యూబా కూడా ఖండించింది.