మే నాటికి అమెరికా ట్రాక్ లోకి వస్తది

మే నాటికి అమెరికా ట్రాక్ లోకి వస్తది
  • హెల్త్ అడ్వైజర్ ఆంటోనీ ఫౌసి ఆశాభావం

వాషింగ్టన్: కరోనా బారిన పడి విలవిలలాడుతున్న అమెరికాలో మే నెలలో పరిస్థితి కుదుటపడుతుందని, క్రమంగా అన్ని కార్యకలాపాలు మొదలయ్యే అవకాశం ఉందని హెల్త్ అడ్వైజర్ ఆంటోనీ ఫౌసి చెప్పారు. మేలో రిస్ట్రిక్షన్స్ క్రమంగా ఎత్తివేయవచ్చని, అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయనఅన్నారు. ఇంతకు ముందు ఈస్టర్ నాటికి పరిస్థితి కుదుటపడుతుందని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఆశించారు. అయితే కరోనా విజృంభించడంతో చర్చిలు మూతపడ్డాయి. ప్రజలు ఆన్ లైన్ లోనే ఈస్టర్ వేడుకలు జరుపుకున్నారు. త్వరలో మామూలు పరిస్థితులు నెలకొల్పి లాక్ డౌన్ ను ఎత్తివేయాలని ట్రంప్ పై ఒత్తిడి పెరుగుతోంది. ఆయన ఈ దిశగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కంటికి కనిపించని శత్రువుతో చేస్తున్న యుద్ధంలో మనం గెలుస్తున్నాం, గెలుస్తామని ఆదివారం ట్రంప్ ట్వీట్ చేశారు. మేలో అంతా రీఓపెన్ చేయవచ్చని, అయితే ఇప్పుడే ఏం చెప్పలేమని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ స్టీఫెన్ హాన్ అన్నారు. సాధ్యమైనంత త్వరగా రీఓపెన్ చేయాలనే అనుకుంటామని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యూమో అన్నారు. హాస్పిటళ్లలో అడ్మిట్ అయ్యేవారి సంఖ్య, ఐసీయూల్లో ట్రీట్ మెంట్ తీసుకునేవారి సంఖ్య తగ్గడం మొదలైందని ఆయన అన్నారు. అయితే న్యూజెర్సీ గవర్నర్ ఫిల్ మర్ఫీ మాత్రం భిన్నమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. బాధితులందరూ రికవరీ అయితేనే ఎకానమీ రికవరీ సాధ్యమన్నారు. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తుంటే లాక్ డౌన్ ఎత్తివేస్తే ఎగిసిపడే మంటకు పెట్రోల్ పోసినట్లు ఉంటుందని ఆయన హెచ్చరించారు. అమెరికాలో 5,60 లక్షలకుపైగా కరోనా కేసులు నమోదు కాగా 22,115 మంది చనిపోయారు.