మరోసారి వడ్డీరేట్లను పెంచిన అమెరికా ఫెడ్

మరోసారి వడ్డీరేట్లను పెంచిన అమెరికా ఫెడ్

అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ మరోసారి వడ్డీ రేట్లను పెంచింది. వడ్డీరేటును 75 బేసిస్ పాయింట్లు పెంచింది.  ఫెడ్ నిర్ణయం తర్వాత వడ్డీ రేట్లు 2.25 - 2.50 శాతానికి పెరిగాయి. 1994 తర్వాత ఇదే అతిపెద్ద పెంపుకావడం గమనార్హం. అమెరికా ద్రవ్యోల్బణం ఇప్పటికే 40ఏళ్ల గరిష్ఠానికి చేరిన నేపథ్యంలో దానిని అదుపుచేసేందుకు ఫెడ్ ఈ నిర్ణయం తీసుకుంది. ద్రవ్యోల్బణం ఇదేస్థాయిలో కొనసాగితే వడ్డీ రేట్లు ఈ ఏడాది చివరకు 3.4 శాతానికి చేరుతాయని తెలుస్తోంది. జూన్, జూలై నెలల్లోనే వడ్డీ రేట్లు 1.5 శాతం పెరిగాయి.  

యూఎస్ ద్రవ్యోల్బణం జూన్ లో 9.1శాతానికి చేరగా..1980 తర్వాత ఇదే అత్యధికం. ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలోకి తెచ్చేందుక వడ్డీ రేటు పెంచడం తప్పడంలేదని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ తెలిపారు. ఆర్థిక మాంద్య పరిస్థితుల కంటే ధరల నియంత్రణే తమకు ప్రధానమని చెప్పారు. అంతా ఊహించనట్లుగానే అమెరికా రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడంతో  దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.