ఎక్కడున్నా సెల్ ​కనెక్టివిటీ

ఎక్కడున్నా సెల్ ​కనెక్టివిటీ
  • ఎక్కడున్నా సెల్ ​కనెక్టివిటీ
  • ఏఎస్​టీ నుంచి శాటిలైట్​ ఆధారిత సెల్యులార్​ నెట్​వర్క్​
  • హైదరాబాద్​లో ఆర్​ అండ్​ డీ సెంటర్​ ప్రారంభం

హైదరాబాద్​, వెలుగు: సెల్​టవర్లు లేని ప్రాంతాల్లోనూ శాటిలైట్​ ద్వారా సెల్యులార్ బ్రాడ్‌‌బ్యాండ్ నెట్‌‌వర్క్‌‌ను వచ్చే ఏడాది నుంచి అందిస్తామని అమెరికాకు చెందిన ఏఎస్​టీ స్పేస్​మొబైల్​ ప్రకటించింది. తమది ప్రపంచంలోనే మొట్టమొదటి  స్పేస్ ఆధారిత సెల్యులార్ బ్రాడ్‌‌బ్యాండ్ నెట్‌‌వర్క్‌‌ అని వెల్లడించింది. మన దేశంలో వొడాఫోన్ ​ఐడియా ద్వారా ఈ సేవలను అందిస్తామని ప్రకటించింది. ఇందుకోసం ఇది వరకే ఒక శాటిలైట్​ను లాంచ్​ చేశామని, వచ్చే సంవత్సరం మొదటి క్వార్టర్​లోగా మరో నాలుగు శాటిలైట్లు లాంచ్​ చేస్తామని తెలిపింది. హైదరాబాద్‌‌లో ఇది ఆర్ ​అండ్​డీ సెంటర్​ను సోమవారం మొదలుపెట్టింది. తెలంగాణ ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్​ రంజన్ దీనిని ప్రారంభించారు.  నెక్స్ట్‌​ జెనరేషన్​ హార్డ్‌‌వేర్, సాఫ్ట్‌‌వేర్, అంతరిక్ష సంబంధిత టెక్నాలజీలపై ఇది దృష్టి పెడుతుంది. 

 ఇక్కడే నెట్‌‌వర్క్ ఆపరేషన్స్ సెంటర్,  ఇంజనీరింగ్ స్పేస్‌‌ హోస్టింగ్ ​ఉంటాయి.  వొడాఫోన్, రాటుకెన్​, అమెరికన్​ టవర్, శామ్​సంగ్​ నెక్స్ట్​, బెల్​ కెనడా కూడా ఏఎస్​టీ స్పేస్​మొబైల్​లో పెట్టుబడిదారులు.  కంపెనీ చైర్మన్ అబెల్ అవెల్లాన్ ఈ  సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘‘మాకు ప్రపంచవ్యాప్తంగా 700 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇండియాలో వీరి సంఖ్య 100. మా సేవలను వాడుకోవడానికి అదనంగా ఎటువంటి పరికరమూ అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న ఫోన్​తోనే సిగ్నల్​ పొందవచ్చు. మా టెక్నాలజీ 5జీని కూడా సపోర్ట్​ చేస్తుంది. 

ప్రపంచవ్యాప్తంగా మేం 35 టెలికం ఆపరేటర్లతో కలసి పనిచేస్తున్నాం. ప్రపంచమంతటికీ సేవలు అందించడానికి 90 శాటిలైట్లను లాంచ్​ చేస్తాం.  భారతదేశంలో దాదాపు మూడింట రెండు వంతుల మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.  ఏఎస్​టీ స్పేస్​ మొబైల్  మిషన్ వారికి ఎంతో ఉపయోగపడుతుంది. మాకు ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ల మంది కస్టమర్లు ఉన్నారు”అని అన్నారు.