ఐస్ క్రీమ్ నాకి జైలు పాలయ్యాడు

ఐస్ క్రీమ్ నాకి జైలు పాలయ్యాడు

సూపర్‌ మార్కెట్‌ లో ఓ యువకుడు చేసిన సరదా పని అతని దూల తీర్చింది. అతడితో పాటు వచ్చిన స్నేహితులు ఓ వీడియో తీసి దాన్ని సోషల్  మీడియాలో షేర్ చేయడంతో ఆ యువకుడు జైలు పాలు కావాల్సి వచ్చింది.  ఇంతకీ ఆ వీడియో ఏంటంటే.. అమెరికాలోని టెక్సాస్‌ రాష్ట్రంలో… ఆడ్రీన్‌ ఆండర్సన్‌ అనే 24 ఏళ్ల యువకుడు వాల్‌మార్ట్‌ సూపర్‌ మార్కెట్‌కు స్నేహితులతో కలిసి వెళ్లాడు.

వెళ్లిన వాడు ఊరికే ఉండకుండా.. అక్కడో కొంటె పని చేశాడు. మార్కెట్ లో కలియతిరుగుతున్న అతడికి ఓ చోట ఐస్ క్రీమ్ బాక్స్ కనిపించింది. నోరు ఊరిందో లేక ఫ్రెండ్స్ తో సరదా చేద్దామనుకున్నాడో కానీ.. బాక్స్ లో ఉన్న ఆ ఐస్ క్రీమ్ ని కొంచెం తినేసి.. మళ్లీ  బాక్స్ పై మూతను యథావిధిగా పెట్టి, దాన్ని అదే స్థానంలో ఉంచాడు.  ఈ తతంగాన్ని అంతా అతని మిత్రబృందం వీడియో తీసింది. ఆ వీడియోలో ఆండర్సన్‌ బాక్స్ ఓపెన్ చేసి ఐస్ క్రీమ్ తింటున్న(నాకుతున్న) దృశ్యాలు రికార్డయ్యాయి. ఈ వీడియోని సోషల్ మీడియోలో షేర్ చేయడంతో..  2019లో ఇంటర్నెట్ లో వైరల్‌గా మారింది.

ఈ వీడియో అలా, అలా.. సూపర్ మార్కెట్ నిర్వాహకుల వరకూ చేరింది.దీంతో మార్కెట్ యాజమన్యం సీసీ కెమెరాలను పరిశీలించగా..గత ఏడాది ఆగష్టులో ఈ ఘటన జరిగిందని తెలుసుకున్నారు. ఆ యువకుడిపై పోలీస్ కంప్లయింట్ ఇచ్చారు.  డబ్బులు కట్టకుండా ఐస్‌క్రీం సగం తిని మిగిలిన దాన్ని అలాగే వదిలేశాడన్న విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఆండర్సన్‌ ను అరెస్ట్ చేశారు. అతనికి 30 రోజుల జైలు శిక్షతో పాటు రూ.73 వేల జరిమానా విధించింది అక్కడి ప్రభుత్వం.