న్యూయార్క్: స్పెయిన్ స్టార్ ప్లేయర్, డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్.. యూఎస్ ఓపెన్‌లో జోరు కొనసాగిస్తున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో రెండోసీడ్ అల్కరాజ్ 6–3, 6–4, 6–1తో వు యిబింగ్ (చైనా)పై గెలిచి ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. ఫలితంగా గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో వరుసగా 17వ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. కుడి మణికట్టు గాయం నుంచి కోలుకుని రీ ఎంట్రీ ఇచ్చిన అల్కరాజ్.. ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ తన ట్రేడ్ మార్క్ షాట్లతో ఆకట్టుకున్నాడు. 2 గంటల 20 నిమిషాల మ్యాచ్‌లో చైనీస్ ప్లేయర్ తొలి రెండు సెట్లలో కొద్దిగా పోటీ ఇచ్చాడు. కానీ కీలక సమయాల్లో అల్కరాజ్ తన అనుభవాన్ని ఉపయోగించి పైచేయి సాధించాడు.
మ్యాచ్ మొత్తంలో 2 ఏస్‌లు, 4 డబుల్ ఫాల్ట్స్ చేసిన అల్కరాజ్.. తన సర్వీస్‌లో 69 శాతం పాయింట్లు రాబట్టాడు. నెట్ వద్ద మెరుగైన ప్రదర్శన చూపెట్టాడు. 15 బ్రేక్ పాయింట్లలో ఏడింటిని మాత్రమే కాచుకున్నాడు. 21 విన్నర్లు, 33 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్ చేశాడు. 5 డబుల్ ఫాల్ట్స్ చేసిన యిబింగ్ ఒకే ఒక్క ఏస్ సంధించాడు. నెట్ వద్ద పాయింట్లు రాబట్టడంలో విఫలమయ్యాడు. ఏడు బ్రేక్ పాయింట్లలో రెండింటిని మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు. 40 అన్‌ఫోర్స్‌డ్ ఎర్రర్స్‌తో మూల్యం చెల్లించుకున్నాడు. ఇతర మ్యాచ్‌ల్లో బెన్ షెల్టన్ (అమెరికా) 7–6 (7/3), 6–7 (5/7), 6–3, 6–4తో డానియల్ షపలోవ్ (రష్యా)పై, ఫ్రాన్సెస్ తియాఫో (అమెరికా) 6–4, 6–2, 6–4తో వాలెంటిన్ వాచెర్ట్ (మొనాకో)పై, డానియెల్ మెద్వెదెవ్ (రష్యా) 6–4, 6–4, 6–4తో రిండర్‌కెంచ్ (ఫ్రాన్స్)పై, టొమ్మి పాల్ (అమెరికా) 6–-4, 3–-6, 6–-7 (4/7), 6–-1, 6–-3తో అలెగ్జాండర్ బుబ్లిక్ (కజకిస్తాన్)పై గెలవగా, సిట్సిపాస్ (గ్రీస్) 2–6, 6–1, 7–6 (7/3), 6–1తో లెహెక (చెక్)కు షాకిచ్చాడు.
సబలెంక సాఫీగా..
విమెన్స్ సింగిల్స్ మూడో రౌండ్‌లో టాప్‌సీడ్ అరీనా సబలెంక (బెలారస్) 6–3, 6–4తో కామిల్లా రకిమోవా (ఉజ్బెకిస్తాన్)పై, పెగులా (అమెరికా) 1–6, 6–4, 6–3తో ఫెర్నాండెజ్ (కెనడా)పై, కోస్ట్యుక్ (ఉక్రెయిన్) 6–3, 6–2తో అలెగ్జాండ్రోవా (రష్యా)పై, ఎమ్మా నవారో (అమెరికా) 6–3, 7–5తో ముచోవా (రష్యా)పై, టౌన్సెండ్ (అమెరికా) 6–2, 6–7 (3/7), 6–3తో ష్నైడర్ (రష్యా)పై, నోస్కోవా (చెక్) 6–2, 6–7 (6/8), 6–2తో లీ (అమెరికా)పై నెగ్గి ముందంజ వేయగా, స్వితోలినా (ఉక్రెయిన్) 3–6, 6–2, 3–6తో కలిన్‌స్కయా (రష్యా) చేతిలో, పౌలిని (ఇటలీ) 3–6, 3–6తో సొరెనా క్రిస్టీ (రొమేనియా) చేతిలో ఓడారు.
