
- ఇండియా ఇతర దేశాలపై ఆధారపడాల్సిందే
- 50 రోజుల్లో ఉక్రెయిన్‌తో రష్యా డీల్ కుదుర్చుకోవాలని అల్టిమేటం
- రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై సెకెండరీ టారిఫ్‌లు వేస్తామని ప్రకటన
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి టారిఫ్ పాట పాడారు. ఈసారి రష్యా నుంచి చమురు, గ్యాస్, యురేనియం, ఆయుధాలు, వ్యవసాయ ఉత్పత్తులు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం పెనాల్టీ టారిఫ్‌లు విధిస్తామని ప్రకటించారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని 50 రోజుల్లోపు రష్యా ముగించకపోతే ఈ టారిఫ్‌లు అమలవుతాయి. ఈ టారిఫ్‌ల ప్రభావం ఇండియా, చైనాపై ఎక్కువగా ఉంటుంది. మన దేశ చమురు (క్రూడాయిల్) దిగుమతుల్లో 40 శాతం వాటా ఈ దేశం నుంచే వస్తోంది.
ఈయూ, టర్కీ, బ్రెజిల్ కూడా రష్యా నుంచి నేచురల్ గ్యాస్‌ను భారీగా కొంటున్నాయి. వీటిపైనా సెకెండరీ టారిఫ్‌లు పడతాయి. ప్రస్తుతం తాత్కాలిక ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు ఇండియా, అమెరికా మధ్య వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి. వచ్చే నెల లోపు ఒక మిని డీల్ కుదిరే అవకాశం ఉంది. ఇలాంటి టైమ్‌లో ట్రంప్ హెచ్చరికలతో ట్రేడ్ డీల్ మరింత ఆలస్యమవొచ్చని ఎనలిస్టులు అంటున్నారు.
రష్యా చమురుపై ఇచ్చే డిస్కౌంట్ల కంటే అమెరికాకు భారత ఎగుమతులపై పడే టారిఫ్‌ల ఖర్చు ఎక్కువగా ఉంటుందని వివరించారు. భారత ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉందని అన్నారు.
ఇండియా, చైనానే టార్గెట్
ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేయడంతో ఈ దేశం అమ్మే క్రూడాయిల్‌పై వెస్ట్రన్ దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో రష్యాన్ క్రూడాయిల్ రేటు బాగా తగ్గింది. భారత రిఫైనరీలు డిస్కౌంట్‌లతో రష్యా చమురును కొనుగోలు చేయడం ప్రారంభించాయి. ఈ యుద్ధానికి ముందు ఇండియా మొత్తం ఆయిల్ దిగుమతుల్లో రష్యా వాటా ఒక శాతం కంటే దిగువన ఉండగా, ప్రస్తుతం సుమారు 40 శాతానికి చేరుకుంది.
ట్రంప్ టారిఫ్‌ల ప్రభావంతో ఇండియన్ రిఫైనరీలు బ్రెజిల్ వంటి కొత్త ఆయిల్ సరఫరాదారుల వైపు చూడొచ్చని ఎనలిస్టులు భావిస్తున్నారు. కానీ అప్పుడు బ్యారెల్ చమురుపై 4–5 డాలర్లు ఎక్కువ ఖర్చవుతుందని అంచనా. ఇజ్రాయెల్-, ఇరాన్ యుద్ధ సమయంలో స్ట్రైయిట్ ఆఫ్ హోర్ముజ్ ద్వారా షిప్పింగ్ ఆగిపోతుందనే ఆందోళనలు ఉన్నప్పుడు, రెండు వెస్ట్ ఏషియన్ చమురు ఉత్పత్తిదారులను సంప్రదించామని ప్రభుత్వం చెబుతోంది.
ఇజ్రాయెల్, -ఇరాన్ యుద్ధ సమయంలో భారత రిఫైనరీలు రష్యా నుంచి భారీగా క్రూడాయిల్‌ను కొనుగోలు చేశాయి. ఈ 50 రోజుల టైమ్‌లో కూడా ఇలాంటి వ్యూహాన్నే అనుసరించొచ్చు. అదే సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కునే అవకాశం ఉంది.
రష్యా నుంచి ఏయే దేశం ఏం కొంటుందంటే?
క్రూడాయిల్: రష్యా క్రూడాయిల్ ఎగుమతుల్లో 47 శాతం చైనాకు పోతోంది. ఇండియాకు 38 శాతం, ఈయూ (యూరోపియన్ యూనియన్)కు 6 శాతం, టర్కీకి 6 శాతం పోతోంది.
ఆయిల్ ప్రొడక్ట్‌లు (పెట్రోల్, డీజిల్ వంటివి): వీటిని టర్కీ ఎక్కువగా కొంటోంది. రష్యా ఎగుమతి చేసిన ఆయిల్ ప్రొడక్ట్‌లలో 26 శాతం టర్కీకి, 13 శాతం చైనాకు, 12 శాతం బ్రెజిల్‌కు వెళుతున్నాయి.
ఎల్‌ఎన్‌జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్): ఎల్‌ఎన్‌జీని ఈయూ ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. మొత్తం రష్యా అమ్మే ఎల్‌ఎన్‌జీలో 51 శాతం ఈయూకే పోతోంది. చైనాకు 21 శాతం,
జపాన్‌కు 18 శాతం వెళుతోంది.
పైప్‌లైన్ గ్యాస్: 37 శాతం వాటా ఈయూకి, 30 శాతం చైనాకు, 27 శాతం టర్కీకి వెళుతున్నాయి.