యునెస్కోలో మళ్లీ చేరుతం.. రూ.5 వేల కోట్ల బకాయిలు చెల్లిస్తం

యునెస్కోలో మళ్లీ చేరుతం.. రూ.5 వేల కోట్ల బకాయిలు చెల్లిస్తం

పారిస్: యూఎన్  కల్చరల్, సైంటిఫిక్  ఏజెన్సీ యునెస్కో లో మళ్లీ చేరాలని అమెరికా నిర్ణయించుకుంది. యునెస్కోకు బాకీ ఉన్న రూ.5 వేల కోట్ల బకాయిలను కూడా తిరిగి చెల్లిస్తామని యూఎస్  ప్రకటించింది. ఈ విషయాన్ని యునెస్కో సోమవారం వెల్లడించింది. యునెస్కో పాలసీ మేకింగ్ లో  తమ స్థానాన్ని చైనా భర్తీ చేస్తున్నదని యూఎస్  పేర్కొంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్  ఇంటెలిజెన్స్, టెక్నాలజీ ఎడ్యుకేషన్ కోసం ప్రమాణాలను నిర్దేశిస్తున్నదని, ఈ నేపథ్యంలో చైనాకు కౌంటర్  వేయడానికి యునెస్కోలో తిరిగి చేరాలని నిర్ణయించుకున్నామని అమెరికా తెలిపింది. కాగా, 2011లో పాలస్తీనాను యునెస్కోలో సభ్య దేశంగా చేర్చడంతో అమెరికా, ఇజ్రాయెల్  ఫండింగ్  చేయడం ఆపేశాయి. అలాగే మేనేజ్ మెంట్  సమస్యలు ఉన్నాయంటూ యునెస్కో నుంచి తప్పుకోవాలని 2017లో నాటి ట్రంప్  సర్కారు నిర్ణయించుకుంది. ఇన్నేండ్ల తరువాత యునెస్కోలో రీజాయిన్  అవుతామని ప్రకటించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కోరుతూ యునెస్కో డైరెక్టర్  జనరల్  ఆండ్రీ అజౌలే కు యూఎస్  విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీ రిచర్డ్  వర్మ గత వారం లేఖ రాశారు. యునెస్కోలో తిరిగి చేరేందుకు సుముఖంగా ఉన్నామని వర్మ రాసిన లెటర్​ను అజౌలే సోమవారం నాటి సమావేశంలో చదివి వినిపించగానే సభ్య దేశాల ప్రతినిధులు కరతాళ ధ్వనులు చేశారు. అమెరికా నిర్ణయం యునెస్కోకు బలాన్ని చేకూరుస్తుందని ప్రతినిధులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. యునెస్కోకు అతిపెద్ద ఫండింగ్  దేశంగా ఉన్న అమెరికా మళ్లీ ఆ సంస్థలో సభ్యత్వం పొందాలంటే 193 సభ్య దేశాలు ఓటు వేయాల్సి ఉంది. వచ్చే నెలలో ఓటింగ్  నిర్వహించనున్నారు. 

అమెరికా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నం: చైనా

యునెస్కోలో మళ్లీ చేరాలన్న అమెరికా నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చైనా తెలిపింది. అందుకోసం యునెస్కో చేస్తున్న ప్రయత్నాలను చైనా మెచ్చుకుంది. యునెస్కోలో ఇన్నేండ్లు అమెరికా లేకపోవడంతో  నెగెటివ్  ఇంపాక్ట్  పడిందని యునెస్కోకు చైనా రాయబారి జిన్  యాంగ్  తెలిపారు. ఒక అంతర్జాతీయ సంస్థలో సభ్య దేశంగా ఉండడం కీలకమైన విషయమని చెప్పారు. యునెస్కోకు యూఎస్  తిరిగి వస్తున్నదంటే సంస్థ మిషన్, లక్ష్యాలను అమెరికా ఒప్పుకున్నట్లే అని జిన్  యాంగ్  పేర్కొన్నారు.