US Shutdown: అగ్రరాజ్యం అమెరికా షట్‌డౌన్.. ట్రంప్ ఫండింగ్ బిల్ నిరాకరణ..

US Shutdown: అగ్రరాజ్యం అమెరికా షట్‌డౌన్.. ట్రంప్ ఫండింగ్ బిల్ నిరాకరణ..

US Government Shut Down: అగ్రరాజ్యం అమెరికాకు అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ వచ్చిన నాటి నుంచి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. సంచలన నిర్ణయాలతో పాటు మిత్ర దేశాలను కూడా పక్కన పెడుతూ తనదైన దౌత్యాన్ని ప్రదర్శిస్తున్నారు ట్రంప్. ఈ క్రమంలో అర్థరాత్రి నుంచి అమెరికా ప్రభుత్వం మూతపడింది. దీంతో గడచిన ఆరేళ్లలో తొలిసారిగా నిధుల బిల్లులకు ఆమోదం లభించకపోవటంతో 1981 తర్వాత షట్‌డౌన్ అవుతున్న 15వ ప్రభుత్వంగా ట్రంప్ పరిపాలనగా నిలవనుంది. 

తాజాగా సెనేట్ స్టాప్‌గ్యాప్ నిధుల బిల్లును ఆమోదించడంలో విఫలం కావటంతో అమెరికా ప్రభుత్వం కార్యకలాపాలు నిర్వహించలేని స్థితిలోకి వెళ్లిపోయింది. దీంతో అమెరికా ప్రభుత్వం బుధవారం తన కార్యకలాపాలను చాలా వరకు మూసివేసింది. అలాగే ట్రంప్ మరింత మంది ఉద్యోగులను కొత్తగా తొలగిస్తామని బెదిరించడంతో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

ALSO READ : ట్రంప్ పీస్ ప్లాన్కు ఓకే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అంగీకారం

 ప్రస్తుతం అమెరికా షట్ డౌన్ కారణంగా సెప్టెంబర్ ఉపాధి నివేదికలు ఆగిపోతాయి. దీనికి తోడు విమాన ప్రయాణాలు నెమ్మదించటం, అమెరికాలో సైన్టిఫిక్ రీసెర్చ్ ఆగిపోవటం, అమెరికా సేనలకు చెల్లింపులు నిలిపివేత, 7లక్షల 50వేల మంది సమాఖ్య కార్మికులను తొలగించడం వంటి చర్యలు జరగనున్నాయి. దీంతో అమెరికా ప్రభుత్వానికి ప్రతి రోజూ 400 మిలియన్ డాలర్లు ఖర్చవుతుందని వెల్లడైంది. మెుత్తం మీద రిపబ్లికన్లు, డెమెుక్రాట్ల మధ్య రాజీకి పరిస్థితులు కనిపించకపోవటంతో గతంలో మాదిరిగా చివరి నిమిషంలో సమస్య పరిష్కారానికి అవకాశాలు కనిపించటం లేదని తెలుస్తోంది. 

నవంబర్ 21 వరకు ప్రభుత్వాన్ని కొనసాగించడానికి అనుమతించే స్వల్పకాలిక వ్యయ బిల్లును సెనేట్ తిరస్కరించడంతో షట్‌డౌన్ ప్రారంభమైంది. వాస్తవానికి ఏడాది చివరిలో గడువు ముగియనున్న ఆరోగ్య ప్రయోజనాల పొడిగింపును చేర్చడానికి రిపబ్లికన్లు నిరాకరించడంతో డెమొక్రాట్లు దీనిని వ్యతిరేకించారు. ట్రంప్ షట్‌డౌన్ వివాదంలో చిక్కుకోవటం ఇదే మొదటిది కాదు. 2018 లో మెుదటి టర్మ్ సమయంలో అమెరికా సరిహద్దు గోడకు నిధులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేయడంతో 35 రోజుల పాటు షట్‌డౌన్ కొనసాగిన సంగతి తెలిసిందే.