ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సీన్ అందుబాటులోకి: ట్రంప్

ఈ ఏడాది చివరినాటికి వ్యాక్సీన్ అందుబాటులోకి: ట్రంప్

వాషింగ్టన్: ఈ ఏడాది చివరి నాటికి అమెరికాలో కరోనావైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ చెప్పారు. వ్యాక్సీన్ తయారీకి అమెరికా ప్రభుత్వం తన పూర్తి ప్రయత్నాలు చేస్తోందన్నారు. వాషింగ్టన్ లోని లింకన్ మెమోరియల్ వద్ద సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఈ ఏడాది చివరినాటికి వాక్సీన్ రెడీ అవుతుందని మేము చాలా నమ్మకంతో ఉన్నాం”అని ట్రంప్ అన్నారు. సెప్టెంబర్ లో స్కూల్స్, యూనివర్సిటీలు తిరిగి ప్రారంభించాలని రాష్ట్రాలను కోరతానని చెప్పారు. ఇప్పటికే కొన్ని దేశాలు వ్యాక్సీన్ రెడీ చేస్తున్నామని చెప్తున్న విషయాన్ని ప్రస్తావించగా.. ‘‘ఇంకేదేశం వాక్సీన్ తయారు చేసినా మంచిదేగానీ.. అది పనిచేసే టీకా అయుండాలని తాను కోరుకుంటాను”అని ట్రంప్ కామెంట్ చేశారు. వాక్సీన్ ప్రయోగాలకు ‘హ్యూమన్ ట్రయల్స్’ జరుగుతున్న విషయాన్ని ట్రంప్ ప్రస్తావించారు. ప్రయోగాలకు స్వచ్ఛందంగా సహకరిస్తున్న వారు అవగాహనతోనే ముందుకొస్తున్నారని అన్నారు. ‘‘టీకా ఎప్పటివరకు అందుబాటులోకి వస్తుంది.. అనే విషయంపై డాక్టర్లు నన్ను మాట్లాడవద్దని చెప్తుంటారు. కానీ, నాకు తోచింది నేను మాట్లాడుతూంటాను”అని ట్రంప్ కామెంట్ చేశారు.