కేసీఆర్ ​వల్లనే ఇరిగేషన్ నాశనం: మంత్రి ఉత్తమ్

కేసీఆర్ ​వల్లనే ఇరిగేషన్ నాశనం: మంత్రి ఉత్తమ్

 

  •     పంటలు ఎండిపోవడానికి కారణం ఆయనే 
  •     కృష్ణాలో 299 టీఎంసీలకే ఒప్పుకుని ఏపీకి నీళ్లు దోచిపెట్టిండు 
  •     కాళేశ్వరంతో ఐదేండ్లలో 6.5 లక్షల ఎకరాలకే నీళ్లు
  •     బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ సీటు కూడా రాదని కామెంట్ 
  •     కేసీఆర్ కు మతి తప్పింది: వెంకట్ రెడ్డి   

హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఇరిగేషన్​మొత్తం నాశనమైంది కేసీఆర్ వల్లేనని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి మండిపడ్డారు. ‘‘కేసీఆర్​కమీషన్ల కక్కుర్తి, నాసిరకం పనుల వల్లే పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఆయన సీఎంగా, ఇరిగేషన్​మినిస్టర్​గా పదేండ్లలో రూ.2 లక్షల కోట్లు పెట్టి, మనందరినీ తాకట్టు పెట్టి, కార్పొరేషన్ల పేరుతో అప్పులు తీసుకొచ్చి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం.. వాళ్ల ప్రభుత్వ హయాంలోనే కూలిపోయింది. మళ్లా ఇప్పుడు ‘నేను రిపేర్​ చేస్తా..’ అంటూ కేసీఆర్ చెప్పడం జోక్​గా ఉంది. కేసీఆర్ అసమర్థత, అవగాహనలేమి, అనవసర జోక్యం, అవినీతి, కమీషన్ల కక్కుర్తి వల్లనే మేడిగడ్డ బ్యారేజీ కూలిపోయింది. పైగా మేము నీళ్లొదిలిపెట్టేశామని పిచ్చిపిచ్చిగా మాట్లాడడమేంటి? కేసీఆర్​టైంలోనే బ్యారేజీ కూలిపోయింది.. వాళ్ల హయాంలోనే నీళ్లు వదిలిపెట్టారు. మేం అధికారంలోకి రాకముందే మేడిగడ్డ బ్యారేజీ నుంచి నీళ్లు వదిలేశారు’’ అని గుర్తు చేశారు. బుధవారం హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్​ హోటల్​లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఇరిగేషన్, విద్యుత్​అంశాలపై మీడియాతో ఉత్తమ్​మాట్లాడారు. ఎన్డీఎస్​ఏ నిపుణుల కమిటీ ఇచ్చే మధ్యంతర నివేదిక ప్రకారమే మేడిగడ్డ బ్యారేజీపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. బ్యారేజీ పనికొస్తుందా? రాదా? అన్నది నిపుణుల కమిటీ తేలుస్తుందని తెలిపారు. అదే విధంగా కాళేశ్వరంపై జస్టిస్​పీసీ ఘోష్​ఆధ్వర్యంలో విచారణ పారదర్శకంగా జరుగుతున్నదన్నారు. 

ఏటా 1.3 లక్షల ఎకరాలకే నీళ్లు..  

కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చును గత ప్రభుత్వం విచ్చలవిడిగా పెంచేసిందని ఉత్తమ్​మండిపడ్డారు. ‘‘కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇప్పటికే రూ.95 వేల కోట్లు ఖర్చు పెట్టారు. అది మొత్తం పూర్తయ్యేందుకు దాదాపు రూ.1.50 లక్షల కోట్లు అవుతుంది. కేసీఆర్​ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఎంత ఖర్చు అయితేందని అంటున్నారు. అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ నుంచి ఐదేండ్లలో లిఫ్ట్​ చేసిన నీళ్లు 163 టీఎంసీలేనని చెప్పారు. ‘‘అందులో ఎల్లంపల్లి, అన్నారం, సుందిళ్లకు పంప్​ చేసినవి 51 టీఎంసీలు. రంగనాయకసాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్​లలో స్టోర్​ చేసిన నీళ్లు 112 టీంఎసీలు. ఇక మిగిలిన 75 టీఎంసీల్లో ట్రాన్స్​మిషన్ లాసెస్​కింద 10 టీఎంసీలు పోతే.. 65 టీఎంసీలతో ఐదేండ్లలో 6.5 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్లిచ్చారు” అని వివరించారు. ఏటా 1.3 లక్షల ఎకరాలకే నీళ్లిచ్చి, ఏడాదికి 30 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చామని కేసీఆర్​ చెప్పడం పచ్చి అబద్ధమని మండిపడ్డారు.  

కేటాయించిన నీళ్లనూ వాడుకోలేదు..

కృష్ణా జలాల్లో కేటాయించిన నీళ్లను కూడా గత ప్రభుత్వం సక్కగా వాడుకోలేదని ఉత్తమ్ ఫైర్ అయ్యారు. 2022–23లో 54 టీఎంసీలు, 2021–22లో 53, 2020–21లో 65, 2019–20లో 55, 2018–19లో 11.64, 2017–18లో ఒక టీఎంసీ, 2016–17లో 7, 2015–16లో 2, 2014–15లో 51 టీఎంసీలను వినియోగించుకోలేదని వివరించారు. ‘‘ఉమ్మడి ఏపీతో పోలిస్తే కేసీఆర్​హయాంలోనే కృష్ణా జలాల దోపిడీ ఎక్కువగా జరిగింది. ఏపీ మల్యాల పంప్​హౌస్ వద్ద కెపాసిటీని 6,300 క్యూసెక్కులకు పెంచి శ్రీశైలం ప్రాజెక్టులో 798 అడుగుల నుంచే నీళ్లు తీసుకెళ్లిపోతున్నది. తద్వారా హంద్రీనీవా నుంచి రోజుకు 1.09 టీఎంసీల నీళ్లను తీసుకుపోయేలా ఏపీ కెపాసిటీ పెంచుకుంది” అని తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏపీ జలదోపిడీకి పాల్పడినా కేసీఆర్​స్పందించలేదని ఫైర్ అయ్యారు. ‘‘ఎన్టీఆర్​హయాంలో పోతిరెడ్డిపాడును 11 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో డిజైన్​ చేశారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో 2005లో దాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచితే, కాంగ్రెస్​లో ఉండి కూడా మేం దాన్ని వ్యతిరేకించాం. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత పోతిరెడ్డిపాడు నుంచి రోజుకు 8 టీఎంసీలు తీసుకెళ్లేలా 92,592 క్యూసెక్కులకు కెపాసిటీని ఏపీ పెంచింది. అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్ దాన్ని అడ్డుకోలేదు” అని ఫైర్ అయ్యారు. ఎన్ఎస్​పీ టెయిల్​పాండ్ నుంచి ఏపీ తీసుకెళ్లిన నీళ్లన్నింటినీ ఏపీకి కేటాయించిన నీటి వాటాల్లో పెట్టాల్సిందిగా కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. ‘‘ఏపీకి ఇటీవల తాగునీటి కోసం 5.5 టీఎంసీల జలాలను కేటాయించింది. టెయిల్​పాండ్​ నుంచి తీసుకెళ్లిన 4 టీఎంసీల నీటిని కూడా అందులో కలపాలని మేం కేఆర్​ఎంబీని కోరాం. దీంతో ఆ నీళ్ల లెక్కలనూ ఏపీ వాటా కింద బోర్డు పెట్టింది. వెంటనే నీటి విడుదలను ఆపాల్సిందిగా ఏపీకి లెటర్​ రాసింది’’ అని చెప్పారు. కేసీఆర్ హయాంలో ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని, వాటిని తాము పూర్తి చేస్తామని తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రస్తుత ప్రాజెక్టుల ద్వారా 6.10 లక్షల ఎకరాలు, ఇప్పుడు కడుతున్న ప్రాజెక్టులను పూర్తి చేసి మరో 7.39 లక్షల ఎకరాలకు మొత్తంగా 13.5 లక్షల ఎకరాలకు నీళ్లిస్తామని వెల్లడించారు. 

కరెంట్​లోటు లేదు.. 

తెలంగాణ ఏర్పడ్డాక అత్యధిక విద్యుత్​ వినియోగం జరుగుతున్నది ఇప్పుడేనని ఉత్తమ్ చెప్పారు. ఎలాంటి లోటు లేకుండా విద్యుత్​ను నిరంతరాయంగా, సమర్థంగా అందిస్తున్నామన్నారు. ‘‘24 గంటలూ కరెంట్​సరఫరా చేస్తున్నాం. దీంతో కేసీఆర్ మైండ్​ఆగమాగమైతున్నట్టుంది. అందుకే ఏదేదో ఊహించుకుని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో మొదలుపెట్టి పూర్తి చేసింది భద్రాద్రి పవర్​ప్లాంట్ ఒక్కటే. అది కూడా ఔట్​డేటెడ్ టెక్నాలజీతో కట్టి ప్రజలపై భారం మోపారు” అని మండిపడ్డారు. ధాన్యం కొనుగోళ్లు వెంటవెంటనే జరుగుతున్నాయని చెప్పారు. 7,111 సెంటర్లలో ఇప్పటిదాకా 9.44 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. 

బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్..  

కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే మేడిగడ్డ బ్యారేజీ కూలిందని, కానీ ఆయన ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దానిపై మాట్లాడలేదని ఉత్తమ్ మండిపడ్డారు. ‘‘ఇప్పటికీ అంతా తనకే తెలుసన్న భ్రమలో కేసీఆర్ ఉన్నారు. ప్రజలు అందుకే ఆయనను తిరస్కరించారు. బీఆర్ఎస్104 నుంచి 39 సీట్లకు పడిపోయింది. ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో మరో 25 మంది మా దగ్గరకి వచ్చేస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్​కు ఒక్క సీటు కూడా రాదు. ఆ తర్వాత బీఆర్ఎస్​చాప్టర్ క్లోజ్. మాటిమాటికీ ఏదో మాట్లాడితే కుదరదు. ‘పార్లమెంట్​లో 12 సీట్లు వస్తాయి.. మళ్లీ సీఎం అయితా’ అని కేసీఆర్ అంటున్నారు. అవన్నీ కలలే.. ఆ కలల్లో జీవించడం మానుకోవాలి. ఒక్క సీటు కూడా గెలవరు. 15 స్థానాల్లో డిపాజిట్లు కూడా రావు’’ అని అన్నారు. 

555 టీఎంసీల కోసం పోరాడుతాం.. 

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్ కుటుంబం దోచుకున్నదని ఉత్తమ్ ఫైర్ అయ్యారు. కేసీఆర్ చేసిన అవినీతికి కూలిపోయిన బ్యారేజీనే సాక్ష్యమని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజనీర్, డిజైనర్, కన్​స్ట్రక్టర్.. ఇలా అన్నీ తానే అన్నట్టుగా కేసీఆర్ వ్యవహరించారని, కమీషన్లు దండుకున్నారని మండిపడ్డారు. ‘‘కృష్ణా నీళ్లను ఏపీకి కేసీఆరే దోచిపెట్టారు. గత బీఆర్ఎస్​ప్రభుత్వం రాష్ట్రానికి కేవలం 299 టీఎంసీల వాటాకే ఒప్పుకున్నది. ఏపీకి 512 టీఎంసీలు కట్టబెట్టింది. తెలంగాణకు తీరని అన్యాయం చేశారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్​నగర్​జిల్లాలకు నష్టం చేసింది ముమ్మాటికీ కేసీఆరే’’ అని మండిపడ్డారు. కేసీఆర్ కనీస అవగాహన లేకుండా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టారని ఫైర్ అయ్యారు. ‘‘కృష్ణా క్యాచ్​మెంట్​ ఏరియా 70 శాతం తెలంగాణలోనే ఉంది. దాని ప్రకారమే నీటి కేటాయింపులు జరగాలని కృష్ణా వాటర్​ డిస్ప్యూట్స్​ ట్రిబ్యునల్–2ను కోరాం. 70 శాతం వాటా చొప్పున 555 టీఎంసీలు ఇవ్వాలని కోరాం” అని తెలిపారు. ఈ నెల 29న కేడబ్ల్యూడీటీ 2 విచారణ ఉందని, అందులో తెలంగాణ గళాన్ని గట్టిగా వినిపిస్తామని చెప్పారు. 

మిడ్​ మానేరు డ్యామ్​తో నాకు సంబంధమే లేదు: వెంకట్ రెడ్డి  

కేసీఆర్​మతి తప్పి మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల టైంలో ఎంత పనిలేనోడైతే ఇన్ని గంటలపాటు ఇంటర్వ్యూ ఇస్తారని విమర్శించారు. ‘‘కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి మిడ్​మానేరు డ్యామ్ కడితే కొట్టుకుపోయిందని కేసీఆర్ మాట్లాడారు. అసలు దానితో నాకు సంబంధమే లేదు. కేసీఆర్ మెంటల్ హెల్త్​బాగా లేనట్టుంది.. ఓసారి ఆయన డాక్టర్​కు చూపించుకుంటే మంచిది. నేను ఇప్పటివరకు ఏ బిజినెస్​లో లేను. సుశీ కంపెనీ రాజగోపాల్​రెడ్డిది” అని చెప్పారు. ‘‘బిడ్డ జైల్లో ఉంటే ఎవరికైనా మెంటల్ గా బ్యాలెన్స్ తప్పుద్దేమో. లిక్కర్​కేసులో ఇరుక్కుని తెలంగాణ పరువు తీశారు. ఏదో ఘన కార్యం చేసినట్టు.. తెలంగాణ ఉద్యమం చేసి జైలుకు పోయినట్టు.. ఫ్రీడం ఫైటర్​లాగా జైలు నుంచి బయటకు వస్తుంటే కవిత చేయి ఊపుతున్నారు. తెలంగాణ కోసం నేను నిజమైన దీక్ష చేశాను. మంత్రి పదవిని వదిలేశాను. కేసీఆర్ లాగా దొంగ దీక్ష చేయలేదు” అని అన్నారు. ‘‘బీఆర్ఎస్ చాప్టర్ క్లోజ్. కవిత ముత్యమో, బంగారమో, వజ్రమో ఏదైనా మంచిదే ఇక ఆమెని ఇంట్లో పెట్టుకోండి. కవిత వల్ల తెలంగాణ తల దించుకుంది. కేసీఆర్ తన బిడ్డలనైనా మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేయాలి” అని సూచించారు.