
- కేసీఆర్ పై కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్
నల్గొండ, వెలుగు: ధాన్యం కొనుగోళ్లపై ఎఫ్ సీఐ స్పష్టమైన నోటిఫికేషన్ ఇచ్చినా మొదటి నుంచీ టీఆర్తఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తీరా ఇప్పుడు కేంద్రంపై నెపం వేస్తూ వడ్లు కొనకుండా రైతులను ఇబ్బంది పెడుతోందని ఫైరయ్యారు. ‘‘మన దేశంలో కేంద్ర ప్రభుత్వం చెప్పేదే ఫైనల్. అలాంటిది, క్వింటాల్ వడ్లు రూ.1,960 చొప్పున కొనాలని సెంటర్ చెప్పినా కేసీఆర్ సర్కారు తీరు వల్ల రైతులకు మద్దతు ధర దక్కుతలేదు. యాసంగిలో వరి వేయొద్దనుడు దుర్మార్గపు ఆలోచన. రూ.2 లక్షల కోట్ల బడ్జెట్ ఉందని చెప్పుకుంటూ, వడ్లు కూడా కొనలేరా?” అని నిలదీశారు. ‘‘రుణమాఫీ చేయని, ధాన్యం కొనని ప్రభుత్వం, సీఎం ఎందుకుని ప్రశ్నించారు. మరో రెండేళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వ చాప్టర్ క్లోజవడం ఖాయమన్నారు. ఆదివారం నల్గొండ సమీపంలోని ఎస్ఎల్‌బీసీ బత్తాయి మార్కెట్‌లో అమ్మకానికి రాశి పోసిన వడ్ల కుప్పలను ఉత్తమ్ పరిశీలించారు. తర్వాత మీడియాతో మాట్లాడారు. ‘‘కేసీఆర్ ప్రభుత్వానికి ముందుచూపు లేదు. నెల కిందే వరి కోతలు మొదలైనా, ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం వస్తున్నా కొనుగోలు సెంటర్లు ప్రారంభించలేదు. ఆంధ్రా కాంట్రాక్టర్లకు లక్షల కోట్ల కాంట్రాక్టులిచ్చి కమీషన్లు తీసుకోవడంలో ఉన్న ధ్యాస రైతులపై లేదు. వడ్ల కొనుగోలులో కేసీఆర్ ప్రభుత్వం ఫెయిలైంది. ఇలాంటి చేతగాని దద్దమ్మ ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు” అంటూ దుయ్యబట్టారు. ప్రతి గింజా కొనేదాకా రైతుల పక్షాన కాంగ్రెస్ పోరాడుతుందన్నారు.
ఎందుకు కొనరు?
ఐకేపీ సెంటర్లకు రైతులు ధాన్యం తెచ్చి నెలవుతున్నా ఎందుకు కొనడం లేదని ఉత్తమ్ ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ ది మోసపూరిత వైఖరి. పంట రుణమాఫీ ఏమైంది? వడ్లను రాష్ట్ర ప్రభుత్వమే విదేశాలకు ఎందుకు ఎగుమతి చేయదు? మిల్లర్లు కూడా రైతులకు అండగా ఉండాలె. మద్దతు ధర ఇవ్వకున్నా, ఇతర ప్రాంతాల వ్యాపారులు రైతులను బెదిరించినా ఊరుకోం” అని హెచ్చరించారు. అంతకుముందు రైతులతో మాట్లాడిన ఉత్తమ్, వారి సమస్యలను కలెక్టర్‌కు ఫోన్లో వివరించారు.