కరప్షన్‌‌ లో ఉత్తమ్‌‌కుమార్‌‌ రెడ్డి నంబర్‌‌ వన్‌‌ ..కమీషన్ల కోసమే కేంద్రీయ విద్యాలయానికి స్థలం ఇవ్వట్లే

కరప్షన్‌‌ లో ఉత్తమ్‌‌కుమార్‌‌ రెడ్డి నంబర్‌‌ వన్‌‌ ..కమీషన్ల కోసమే కేంద్రీయ విద్యాలయానికి స్థలం ఇవ్వట్లే
  • నిజామాబాద్ ఎంపీ అర్వింద్‌‌

జగిత్యాల టౌన్, వెలుగు : అవినీతికి పాల్పడడంతో మంత్రి ఉత్తమ్‌‌ కుమార్‌‌ రెడ్డి నంబర్‌‌ వన్‌‌ అని నిజామాబాద్‌‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌‌ ఆరోపించారు. మంగళవారం జగిత్యాలలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగిత్యాలకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి ఇరిగేషన్‌‌ శాఖకు సంబంధించిన స్థలాన్ని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 

భూమి కేటాయించేందుకు కూడా ఉత్తమ్‌‌కుమార్‌‌ రెడ్డికి వాటాలు కావాలేమో అని ఎద్దేవా చేశారు. పేదలకు ఇస్తున్న రేషన్‌‌ బియ్యంలో రూ. 32 కేంద్రం ఇస్తే రూ. 3 మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని.. అలాంటప్పుడు ప్రధాని మోదీ ఫొటో పెట్టేందుకు అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. ఇదే విషయమై కలెక్టర్‌‌ను ప్రశ్నిస్తే ఆయన సైతం సమాధానం చెప్పడం లేదని మండిపడ్డారు.

 కేంద్రం ఇస్తున్న బియ్యం పంపిణీ చేయడానికి... రాష్ట్ర ప్రభుత్వం సంచులు ప్రింట్‌‌ చేసుకొని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఫొటోలు వేసుకుంటున్నారన్నారు. హెల్త్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు. గ్రామీణ సడక్​ యోజనలో ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌‌ ప్రభుత్వం కూడా కేసీఆర్‌‌ ఆలోచనతోనే ముందుకు పోతే రాష్ట్ర అభివృద్ధి ఎట్లా జరుగుతుందని ప్రశ్నించారు.