యూపీ ఎలక్షన్స్.. 100 సీట్లలో ఎంఐఎం పోటీ

యూపీ ఎలక్షన్స్.. 100 సీట్లలో ఎంఐఎం పోటీ

లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 403 సీట్లకు గానూ ఎంఐఎం పార్టీ 100 చోట్ల పోటీ చేయబోతోందని ఆ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఎంఐఎం పార్టీ.. యూపీ చెందిన కొన్ని చిన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుని, భగీదరీ సంకల్ప మోర్చా పేరుతో కూటమిని ఏర్పాటు చేసి.. ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ ఎన్నికల్లో తమ కూటమి గట్టి ప్రభావాన్ని చూపనుందని ఒవైసీ చెప్పారు. ఆయన ఇవాళ లక్నోలో జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమ కూటమికి కన్వీనర్‌‌గా జన్ అధికార్‌‌ పార్టీ చీఫ్ బాబూ సింగ్ కుష్వాహా వ్యవహరిస్తారని ప్రకటించారు. ఈ ఎన్నికల్లో తమ కూటమి గెలిచి, ప్రభుత్వాన్ని  ఏర్పాటు చేస్తే కుష్వాహానే సీఎం అవుతారని ఒవైసీ చెప్పారు. అయితే ఆయన తొలి రెండున్నరేళ్ల పాటు సీఎం పదవిలో ఉంటారని, ఆ తర్వాత మిగిలిన రెండున్నరేళ్లు ఒక దళిత నేతకు సీఎం పదవి అప్పగించాలని కూటమి నిర్ణయించిందని తెలిపారు. అలాగే తాము అధికారంలోకి వస్తే ముగ్గురికి డిప్యూటీ సీఎం పదవులు ఇస్తామని, అందులో ఒకటి ముస్లిం నేతకు, మిగిలిన రెండు బీసీ నేతలకు ఇవ్వాలని తీర్మానించామని చెప్పారు.

యూపీలో అసెంబ్లీ ఎన్నికల వేడి రోజు రోజుకూ పెరుగుతోంది. ఫిబ్రవరి 10 నుంచి మొత్తం ఏడు దశల్లో నిర్వహించే పోలింగ్ చివరి ఫేజ్ మార్చి 7న ఉంటుంది. ఓట్ల కౌంటింగ్‌ మార్చి 10న నిర్వహించనున్నట్లు ఈసీ ప్రకటించింది. అయితే ఈ రాష్ట్రంలో ప్రధాన పోటీ అధికార బీజేపీ, అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీల మధ్యనే ఉంటుందని పలు సంస్థల సర్వేలు అంచనా వేస్తున్నాయి.

మరిన్ని వార్తల కోసం..

బీజేపీ నేత హత్య కేసు: నిందితుల్ని పట్టిస్తే రూ.2.5 లక్షలు

ఇకపై మొబైల్ ప్రీపెయిడ్ ప్యాక్స్ వ్యాలిడిటీ 30 రోజులు

ఫిబ్రవరి 15 తర్వాత ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సర్వ దర్శనం టికెట్లు!