బీజేపీ కార్యకర్త హత్య కేసు: నిందితుల్ని పట్టిస్తే సీబీఐ నజరానా

బీజేపీ కార్యకర్త హత్య కేసు: నిందితుల్ని పట్టిస్తే సీబీఐ నజరానా

పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత అభిజిత్ సర్కార్‌‌ హత్య కేసులో నిందితులను పట్టుకునేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నగదు రివార్డు ప్రకటించింది. పరారీలో ఉన్న నిందితులను పట్టించినా, వాళ్ల ఆచూకీకి సంబంధించిన సమాచారం ఇచ్చినా క్యాష్ ప్రైజ్ అందిస్తామని సీబీఐ తెలిపింది. ఈ కేసులో మొత్తం ఐదుగురు నిందితులు ఉన్నారని, ఒక్కొక్కరిపై రూ.50 వేల చొప్పున రివార్డ్ ప్రకటించామని సీబీఐ ఇవాళ ఓ ప్రకటనలో పేర్కొంది. నిందితుల ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వారి వివరాలను రహస్యంగా ఉంచుతామని, వాళ్ల సమాచారం ఉంటే ఎలాంటి భయం లేకుండా చెప్పాలని దర్యాప్తు సంస్థ కోరింది.

ఫోన్, మెయిల్.. ఎలా అయినా ఇన్ఫర్మేషన్ ఇవ్వొచ్చు

అభిజిత్ హత్య కేసులో మొత్తం ఐదుగురు నిందితులను సీబీఐ గుర్తించింది. అమిత్ దాస్ అలియాస్ కెటో, తుంపా దాస్ అలియాస్ కాళీ, అరూప్ అలియాస్ బాపి, సంజయ్ బరి, పాపియా బరిక్‌ అనే ఐదుగురు నిందితులని సీబీఐ డీఐజీ అఖిలేశ్ కుమార్ సింగ్ తెలిపారు. నిందితులంతా కోల్‌కతాలోని శీతలాతల లేన్‌ ఏరియాకు చెందిన వారని, ఒక్కొక్కరిపైనా రూ.50 వేల చొప్పున రివార్డ్ ప్రకటించామని చెప్పారు. వాళ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్‌ను కోల్‌కతాలోని సీబీఐ స్పెషల్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీసుకు ఫోన్ ద్వారా లేదా మెయిల్ ద్వారానైనా తెలియజేయొచ్చని అన్నారు.

ఎన్నికల తర్వాత హింస.. హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత ప్రతిపక్ష కార్యకర్తల ఇండ్లపై అనేక చోట్ల రాజకీయ దాడులు జరిగాయి. ఈ హింసలోనే బీజేపీ కార్యకర్త అభిజిత్ సర్కార్ ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ ఘటనపై బెంగాల్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసులో నిందితులకు అధికార పార్టీతో సంబంధాలు ఉన్నాయని, రాష్ట్ర పోలీసులు దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే అవకాశం లేదని, సీబీఐకి అప్పగించాలని ఆ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కేసును సీబీఐకి కేసు అప్పగించాలని ఆదేశాలు ఇచ్చింది. దీంతో కేసు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన సీబీఐ.. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు గాలిస్తోంది. గత ఏడాది నవంబర్ 17న కోర్టు ఇష్యూ చేసిన అరెస్ట్ వారెంట్ విషయంలో ఇప్పటి వరకు ఏ మాత్రం పురోగతి లేకపోవడంతో నిందితులను పట్టుకునేందుకు సీబీఐ కొత్త ప్లాన్‌తో సిద్ధమైంది.

మరిన్ని వార్తల కోసం..

ఫిబ్రవరి 1 నుంచి స్కూళ్లు, కాలేజీలు రీ ఓపెన్

ఫిబ్రవరి 15 తర్వాత ఆఫ్‌లైన్‌లో శ్రీవారి సర్వ దర్శనం టికెట్లు!

మహిళా కమిషన్ నోటీసులు.. రూల్స్ మార్చిన ఎస్బీఐ