
అయోధ్య స్థల వివాదంపై సుప్రీం ఇవ్వనున్న తీర్పులో భాగంగా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం అప్రమత్తం చేసింది. ఐదుగురు సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనం చీఫ్‌జస్టిస్ రంజన్ గగోయ్ నేతృత్వంలో ఈనెల 17వ తేదీలోపు ఏ రోజైనా తీర్పు వెలువరించనుంది. ఈ క్రమంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు యూపీలోని ఆదిత్యనాధ్ ప్రభుత్వం రెడీ అయ్యింది. ఎనిమిది తాత్కాలిక జైళ్లను కూడా ఏర్పాటు చేసింది. అంబేద్కర్‌నగర్ జిల్లాలో అయోధ్య కేసు తీర్పు రానుండటంతో తక్షణ అవసరాలకోసం కాలేజీలను జైళ్లుగా మార్చారు.
అయోధ్యపై 40రోజుల పాటు రోజువారి విచారణ నిర్వహించిన రాజ్యాంగధర్మాసనం న్యాయపరంగానే 2.77 ఎకరాల వివాదాస్పద స్థలానికి ఒక పరిష్కారం చూపించనున్నది. అలహాబాద్ హైకోర్టు 2010లో ఇచ్చిన తీర్పుపై దాఖలయిన అప్పీళ్లను ముందు మధ్యవర్తిత్వం ప్రక్రియతో పరిష్కరించాలనిభావించింది. అయితే అందుకు ససేమిరా అంగీకారానికి రాకపోవడంతో ఇపుడు రోజువారి విచారణతో విచారణలు,వాదనలు ముగించిన ధర్మాసనం 17వ తేదీలోపు తీర్పునిచ్చేందుకు సిద్ధం అయింది. కేంద్రం, ఉత్తర ప్రదేశ్‌ప్రభుత్వం రాజకీయ పార్టీలు అయోధ్యతీర్పుకోసం ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి.