ఉత్తరాఖండ్: దేవభూమి సైడ్ లైట్స్

ఉత్తరాఖండ్:  దేవభూమి సైడ్ లైట్స్
  • ఉత్తరాఖండ్​లో బీజేపీ గెలుపు, 70 స్థానాల్లో 47 కైవసం
  • 19 స్థానాలతో ప్రతిపక్షంలో కాంగ్రెస్​
  • ప్రభావం చూపించలేకపోయిన మజ్లిస్​పార్టీ
  • వాస్తులు మార్చినా గెలవని సీఎం
  • కాంగ్రెస్​ అభ్యర్థి చేతిలో పరాజయం
  • మాజీ సీఎం హరీశ్​ రావత్​కూ తప్పని పరాభవం
  • హరీశ్​ కూతురు అనుపమ రావత్​ గెలుపు

డెహ్రాడూన్​: దేవభూమిలో మళ్లీ కాషాయ జెండానే ఎగిరింది. కమలం పువ్వుకే ఉత్తరాఖండ్​ హారతి పట్టింది. బీజేపీకే పట్టం కట్టింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఓడిపోయినా.. అపూర్వమైన మెజారిటీని సాధించింది. సర్కారును ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. 70 స్థానాల్లో 47 సీట్లలో బీజేపీ గెలిచింది. 19 స్థానాల్లో గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్​ నిలిచింది. బహుజన్​ సమాజ్​ పార్టీ 2 స్థానాల్లో గెలవగా, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. మజ్లిస్​ పార్టీ బరిలో నిలిచినా ఎక్కడా తన ప్రభావాన్ని చూపించలేకపోయింది. 
ఓట్​ షేర్​లోనూ షేరే
రాష్ట్రంలో సాధించిన ఓట్​షేర్​లోనూ బీజేపీ షేర్​గానే నిలిచింది. మొత్తం ఓట్లలో 44.3 శాతం మంది బీజేపీవైపే మొగ్గు చూపారు. 23,79,598 ఓట్లు కాషాయ పార్టీకి పోలయ్యాయి. కాంగ్రెస్​ పార్టీకి మెజారిటీ సీట్లు రాకపోయినా.. బీజేపీకి మాత్రం గట్టిపోటీనే ఇచ్చింది. ఆ పార్టీకీ ఓట్లు బాగానే పోలయ్యాయి. 20,35,379 మంది కాంగ్రెస్​ వైపు మొగ్గు చూపారు. ఆ పార్టీ ఓట్​ షేర్​ 37.9 శాతంగా ఉంది. రెండు పార్టీల మధ్య ఓట్లే తేడా 3 లక్షలకన్నా ఎక్కువుంది. 
కాంగ్రెస్​ వస్తదని మంత్రులు జంప్​ అయినా..
వాస్తవానికి ఈ సారి ఉత్తరాఖండ్​లో కాంగ్రెస్​ ప్రభుత్వం ఖాయమని ఎన్నికలకు ముందు కీలక నేతలు ఊదరగొట్టారు. దీంతో అధికార పార్టీ బీజేపీ నుంచి కొందరు కాంగ్రెస్​లోకి జంప్​ అయ్యారు. మంత్రులూ అందులో ఉన్నారు. మంత్రి వర్గం నుంచి బహిష్కరణకు గురైన హారక్​ సింగ్​ రావత్​ జనవరిలో కాంగ్రెస్​ పార్టీలోకి వెళ్లిపోయారు. మంత్రి, ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన యశ్​పాల్ ఆర్య తన కొడుకు నైనిటాల్​ ఎమ్మెల్యే అయిన సంజీవ్​తో కలిసి గత ఏడాది అక్టోబర్​లో కాంగ్రెస్​ పార్టీలోకి వలసెళ్లిపోయారు. ఒకానొక దశలో దళితుడైన యశ్​పాల్​ ఆర్యనే సీఎం క్యాండిడేట్​గా కాంగ్రెస్​ ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారమూ జరిగింది. అయినా, కూడా అవేవీ కాంగ్రెస్​ పార్టీని గట్టెక్కించలేకపోయాయి.  
 ప్రచార ఎత్తుగడలు ఫలించలేదు: హరీశ్​ రావత్​
ఎన్నికల్లో పార్టీ ఓటమిపై కాంగ్రెస్​ ఉత్తరాఖండ్​ ఇన్​చార్జ్​ హరీశ్​ రావత్​ స్పందించారు. ఎన్నికల్లో తాము అనుసరించిన ప్రచార ఎత్తుగడలు ఫలించలేదని ఆయన చెప్పారు. ప్రచార కమిటీ చైర్మన్​గా ఓటమికి నైతిక బాధ్యత వహిస్తున్నానన్నారు. ఎన్నికల్లో గెలుపు కోసం కష్టపడి పనిచేసిన ప్రతికార్యకర్తకు కృతజ్ఞతలు చెప్పారు. తన కూతురు అనుపమరావత్​తో పాటు గెలిచిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. తాను ప్రజల నమ్మకాన్ని పొందలేకపోయానన్నారు. ఉత్తరాఖండ్​ ప్రజల మనసును గెలుచుకోవడంలో ఫెయిల్​ అయ్యామన్నారు. మార్పు కోసం ప్రజలు ఓటేస్తారని భావించామని, కానీ, తమ అంచనాలు తప్పాయని అన్నారు.  

సైడ్​లైట్స్​
మాజీ సీఎం హరీశ్​ రావత్​లాల్​కువా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. బీజపీ అభ్యర్థి డాక్టర్​ మోహన్​ సింగ్​ బిష్త్​ చేతిలో 17,527 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే, ఆయన కూతురు అనుపమ రావత్​.. హరిద్వార్​ రూరల్​ నియోజకవర్గంలో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి యతీశ్వరానంద్​పై 4,472 ఓట్ల మెజారిటీ గెలుపొందారు.
దీదీహట్​ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి విషాన్​ సింగ్​.. ఇండిపెండెంట్​ అభ్యర్థి కిషన్​ భండారీపై 3,226 ఓట్ల తేడాతో విజయం సాధించారు. వరుసగా ఆరోసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 
ప్రస్తుత విద్యాశాఖ మంత్రి అర్వింద్​ పాండే గదర్​పూర్​ స్థానం నుంచి కాంగ్రెస్​ అభ్యర్థి ఖజన్​ చంద్ర గుడ్డుపై 10,053 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 
డెహ్రాడూన్​ జిల్లాలోని 10 స్థానాల్లో 9 సీట్లను బీజేపీ గెలుచుకుంది. 

సీఎం ఓడిపోయిన్రు
ఎన్నో అంచనాలతో ఉత్తరాఖండ్​ ప్రభుత్వ పగ్గాలను గత ఏడాది పుష్కర్​ సింగ్​ ధామికి బీజేపీ అధిష్ఠానం అప్పగించింది. ఇప్పుడు ఎన్నికల్లో సీఎం ఫేస్​గా ఉన్న ఆయనే.. ఓడిపోయారు. కాంగ్రెస్​ అభ్యర్థి చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. ఖతీమా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆయన.. కాంగ్రెస్​ అభ్యర్థి భువన్​ చంద్ర కాప్రి చేతిలో 6,579 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆ నియోజకవర్గంలో మొత్తం 92,850 ఓట్లు పోలవగా..  పుష్కర్​ సింగ్​ ధామికి 41,598 ఓట్లు (44.8%), భువన్​ చంద్ర కాప్రికి 48,177 ఓట్లు (51.89%) వచ్చాయి.

కాగా, కౌంటింగ్​ మధ్యలో ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తడంతో అధికారులు కొద్దిసేపు లెక్కింపును ఆపారు. అయితే, ఆయన వెనుకంజలో ఉండడం వల్లే లెక్కింపును ఆపారాన్న ఆరోపణలు వినిపించాయి. వాస్తవానికి సీఎం కొత్త ఇంట్లో వాస్తు బాగాలేదని చెప్పి మార్పులు చేయించారు. పూజలు, హోమాలూ చేశారు. కానీ, అవేవీ ధామికి కలసిరాలేదు.