వీడని పోడు చిక్కులు

వీడని పోడు చిక్కులు

అడవులను నమ్ముకొని బతికే గిరిజనులకు అటవీ భూములే ఆధారం. వాటిపై హక్కు కోసం ఏండ్ల తరబడి ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం -2006 లో మొదటిసారిగా గిరిజనులకు అడవిపై హక్కులను గుర్తిస్తూ ‘‘షెడ్యూల్ తెగలు, ఇతర సాంప్రదాయక అటవీ నివాసితుల అటవీ హక్కుల గుర్తింపు చట్టం- 2006’ తీసుకొచ్చింది. ఈ చట్టం వచ్చిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ప్రభుత్వం 2008–-09 సంవత్సరంలో తెలంగాణ ప్రాంతంలో పోడు భూముల హక్కు పత్రాల కోసం దరఖాస్తులు స్వీకరించింది. మొత్తం 2,04,176 దరఖాస్తులు వస్తే, వాటిలో 92,744 తిరస్కరణకు గురయ్యాయి. 97, 434 మంది వ్యక్తిగత హక్కులు పొందారు. 721 మంది సామూహిక హక్కులు పొందారు. అటవీ హక్కులు అసంపుర్తిగా ఇవ్వడంతో పోడు భూములు సాగు చేసుకుంటున్న గిరిజనులు వాటిపై హక్కుల కోసం తెలంగాణ ఏర్పాటు నుంచే ప్రభుత్వాన్ని డిమాండ్​చేస్తూ వస్తున్నారు. దాదాపు 8 సంవత్సరాల అనంతరం పోడు భూములకు హక్కు పత్రాల కోసం 2021 నవంబర్​8 నుంచి డిసెంబర్​8 వరకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. తర్వాత వీటి పరిష్కారం కోసం జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తూ  జీవో నెంబర్140ని విడుదల చేసింది. ఈ జీవో వివాదస్పదం కావడంతో హైకోర్టు దాన్ని నిలిపివేసింది. రాజ్యాంగంలో ఉన్న ఐదో షెడ్యూల్​లో పేర్కొన్న వివిధ రాష్ట్రాల్లో ఉన్న గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరుల జోక్యం తగ్గించాలనే ఉద్దేశంతో 1996లో పంచాయతీరాజ్‌‌ ఎక్స్‌‌టెన్షన్‌‌ టూ షెడ్యూల్‌‌ ఏరియా(పెసా) చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టం తీసుకొచ్చినప్పటికీ నియమ నిబంధనలు మాత్రం 2011లో ఉనికిలోకి వచ్చాయి. ఆ తర్వాత ఎనిమిదేళ్ల తర్వాత గతేడాది నుంచి పెసా కమిటీలను పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నారు.  అటవీ హక్కుల కమిటీ, అటవీశాఖ, రెవెన్యూ అధికారులు సర్వే పూర్తి చేసి వాటి వివరాలు గ్రామ సభలకు పంపారు. అయితే గ్రామసభలు రాజకీయ సభల్లాగా నడుస్తున్నాయి. పెసా మొబిలైజర్స్, కార్యదర్శులు, సభ్యులకు ఆహ్వానం లేకుండా కేవలం సర్పంచ్ అధ్యక్షతన రాజకీయ సమావేశాలు నిర్వహిస్తూ హక్కుల గుర్తింపు పూర్తి చేసి ఆపై సబ్ డివిజనల్ స్థాయి అధికారులకు పంపడం జరుగుతున్నది. ఇలాంటి చర్యలతో కొన్ని చోట్ల అర్హులకు అన్యాయం జరుగుతున్నది. 

గిరిజనేతరులకు హక్కు పత్రాలా?

చాలావరకు పోడు భూములపై వ్యక్తిగత హక్కుల కోసమే రైతులు దరఖాస్తు చేసుకున్నారు కానీ, సామూహిక హక్కులైన చెరువులు, రోడ్లు, అటవీ గ్రామాల గుర్తింపు కోసం దరఖాస్తులు చేయలేదు. పోడు భూములు సాగు చేసుకుంటున్న వారిలో కొందరికి అటవీ హక్కు పత్రాలు, మరికొందరికి క్లెయిమ్ నెంబర్లు వచ్చాయి. కానీ ఆ భూములు కాస్త టైగర్ జోన్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, కోల్ ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి ప్రభుత్వం మళ్లీ తీసుకుంటున్నది. వీటికి భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వడం లేదు. పోడు రైతు తనకు ఉన్న భూమి కోసం పూర్తి విస్తీర్ణానికి దరఖాస్తు చేసుకుంటే అందులో సగానికే హక్కు పత్రాలు వచ్చిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి భూమినైనా కేవలం గిరిజనులకు మాత్రమే కేటాయించాలి. కానీ ప్రభుత్వం పోడు భూముల కోసం గిరిజనేతరుల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించి సర్వే చేస్తున్నది. గిరిజనేతరులకు హక్కు ఇవ్వాలంటే1931 నుంచి సాగులో ఉన్నట్లు సాక్ష్యాలను చూపాలి. నిజాం కాలం నాటి లావుణీ రూల్స్ ప్రకారం ఎవరైతే ప్రభుత్వ భూమిని వేలం ద్వారా కొంటారో వారికి పట్టాలు ఇచ్చేవారు. ఈ పద్ధతి1958 తర్వాత రద్దయింది. తర్వాతి ప్రభుత్వాలు భూమిలేని పేదలకు భూములను పంచి అసైన్డ్ పట్టాలు ఇచ్చాయి. తెలంగాణలో మొట్టమొదటి భూమి హక్కుల రికార్డు 1940లో తీసుకువచ్చిన సేత్వార్ రికార్డు. ఇది మొదటి రికార్డ్ కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో నివసించే గిరిజనేతరులకు 1963 కంటే ముందు నుంచి ఉండి ఉంటే అప్పటికే అసైన్డ్ లేదా రెగ్యులర్ రెవెన్యూ పట్టాలు వచ్చి ఉండేటివి. ఎల్టీఆర్​చట్టానికి విరుద్ధంగా ఇప్పుడు గిరిజనేతరులకు అటవీ హక్కుల పత్రాలు ఇవ్వడం చట్టవిరుద్ధం. ఉమ్మడి కుటుంబాలు వేరు పడి పోడు భూములు సాగు చేసుకుంటున్నాయి. కానీ కొత్త కుటుంబాలకు రేషన్ కార్డులు లేక పోవడంతో వారి హక్కులను గుర్తించటం లేదని వారు ఆందోళన చెందుతున్నారు. 10 ఎకరాల  కంటే ఎక్కువ  విస్తీర్ణం కలిగి ఉన్న వారు బినామిల పేరుతో హక్కులు పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా పోడు భూముల సమస్యలు అనేకం ఉన్నాయి. వీటి పరిష్కారం కోసం  ప్రభుత్వం  క్షేత్ర స్థాయి పరిశీలన చేయాల్సిన అవసరం ఉన్నది.

రెవెన్యూ, అటవీ హద్దు వివాదాలు

గతంలో పోడు రైతులకు క్లెయిమ్ నెంబర్లు, భూమి పటాలు వచ్చాయి. కానీ హక్కు పత్రాలు ఇవ్వలేదు. వీటికి రైతుబంధు కూడా వస్తున్నది. హక్కు పత్రాలు లేవు కాబట్టి ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు ఆ భూములను అటవీ శాఖ భూములని గుంజుకొని హరితహారం పేరిట మొక్కలు నాటారు. కొంతమందికి క్లెయిమ్ నెంబర్లు, మ్యాపులు వచ్చాయి. రైతుబంధు రావటం లేదు. అలాంటి వాటిని కూడా అటవీశాఖ ఆధీనంలోకి తీసుకున్నది. పోడు సాగుదారుడు 5 ఎకరాల భూమిపై హక్కుల కోసం దరఖాస్తు చేసుకుంటే 2 ఎకరాలు ఒకచోట, 3 ఎకరాలు మరొక చోట ఉన్న ఆ పోడు భూమిలో కేవలం ఒకచోట మాత్రమే సర్వే చేసే ఆప్షన్ ఉంది అంటూ జూనియర్ పంచాయతీ సెక్రటరీ, రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు కేవలం ఒక చోట మాత్రమే సర్వే చేస్తున్నారు. దీంతో సంబంధిత పోడు రైతుకు పూర్తిగా హక్కులు రావడం లేదు. అటవీ, అటవీ భూములు1980 కంటే ముందు రాష్ట్ర జాబితాలో ఉండటం మూలంగా ఎవరైతే అటవీ భూములు సాగు చేసుకున్నారో వారికి గత ప్రభుత్వలు పట్టాలు ఇచ్చాయి. 1980 తర్వాత  అటవీ, అటవీ భూములు కేంద్ర ప్రభుత్వాధీనంలోకి వెళ్లాయి. ఇప్పుడు ఏవైతే రెవెన్యూ శాఖ ఇచ్చిన పట్టా భూములు ఉన్నాయో అవి అటవీశాఖ భూములని అటవీ అధికారులంటున్నారు. ఇటు ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్​లోనూ అవి అటవీ భూములుగానే ఉన్నాయి. ఇలా రెవెన్యూ శాఖ పట్టాలు ఇస్తే అటవీశాఖ వాటిని గుంజుకుంటున్నది. హద్దు వివాదాలు కలిగిన భూములు దాదాపు 20 లక్షల ఎకరాల వరకు ఉంటాయని అంచనా. - వి. నాగరాజు, వర్కింగ్​ ప్రెసిడెంట్, ఆదివాసి నవ నిర్మాణ సేన