వీ6 న్యూస్ యూట్యూబ్ చానెల్ సబ్ స్ర్కైబర్లు కోటి మంది.. అందరికీ శతకోటి వందనాలు

వీ6 న్యూస్ యూట్యూబ్ చానెల్ సబ్ స్ర్కైబర్లు కోటి మంది.. అందరికీ శతకోటి వందనాలు

హైదరాబాద్, వెలుగు: ప్రేక్షకుల అంతులేని ఆదరణతో వీ6 న్యూస్ చానెల్ అతి పెద్ద మైలురాయిని అందుకుంది. వీ6 న్యూస్ యూట్యూబ్ చానెల్ సబ్ స్ర్కైబర్ల సంఖ్య మంగళవారం నాటికి కోటి దాటింది. దీంతో వీ6 న్యూస్​కు యూట్యూబ్ నుంచి ప్రతిష్టాత్మక డైమండ్​ బటన్ దక్కనుంది. సోషల్ మీడియా వేదికల్లో కోటి మంది ఫాలోవర్స్​ను సాధించడమంటే చిన్న ముచ్చటేం కాదు.. అందులోనూ న్యూస్ చానెళ్లకు, ఒక భాషకు, ఒకే ప్రాంతానికి పరిమితమైన వాటికి ఈ రికార్డు దాదాపు అసాధ్యం, అనూహ్యం. 

అయితే తెలంగాణకు ప్రతిరూపంగా ఉద్యమ సమయంలో వచ్చిన వీ6 న్యూస్ ను జనం తమ ఇంటి చానెల్ గా ఆదరించారు. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీతో సోషల్ మీడియాలోనూ ఫాలోవర్స్ గా మారారు. ఇంతటి జనాదరణ వల్లే ఎట్లాంటి పెయిడ్ ప్రమోషన్స్, ప్రాపగాండాలు లేకుండా ఆర్గానిక్ గా వీ6 న్యూస్ యూట్యూబ్ చానెల్ కోటి మంది సబ్ స్ర్కైబర్లను చేరుకుంది. అచ్చమైన సమాచారంతో పాటు మన భాష, మన సంస్కృతి, స్ఫూర్తినిచ్చే విషయాలు, పాజిటివ్ ఆలోచనలను పెంచే కథనాలతో ఏపీ, ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో స్థిరపడిన తెలుగువారికీ దగ్గరైంది. రేటింగ్స్ పోటీకి, సంచలనాలకు దూరంగా ఉద్యమానికి, జనం ఆకాంక్షలకే వీ6 పెద్దపీట వేసింది.

మన భాషకు, సంస్కృతి, సంప్రదాయాలకు గౌరవం పెంచేలా కథనాలను ప్రసారం చేసింది. టీవీ చూసే జనాన్ని రేటింగ్ ఇచ్చే మీటర్లుగా భావించే మీడియా అలవాటును బద్దలుకొట్టింది. జనం ఉద్వేగాలను గౌరవించడం, వారి మంచిచెడ్డలను ఉన్నదున్నట్లు చెప్పడమే పాలసీగా పెట్టుకుంది. అందుకే జనం గొప్పగా ఆదరించారు. కోటిమంది సబ్ స్ర్కైబర్లుగా మారారు. ఈ సందర్భంగా అందరికీ వీ6 -వెలుగు టీమ్ శతకోటి వందనలు చెబుతోంది. 

1,100 కోట్ల వ్యూస్.. 

తెలంగాణ ఉద్యమ కాలంలో 2012 మార్చిలో వీ6 న్యూస్ చానెల్ జనం ముందుకొచ్చింది.  దాదాపు ఏడాది తర్వాత 2013 జనవరి 26 నుంచి యూట్యూబ్ చానెల్ ప్రారంభమైంది. మొదలైన తర్వాత ఏడాదిన్నరకే 2015 ఆగస్టు నాటికి లక్ష మంది సబ్ స్ర్కైబర్లను చేరుకుంది. ఆ తర్వాత రెండేండ్లకు 2017 సెప్టెంబర్ నాటికి 10 లక్షల మంది సబ్ స్ర్కైబర్లను చేరుకుని.. యూట్యూబ్ నుంచి గోల్డెన్ బటన్ అందుకున్న మొదటి తెలుగు న్యూస్ చానెల్ గా రికార్డు సాధించింది. 2020 జూన్ నాటికి 50 లక్షల మంది సబ్ స్ర్కైబర్ల మైలురాయిని చేరుకుంది. ఆ తర్వాత మూడున్నరేండ్లలో మరో 50 లక్షల మందితో కోటి సబ్ స్ర్కైబర్ల మార్క్ ను సాధించింది. ఇది రాష్ట్రం మొత్తం జనాభాలో 25 శాతం కంటే ఎక్కువే కావడం విశేషం. అట్లాగే యూట్యూబ్ లో ఆల్ టైమ్ వ్యూస్ 1,100 కోట్లతో తెలుగు న్యూస్ ప్లాట్ ఫామ్స్ లోనే మరో రికార్డు సాధించింది వీ6.