
సీఎంగా కేసీఆర్ బాధ్యతలు తీసుకున్న కొంతకాలానికే కృష్ణా జలాల విషయంలో నాటి సర్కారు తీసుకున్న నిర్ణయం షాక్‌కు గురిచేసింది. 811 టీఎంసీల కృష్ణా జలాల్లో 512 టీఎంసీలు ఏపీ, 299 టీఎంసీలు తెలంగాణ పంచుకునేందుకు అంగీకరిస్తూ 2015లో బీఆర్ఎస్ సర్కారు సంతకాలు చేయడంతో రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలపై తొలిపిడుగు పడింది. 2016 అపెక్స్ కౌన్సిల్ మీటింగ్‌లో నదుల అనుసంధానం ప్రాజెక్టుపై కేసీఆర్ చేసిన ప్రతిపాదన తెలంగాణకు మరో ఎదురుదెబ్బ. గోదావరి ద్వారా ఏటా 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని ఏపీ రాయలసీమకు మళ్లించవచ్చన్న ఆయన సూచనతో చంద్రబాబు బుర్రలో బనకచర్ల ఆలోచన మొగ్గ తొడిగింది.
అటు గోదావరిపై రీ ఇంజినీరింగ్ పేరుతో ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టును మేడిగడ్డకు తరలించిన కేసీఆర్, రికార్డుల కోసం మూడేండ్లలో పూర్తిచేయగా, అంతే వేగంతో కుంగిపోయింది. లక్ష కోట్లు పెట్టిన కాళేశ్వరం కథ లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వకుండానే కంచికి చేరింది. తెలంగాణ ప్రజల ఉద్యమ ఆకాంక్షలకు విరుద్ధంగా జరుగుతున్న ఈ పరిణామాలను ప్రారంభంలోనే పసిగట్టిన ‘వీ6 వెలుగు’ బాధ్యతాయుతమైన మీడియా హౌస్‌గా బీఆర్ఎస్ పాలకుల తప్పులను ఎప్పటికప్పుడు ఎత్తిచూపుతూ వచ్చింది. ముఖ్యంగా కృష్ణా జలాల విచ్చలవిడి దోపిడీకి ఏపీ సర్కారు చేస్తున్న కుట్రలను బయటపెట్టడం ద్వారా తెలంగాణ ప్రభుత్వాన్ని మేల్కొలిపే ప్రయత్నం చేసింది. ‘వీ6 వెలుగు’ కథనాలతో అప్రమత్తమై తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు న్యాయపోరాటం చేయాల్సిన నాటి బీఆర్ఎస్ సర్కారు ఉల్టా ‘వీ6వెలుగు’ మీడియా హౌస్‌పైనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడింది. ఈ క్రమంలో వీ6 చానల్, వెలుగు పేపర్‌ను బ్యాన్చేసినా, ప్రకటనలు బంద్‌పెట్టి, ఆర్థికంగా దెబ్బతీసినా ఏనాడూ వెనుకడుగు వేయలేదు. నాటి సంగమేశ్వరం నుంచి నేటి బనకచర్ల దాకా ఏపీ జలదోపిడీ కుట్రలను ‘వీ6 వెలుగు’ బయటపెడ్తూనే ఉన్నది. అధికారంలో బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా తన నిఖార్సైన కథనాలతో.. మొద్దు నిద్ర పోతున్న పాలకులను తట్టి లేపుతూనే ఉన్నది. ముఖ్యంగా ఉద్యమకాలంలో ‘పోతిరెడ్డిపాడుకు పాతరేస్తాం’ అన్న నాయకుడే.. సీఎం అయ్యాక కీలకమైన ‘పాలమూరు– రంగారెడ్డి’కి పాతరేసి, ‘రాయలసీమను సస్యశ్యామలం చేస్తాం’ అంటూ మాటమార్చడాన్ని ఆయా సందర్భాల్లో ఎత్తిచూపింది. తెలంగాణ వచ్చే నాటికి పోతిరెడ్డి పాడు సామర్థ్యం 44వేల క్యూసెక్కులైతే.. కేసీఆర్–జగన్ హయాలో చేపట్టిన విస్తరణ తర్వాత ఆ గండి కాస్తా 80వేల క్యూసెక్కులకు ఎలా చేరిందో ‘వీ6 వెలుగు’ తన కథనాల ద్వారా కండ్లగట్టింది. 2020 మేలో జగన్ సర్కారు జారీ చేసిన 203 జీవో మన కృష్ణా జలాల హక్కులను ఎలా కాల రాసిందో ఎలుగెత్తి చాటింది.
సంగమేశ్వరం వద్ద రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్‌కు ఏపీ సర్కారు చేపడుతోందని, దీనిపై స్పందించాలని కోరుతూ 2020 డిసెంబర్13న ‘సారూ సంగమేశ్వరం కడ్తున్నరు..’ అంటూ సాక్ష్యాధారాలతో ‘వీ6వెలుగు’ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ‘నిద్రపోయేవాళ్లను లేపగలం.. కానీ నిద్ర నటించేవాళ్లను లేపలేం’ అన్నట్లుగా ఈ కథనం తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించినా, కేసీఆర్ సర్కారు మాత్రం అప్పట్లో స్పందించలేదు. కానీ ‘వీ6 వెలుగు’ పట్టువదలని విక్రమార్కుడిలా వరుస కథనాలతో విజృంభించడంతో నాటి ప్రభుత్వం ఇరిగేషన్ సెక్రటరీతో కేఆర్ఎంబీకి నామమాత్రంగా లేఖలు రాయించి, మమ అనిపించింది. నాటి కేసీఆర్ సర్కారు చేసిన ఈ నిర్లక్ష్యమే నేడు తెలంగాణ రైతుల పాలిట శాపంగా మారింది. మొత్తంగా తెలంగాణ రాకముందు 2004 నుంచి 2014 వరకు పదేండ్ల కాలంలో 770 టీఎంసీల కృష్ణా జలాలను ఏపీ ఎత్తుకెళ్తే.. 2014 నుంచి 2023 వరకు తొమ్మిదేండ్ల కాలంలో 1,225 టీఎంసీలను ఏపీ దోచుకెళ్లింది.