వ్యాక్సిన్​ వేసుకున్నవారియర్స్​ సేఫ్​

వ్యాక్సిన్​ వేసుకున్నవారియర్స్​ సేఫ్​
  • కరోనా నుంచి రక్షణ కవచంలా కాపాడుతున్న టీకాలు
  • ధైర్యంగా సేవలందిస్తున్న డాక్టర్లు, మెడికల్ స్టాఫ్, పోలీసులు, శానిటేషన్ సిబ్బంది
  • దేశంలో 45 ఏళ్లు దాటినోళ్లకు కొనసాగుతున్న టీకా ప్రక్రియ
  • సెకండ్ వేవ్ తర్వాత వ్యాక్సిన్లకు పెరిగిన డిమాండ్
  • టీకాతోనే హెర్డ్ ఇమ్యూనిటీ అంటున్న ఎక్స్ పర్టులు
  • వ్యాక్సినేషన్ ను స్పీడ్ అప్ చేయాలని సూచనలు

హైదరాబాద్, వెలుగు: కరోనా రాకుండా వ్యాక్సిన్లు సమర్థంగా పని చేస్తున్నాయి. టీకాలు వేసుకున్నోళ్లు సేఫ్​గా ఉంటున్నారు. కరోనా వస్తుందనే భయం వీడి.. కాన్ఫిడెన్స్​తో పనులు చేసుకుంటున్నారు. రాష్ట్రమంతటా గత ఏడాది క్షణం తీరిక లేకుండా సేవలందించిన ఫ్రంట్ లైన్ వర్కర్లు చాలా మంది వైరస్ బారిన పడ్డారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. సెకండ్ వేవ్ లో మాత్రం ఫ్రంట్ లైన్ వారియర్లలో దాదాపుగా అందరూ వైరస్ ముప్పును తప్పించుకున్నారు. ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవటంతో తమ ఆరోగ్యానికి ఢోకా లేదనే భరోసాతో డ్యూటీలు చేస్తున్నారు. ఫ్రంట్ లైన్లో ఉన్న డాక్టర్లు, నర్సులు, పోలీసులు, శానిటేషన్ వర్కర్లందరిలోనూ అదే ధీమా వ్యక్తమవుతోంది. సెకండ్ వేవ్ స్పీడ్ ఎక్కువగా ఉన్నా.. కొత్త మ్యుటెంట్లు వచ్చినా.. వీళ్లకు వైరస్ సోకే ప్రమాదం లేదని డాక్టర్లు చెబుతున్నారు.

టీకా ధైర్యంతోనే ఫీల్డ్​లో..
కరోనాను ఎదుర్కొనే ఏకైక ఆయుధం టీకానే. దేశవ్యాప్తంగా జనవరి 18న వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. ఫ్రంట్ లైన్ వర్కర్లందరికీ టీకా వేయటం దాదాపుగా పూర్తి కావచ్చింది. కరోనా టైమ్​లో ముందు వరుసలో నిలబడి సేవలందించిన డాక్టర్లు, నర్సులు, పోలీసులు, శానిటేషన్​ సిబ్బంది ఈ జాబితాలో ఉన్నారు. ఇప్పటికే వారిలో చాలా మందికి ఫస్ట్ డోస్ టీకా పడగా, సగానికిపైగా సెకండ్ డోస్ కూడా తీసుకున్నారు. రాష్ట్రంలో మంగళవారం వరకు 2,46,119 మంది హెల్త్ కేర్ వర్కర్లకు ఫస్ట్ డోస్ వేయగా, ఇందులో 1,87,399 మంది రెండు డోసులు పూర్తి చేసుకున్నారు. అలాగే ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఫస్ట్ డోస్ 2,48,553 మందికి వేయగా, ఇందులో 91,377 మందికి సెకండ్ డోస్ పూర్తయ్యింది. టీకా వేసుకున్న వారంతా కరోనా రోగులకు సేవలందించడంలో చాలా కాన్ఫిడెంట్​గా పనిచేస్తున్నారు. కరోనా సోకినా తమకు ఏం కాదన్న ధీమాతో ఉన్నారు. 

వైరస్ సోకినా ఏం కాదు..
దేశవ్యాప్తంగా కరోనా కేసులను పరిశీలిస్తే రెండు డోసులు వేసుకున్న వారిలో 90 శాతం మందికి కరోనా సోకడం లేదు. సోకినా ప్రభావం చూపడం లేదు. ఈ రెండు డోసులు వేసుకున్నవారిలో యాంటీబాడీస్ అభివృద్ధి చెందడంతో కరోనాను ఎదుర్కొనే రక్షణ లభిస్తోంది. ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పా.. టీకా వేయించుకున్నవారు కరోనాతో చనిపోయిన దాఖలాలు లేకపోవడమే ఇందుకు నిదర్శనమని హెల్త్ ఎక్స్ పర్టులు అంటున్నారు. ఏ విధంగా చూసినా వ్యాక్సిన్‌ తో లాభమేగానీ నష్టం లేదని చెప్తున్నారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న కొవిషీల్ట్, కొవాగ్జిన్ టీకాల ఎఫికసీ రేట్ దాదాపు 75 శాతం నుంచి 80 శాతం ఉంటుందని వివిధ రీసెర్చ్ లలో వెల్లడైందని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ వేసుకున్నా సరే ప్రభావం ఉంటుందని.. టీకా వేసుకున్నాక వారం తర్వాత వైరస్ సోకే అవకాశాలు లేవని డాక్టర్లు అంటున్నారు. సెకండ్ డోస్ వేసుకున్న వారిలో వైరస్ను తట్టుకునే సామర్థ్యం అంతకంతకూ పెరుగుతుందని చెబుతున్నారు. రాష్ట్రంలో ఫ్రంట్ లైన్ వర్కర్లు సెకండ్ వేవ్ లో కరోనా బారిన పడకుండా ఉండటానికి కారణం వ్యాక్సిన్ రిజల్టేనని అంచనా వేస్తున్నారు. తొలుత టీకాపై భయాందోళనలతో జనం వ్యాక్సిన్ వేసుకునేందుకు వెనుకడుగు వేశారు. అయితే వ్యాక్సిన్ వేసుకున్న వారికి వైరస్ సోకకపోవటం, సోకినా ప్రాణాపాయం లేదని తేలటంతో టీకాలకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. 

పేదలకు ఫ్రీగా వేయాలి
వ్యాక్సిన్ పై మొదట్లో అపోహలుండేవి. మేం  తీసుకున్నాక భరోసా వచ్చింది. ఇండియా కూడా మాస్క్ ఫ్రీ దేశంగా మారాలి. అన్ని రకాల వ్యాక్సిన్లు దేశానికి తీసుకురావాలి. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ ను ప్రజలకు ఇవ్వాలి. పేదలకు ఫ్రీగా వేయాలి.
‑ డాక్టర్ రమేశ్, జనరల్ సర్జన్, ఉస్మానియా హాస్పిటల్

90 శాతం మంది సేఫ్ 
వ్యాక్సిన్ వేసుకున్న 90 శాతం మంది సేఫ్ గా ఉన్నారు. కొద్ది మందికి స్వల్పంగా అనారోగ్యం వచ్చింది. కొద్దిశాతం మరణాలను పెద్దవిగా చేసి చూపించారు. వ్యాక్సిన్ పై అపోహలు అవసరం లేదు. ప్రజల్లో కూడా నమ్మకం పెరిగింది. దేశంలో టీకాల ఉత్పత్తి పెంచాలి. వ్యాక్సిన్ కొనుగోలు అంశం కేంద్రం చూసుకోవాలి. 
- డాక్టర్ రంగారెడ్డి, ప్రెసిడెంట్, ఇన్ఫెక్షన్ డిసీజ్ కంట్రోల్ అకాడమీ

వ్యాక్సిన్​తో మంచి రిజల్ట్ 
వ్యాక్సిన్‌‌ చాలా మంచి రిజల్ట్స్‌‌ ఇస్తోంది. గతేడాది ఫ్రంట్‌‌ లైన్ వారియర్స్ లో డెత్‌‌ రేట్‌‌ ఎక్కువగా ఉంది. ఈ సారి కొవాగ్జిన్‌‌ టీకా కవచంగా పనిచేసింది. మా కమిషనరేట్‌‌ లిమిట్స్‌‌లో అందరికీ రెండు డోసుల వ్యాక్సినేషన్ కంప్లీట్‌‌ అయ్యింది. ఎవ్వరికీ ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తలేదు. కేవలం ప్రెగ్నెంట్‌‌, ఇతర హెల్త్ సమస్యలు ఉన్న సిబ్బంది మాత్రమే వ్యాక్సిన్‌‌ తీసుకోలేదు.
- వీసీ సజ్జనార్‌‌‌‌, సీపీ, సైబరాబాద్‌‌

ధైర్యంగా పనిచేస్తున్నరు
వ్యాక్సిన్ వేసుకున్న వారు ధైర్యంగా పని చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఔట్ సోర్సింగ్ పద్ధతిన 27 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. గతేడాది కంటెయిన్ మెంట్ జోన్లలో పనిచేసి పాజిటివ్ ఉన్నవారి చెత్తను ఎత్తి చాలా మంది కార్మికులు కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు రెండు డోసులు వేసుకున్న వారు భయపడకుండా పనిచేస్తున్నారు. 
- ఊదరి గోపాల్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రెసిడెంట్