వ్యాక్సినేషన్ బార్.. కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే బీర్ ఫ్రీ

వ్యాక్సినేషన్ బార్.. కరోనా వ్యాక్సిన్ వేయించుకుంటే బీర్ ఫ్రీ

కరోనా వైరస్‌తో ప్రపంచం మొత్తం అతలాకుతలం అయింది. వైద్యుల కృషితో త్వరలోనే కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అయితే చాలామంది వ్యాక్సిన్ మీద అపనమ్మకంతో వేసుకోవడానికి ముందుకురావడంలేదు. వైరస్‌కు విరుగుడుగా ప్రతి ఒక్కరూ రెండు డోసులు వేసుకోవాల్సి ఉండగా.. చాలామంది ఒక డోస్ మాత్రమే వేసుకొని, మరో డోసు వేసుకోవడంలేదు. అలాంటి వారితో రెండో డోసు కూడా వేయించాలనే ఉద్దేశంతో ఇజ్రాయేల్ దేశంలోని టెల్ అవీవ్ పట్టణంలో ఒక స్పెషల్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఆ దేశంలోని 9 మిలియన్ల జనాభాలో ఇప్పటివరకు 43 శాతానికి కన్నా ఎక్కువ మంది ఫైజర్ వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. కానీ, రెండో డోసు తీసుకోవడానికి ఇష్టపడటంలేదు. దాంతో టెల్ అవీవ్ మున్సిపాలిటీలోని జెనియా గ్యాస్ట్రోపబ్ అందరినీ ఆకట్టుకునే ఆఫర్‌ను పెట్టింది. ఎవరైతే రెండో వ్యాక్సిన్ వేసుకుంటారో వారికి తమ పబ్‌లో ఫ్రీ బీర్ ఇస్తామని ఆఫర్ పెట్టింది. అంతేకాకుండా వ్యాక్సిన్ కోసం ఎక్కడికో వెళ్ళనవసరం లేదని.. తమ దగ్గరే వ్యాక్సిన్ వేసుకునే సదుపాయం కూడా ఉందని తెలిపింది. ఇంకేముంది.. బీరు ప్రియులు ఆ పబ్ ముందు బారులు తీరారు. అటు వ్యాక్సిన్‌ వేయించుకోవచ్చే.. ఇటు బీరు తాగొచ్చు అని జనాలు వ్యాక్సిన్ వేసుకోవడానికి మొగ్గుచూపుతున్నారు.

‘టీకా వేసుకోవడానికి ఇది మంచి అవకాశం. నాకు వ్యాక్సిన్ సెంటర్‌కు వెళ్లి వ్యాక్సిన్ వేయించుకోవడానికి టైం కుదరడంలేదు. అందుకే పబ్‌లో వ్యాక్సిన్ వేయించుకున్నా. అటు వ్యాక్సిన్ వేయించుకున్నా.. ఇటు బీరు తాగాను’ అని మే పెరెజ్ అనే వ్యక్తి తెలిపాడు.

వ్యాక్సినేషన్ బార్ ఏర్పాటు చేయడంపై పబ్ యాజమాన్యం కూడా సంతోషంగా ఉంది. ‘కరోనా టైంలో పబ్‌లు, బార్లు తీవ్రంగా నష్టపోయాయి. ఇప్పుడిప్పుడే బిజినెస్ ఊపందుకుంటుంది. పబ్లిక్‌ను ఆకర్షించడం కోసం ఈ ఆఫర్ పెట్టాం. అటు వ్యాక్సిన్ వేస్తూ కరోనాను నిర్మూలిస్తున్నాం.. అదే సమయంలో మా బిజినెస్ కూడా పెంచుకుంటున్నాం. వ్యాక్సిన్ తీసుకున్న వారికోసం నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్‌ను ఫ్రీగా అందిస్తున్నాం’ అని ఆ పబ్ ప్రతినిధి తెలిపారు.

For More News..

మార్స్‌పై సేఫ్‌గా దిగి ఫోటో పంపిన నాసా రోవర్

పోలీస్‍ కావాల్సినోడు.. బతుకు పోరాటం చేస్తుండు